logo

వైద్యుల భర్తీకి చర్యలు.. తీరనున్న ఇబ్బందులు

ఎంబీబీఎస్‌ విద్యార్హతతో సివిల్‌ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లోని కొన్ని విభాగాల్లో వైద్యుల కొరత తీరనుంది.

Published : 30 Jun 2024 03:28 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

ఎంబీబీఎస్‌ విద్యార్హతతో సివిల్‌ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లోని కొన్ని విభాగాల్లో వైద్యుల కొరత తీరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు మల్టీ జోన్లలో మొత్తం 435 సివిల్‌ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటన జారీ చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే అన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత తీరనుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రామగుండంతో పాటు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. ఆయా కళాశాలల్లోని క్యాజువాలిటీ మెడికల్‌ అధికారుల పోస్టులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నియామక ప్రకటనతో భర్తీ కానున్నాయి. వైద్య కళాశాలల్లోని ఆచార్యులు, సహఆచార్యులు, సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ నిర్వహణ వైద్య విద్య విభాగానికి రాగా ఆయా కళాశాలల్లో పనిచేసే క్యాజువాలిటీ మెడికల్‌ అధికారుల భర్తీ, నిర్వహణ రాష్ట వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది. ఒక్కో కళాశాలలో సుమారు 8 మంది క్యాజువాలిటీ మెడికల్‌ అధికారుల పోస్టులను ప్రకటించగా దాదాపు ఖాళీగానే ఉన్నాయి. బోధనాసుపత్రుల్లోనూ రెసిడెంట్ మెడికల్‌ అధికారుల పోస్టుల భర్తీ, నిర్వహణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉండగా ఒక్కో బోధనాసుపత్రిలో సుమారు 8 మంది రెసిడెంట్ మెడికల్‌ అధికారులు ఉంటారు. గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో 8 ఆర్‌.ఎం.ఒ. పోస్టులుండగా నలుగురు విధుల్లో ఉన్నారు. మరో నాలుగు ఖాళీగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నలుగురు సివిల్‌ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా ప్రకటనతో ఈ పోస్టులు భర్తీ అయ్యే అవకాశముంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు ఒప్పంద విధానంలో పనిచేస్తుండగా ఆయా పోస్టుల్లోనూ రెగ్యులర్‌గా సివిల్‌ అసిస్టెంట్ సర్జన్లతో భర్తీ చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని