logo

వసతి కష్టాలు ఇక దూరం

శిథిలావస్థకు చేరిన భవనం.. అరకొర గదులు.. అపరిశుభ్ర పరిసరాలు.. అసౌకర్యాల నడుమ కాలం వెల్లదీసిన విద్యార్థినుల ఇబ్బందులు ఇక తీరనున్నాయి.

Published : 30 Jun 2024 03:33 IST

సెంటినరీకాలనీ కేజీబీవీకి నూతన భవనం

పూర్తయిన కేజీబీవీ భవనం

న్యూస్‌టుడే, కమాన్‌పూర్‌(సెంటినరీకాలనీ): శిథిలావస్థకు చేరిన భవనం.. అరకొర గదులు.. అపరిశుభ్ర పరిసరాలు.. అసౌకర్యాల నడుమ కాలం వెల్లదీసిన విద్యార్థినుల ఇబ్బందులు ఇక తీరనున్నాయి. రామగిరి మండలం సెంటినరీకాలనీలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయానికి సొంత భవన నిర్మాణం ఎట్టకేలకు పూర్తి కాగా వచ్చే నెలలో ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

2017లో సెంటినరీకాలనీలో కేజీబీవీ ప్రారంభించారు. సొంత భవనం లేకపోవడంతో సింగరేణి సంస్థ భవనాన్ని కేటాయించింది. 6 నుంచి 10 వరకు తరగతులు నిర్వహిస్తుండగా ప్రస్తుతం 220 మంది విద్యార్థినులు చదువుతున్నారు. శిథిలావస్థకు చేరిన సింగరేణి భవనంలో పది గదులున్నాయి. అందులోనే వసతిగృహం ఏర్పాటు చేశారు. గదులు తరగతులకే సరిపోక, వసతి కష్టంగా మారింది.

వచ్చే నెలలో ప్రారంభం

సెంటినరీకాలనీ కస్తూర్బా విద్యాలయానికి సొంత భవనానికి రూ.3.50 కోట్లు మంజూరు కాగా 2021 డిసెంబరులో పన్నూరులో నిర్మాణం పనులు ప్రారంభించారు. స్థలం సమస్యతో కొన్నేళ్లు పనులు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు మొదలు కాగా మూడేళ్లకు పూర్తి చేశారు. ప్రస్తుతం అన్ని రకాల వసతులతో కళాశాల భవనం రూపుదిద్దుకుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో తరగతులు, ఒకటి, రెండో అంతస్థుల్లో విద్యార్థినుల వసతి ఏర్పాటు చేశారు. అయిదు తరగతి గదులు, భోజనశాల, వంట, ప్రిన్సిపల్‌ గదులు ప్రత్యేకంగా నిర్మించారు. పూర్తి స్థాయి వసతులతో నిర్మాణం పూర్తయిన భవనాన్ని ఇప్పటికే కేజీబీవీకి అప్పగించారు. ప్రస్తుతం విద్యుత్తు సరఫరా పనులు జరుగుతుండటంతో వచ్చే నెలలో ప్రారంభిందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని