logo

నిధులున్నా పనులు జాప్యం

వర్షాకాలం ప్రారంభమైతే చాలా పల్లెల నుంచి మండల.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రయాస తప్పదు. ఒక్కసారిగా కురిసే వర్షంతో వరద రహదారులు.. లోలెవల్‌ కాజ్‌వేలపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.

Updated : 30 Jun 2024 06:40 IST

అసంపూర్తి వారధులతో ప్రయాణం నరకం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల

మానేరు వాగుపై లింగన్నపేట వద్ద వంతెన నిర్మించే ప్రాంతం

వర్షాకాలం ప్రారంభమైతే చాలా పల్లెల నుంచి మండల.. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రయాస తప్పదు. ఒక్కసారిగా కురిసే వర్షంతో వరద రహదారులు.. లోలెవల్‌ కాజ్‌వేలపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు అత్యవసర వైద్యసేవలు, ఇతరత్రాల పనులకు ప్రత్యామ్నాయం మార్గాలు చూసుకోవాలి.. లేదంటే అదే వరద ప్రవాహాన్ని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి. వాగులపై కాజ్‌వేలు ఉన్నచోట వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరైన చోట పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరికొన్నిచోట్ల మంజూరైన నిధులు ప్రభుత్వం మారడంతో వెనక్కి వెళ్లాయి. వంతెనల నిర్మాణాలు జరిగి అప్రోచ్‌ రహదారుల్లేక రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

జిల్లాలో పరిస్థితి

జిల్లాలో రెండేళ్లుగా వాగులు, వంకలపై వంతెనల నిర్మాణాలకు విడతలవారీగా నిధులు మంజూరయ్యాయి. కాగా ఇప్పటికీ ఎక్కడా పనులు పూర్తయిన దాఖలాల్లేవు. అధికారుల పర్యవేక్షణాలోపం.. గుత్తేదారుల అలసత్వం పనులు సాగక రాకపోలకు అవస్థలు తప్పడంలేదు. వాగులు, వంకలు ఉన్న ప్రాంతాల్లో రహదారిపై నుంచి నీరు ప్రవహించినపుడు బారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను మళ్లిస్తున్నారు.

హన్మాజీపేట వద్ద వంతెన నిర్మాణ ప్రాంతంలో
వరద కోతకు గురైన తాత్కాలిక రహదారి

  • గంభీరావుపేట మండలం లింగన్నపేట వద్ద మానేరువాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.10.60 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏడాది క్రితం పనులు ప్రారంభించిన గుత్తేదారులు పాత వంతెన శిథిలాలను తొలగించారు. పిల్లర్ల నిర్మాణాలకు గుంతలు తీశారు. తాత్కాలికంగా వాగులో మట్టిదారిని నిర్మించారు. ప్రధాన పనులు ప్రారంభంకాలేదు. ఇదే మండలం మల్లుపల్లి వద్ద లోతువాగు నుంచి వచ్చే వరదకు రహదారి ఏటా కోతకు గురవుతుంది. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. ఈ మార్గంలో ముస్తాబాద్, ముచ్చర్ల, కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా ముస్తాబాద్, సిద్దిపేట, దుబ్బాకకు వెళ్లేవారు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
  •  సిరిసిల్ల- మరిమడ్ల మార్గంలో వెంకట్రావుపేట వద్ద పెంటివాగుపై వంతెన నిర్మాణానికి ఏడాది క్రితం రూ.10 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభం కాలేదు. చిన్నపాటి వర్షానికే రహదారిపైకి వరదనీరు వచ్చిచేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
  •  కోనరావుపేట- వేములవాడ మండలాల మధ్య ఉన్న మూలవాగుపై మామిడిపల్లి- నిజామాబాద్, బావుసాయిపేట- వెంకట్రావుపేట, వట్టిమల్ల- నిమ్మపల్లి ప్రాంతంలో వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం రూ.54 కోట్లు మంజూరయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు టెండర్ల దశలో ఉన్నాయి. తీరా ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం మారడంతో నిధులు వెనక్కి వెళ్లాయి. ఈ మూడు చోట్ల లోలెవల్‌ వంతెనలు వరద ఉద్ధృతికి కొట్టుకుపోగా తాత్కాలికంగా పైపులు, మట్టితో రహదారిని నిర్మించారు. వరదకు ఇవీ కొట్టుకుపోయే స్థితిలో ఉన్నాయి.
  •  వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట వద్ద నక్కవాగుపై రూ.11.55 కోట్లతో నిర్మిస్తున్న హైలెవల్‌ వంతెన పిల్లర్ల దశలో నిలిచిపోయింది. బుధవారం కురిసిన వర్షానికి తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. లింగంపల్లి, మంగళపల్లి, సుద్దాల గ్రామాల వారు మారుపాక, నందికమాన్‌ మీదుగా వేములవాడకు వెళ్తున్నారు. వేములవాడ పట్టణ శివారులో బీరప్ప ఆలయం సమీపంలో మల్లారం రహదారిలో లోలెవల్‌ కాజ్‌వే శిథిలావస్థకు చేరింది. రెండేళ్లుగా కనీస మరమ్మతులకు నోచుకోవడంలేదు. కోరుట్ల రహదారిలో ఎస్‌ఆర్‌ఆర్‌ కల్యాణ మండలం వద్ద మర్రిపల్లి మార్గంలోనూ లోలెవల్‌ కాజ్‌వే శిథిలావస్థకు చేరుకుంది.
  •  తంగళ్లపల్లి మండలం జిల్లెల-ముస్తాబాద్‌ మార్గంలో నక్కవాగుపై హైలెవల్‌ వంతెన నిర్మాణానికి ఏడాదిన్నర క్రితం రూ.6.5 కోట్లు మంజూరయ్యాయి. అటవీశాఖ అనుమతులు రాక పనులు నిలిచిపోయాయి.
  •  ఎల్లారెడ్డిపేట-వీర్నపల్లి మార్గంలో అలస్మాస్‌పూర్, ఎల్లారెడ్డిపేట శివారులో వంతెనలు నిర్మించి దానికి అప్రోచ్‌ రహదారి నిర్మాణం మరిచారు. దీంతో వర్షాలకు వాహనదారులు రాకపోకలకు ఇబ్బందిగా మారింది

గడువులోగా పూర్తి

వంతెన నిర్మాణాలు ప్రారంభించిన గుత్తేదారులను వారి గడువులోగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లెల వంతెన నిర్మాణానికి రెండు నెలల్లో అటవీఅనుమతులు వస్తాయి. అప్పుడు పనులు ప్రారంభిస్తాం. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మార్గంలో అసంపూర్తిగా వంతెనల నిర్మాణం చేసిన గుత్తేదారును రద్దు చేశాం. అతనే మళ్లీ వచ్చి పనులు పూర్తయ్యేలా చూస్తానని చెప్పారు. నెలరోజుల్లో పనులు పూర్తిచేయాలని సూచించాం.

 శ్యాంసుందర్, ఈఈ, రహదారులు భవనాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని