logo

ఆలస్యమైనా.. అదను దాటలేదు

ఈ వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో లోటువర్షపాతమే నెలకొనగా మున్ముందు కురిసే వర్షాలపైనే పైర్లసాగు ఆధారపడి ఉందని పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ గాదె శ్రీనివాస్‌ తెలిపారు. సాగు యాజమాన్యాన్ని ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.

Updated : 30 Jun 2024 06:39 IST

వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాస్‌
జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే

ఈ వానాకాలంలో ఉమ్మడి జిల్లాలోని చాలా మండలాల్లో లోటువర్షపాతమే నెలకొనగా మున్ముందు కురిసే వర్షాలపైనే పైర్లసాగు ఆధారపడి ఉందని పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనస్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ గాదె శ్రీనివాస్‌ తెలిపారు. సాగు యాజమాన్యాన్ని ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి ద్వారా వివరించారు.

ప్రశ్న: ఆరుతడి పంటలను ఎప్పటివరకు విత్తుకోవచ్చు.?

జవాబు: ముందుగా పత్తి నాటినవారు మొక్కలు మొలవనిచోట పోగుడ్డలు పోయవచ్చు. కంది, పత్తిని జులై మొదటిపక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాలు మొదలైనందున కనీసం 50-70 మి.మీ వర్షం కురిసిన తరువాతనే ఆరుతడి పంటలను విత్తుకోవాలి. సోయాబీన్‌ను జులై 10 వరకు, వర్షాధారంగా మక్కను ఈ నెలాఖరువరకు, నీటి పారుదలగా మక్కను జులై చివరి వరకు విత్తుకోవచ్చు. పసుపు, మక్కను మిశ్రమ పంటలుగా జులై మొదటిపక్షం వరకు విత్తుకోవచ్చు. పెసర, మినుము, అలసంద, అనుము, కూరగాయలు తదితర అన్నిరకాల పంటలను విత్తుకునేందుకు ప్రస్తుతం అదనుంది. జనుము, జీలుగలు పెరిగిన తరువాత నేలలో కలియదున్నాలి.

ప్ర: వర్షాలు ఆలస్యమైతే వరిసాగు అదను దాటుతుందా.?

జ: 9 లక్షల ఎకరాలకుపైగా విస్తీర్ణం అంచనాగల వరిలో 150 రోజుల కాలపరిమితిగల దీర్ఘకాలిక రకాలతో నార్లుపోసుకునే గడువు దాటింది. 135 రోజుల మధ్యకాలిక, 120 రోజుల స్వల్పకాలిక, 105 రోజుల అతి స్వల్పకాలిక వరి రకాలతో నార్లకు అదనుంది. మధ్యకాలిక రకాలతో ఈ నెలాఖరు వరకు, స్వల్పకాలిక రకాలతో జులై 15 వరకు, అతిస్వల్పకాలిక రకాలతో జులై నెలాఖరు వరకు నార్లు పోసుకునే వీలుంది. ఏ రకమైనా ఆగస్టు నెలాఖరు లోపు వరినాట్లు పూర్తికావాలి. నీటిలభ్యత, నూర్పిడి, మార్కెటింగ్‌ తదితరాలనుబట్టి సన్న లేదా దొడ్డురకాలు ఎన్నుకోవాలి.

ప్ర: మేలురకం విత్తనాలను ఎక్కడి నుంచి తీసుకోవాలి.?

జ: ఇటీవలే విత్తనమేళా జరిపి రైతులకు విత్తనాలను అందించాం. సూటిరకం వరిలో బ్రీడర్, ఫౌండేషన్, ట్రూత్‌ఫుల్, సర్టిఫైడ్‌ విత్తనాలను లేదా రైతు విత్తనాన్ని తీసుకుని సాగు చేయవచ్చు. ఏ పంటయినా సరే సూటిరకాల్లో ప్రతిసీజనుకు నూతనంగా విత్తనాన్ని కొనాల్సిన అవసరంలేదు రైతు విత్తనాన్ని వాడుకోవచ్చు. కేవలం సంకర రకాల్లోనే ప్రతిపంటకూ నూతనంగా విత్తనాన్ని కొనాలి. వ్యవసాయశాఖ అథీకృత డీలర్లు, దుకాణాల్లోనే బిల్లులపై విత్తనాలను కొనాలి. గ్రామాల్లో నేరుగా విక్రయించే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను కొనవద్దు, వాడవద్దు. విత్తనమొలకశాతం పరీక్షించాలి. నీటిలభ్యత, నేలలకు అనువైన, చీడపీడలను తట్టుకునే విత్తనాలను తీసుకోవాలి.

ప్ర: రైతులకు మీరిచ్చే సలహా ఏమిటి?

జ: విత్తనోత్పత్తి చేసే రైతులు కంపెనీలచే ముందస్తు రాతపూర్వక ఒప్పందాలను చేసుకోవాలి. వరి, వేరుసెనగ, నువ్వులు తదితర రకాల మినీకిట్స్‌ను పొందిన రైతులు విత్తనాలను అభివృద్ధిచేసి తోటిరైతులకు చేరవేయాలి. రైతులు వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు, శాస్త్రవేత్తల సూచనలను పాటించాలి. పంటలపై సమస్యలువస్తే అధికారులు లేదా శాస్త్రవేత్తలను సంప్రదించాలి గానీ నేరుగా దుకాణాల్లో మందులను కొని పిచికారీ చేయవద్దు. భూసార పరీక్షల ఫలితాలను అనుగుణంగానే రసాయన ఎరువులను వాడాలి. పైర్లపై సమస్యలుంటే గుర్తించేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని పంపిస్తాము.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు