logo

ఫోన్‌ కొట్టు పరిష్కారం పట్టు

పిల్లలను వేధిస్తున్నారా.. ఈవ్‌టీజింగ్‌తో భయ పెడుతున్నారా.. అత్యవసర వైద్యం అందాలా.. రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో.. అగ్ని ప్రమాదం జరిగిందా.. ఇలాంటి పలు సమస్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ కేంద్రాలు, టోల్‌ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చాయి.

Updated : 30 Jun 2024 06:41 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, సుభాష్‌నగర్‌

పిల్లలను వేధిస్తున్నారా.. ఈవ్‌టీజింగ్‌తో భయ పెడుతున్నారా.. అత్యవసర వైద్యం అందాలా.. రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో.. అగ్ని ప్రమాదం జరిగిందా.. ఇలాంటి పలు సమస్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ కేంద్రాలు, టోల్‌ ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చాయి. ఒక ఫోన్‌ కొడితే చాలు అధికారులు వెంటనే మీ ముంగిటకు చేరి, సమస్య పరిష్కారానికి దోహదపడతారు. అలాంటి ఫోన్‌ నంబర్లపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

108 అన్ని రకాల వైద్యం కోసం

ఎలాంటి అత్యవసర వైద్యం కావాలన్నా, ప్రమాదంలో గాయపడిన వెంటనే వచ్చి తీసుకెళ్లేందుకు 108 నంబర్‌ ఉపయోగపడుతుంది. ఫోన్‌ చేసిన వారు వివరాలను స్పష్టంగా చెప్పాలి. తెలిపిన చోటుకు కుయ్‌..కుయ్‌ అంటూ వాహనం వచ్చి చేరుతుంది. మెడికల్‌ టెక్నీషియన్‌ ప్రథమ చికిత్స అందిస్తూ సమీప ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తారు.

100 పోలీసు సాయం

శాంతి భద్రతల సమస్యతో సతమతమవుతుంటే, ఏదైన విపత్కర పరిస్థితి వచ్చినా, దొంగలు వచ్చినా ఈ నంబర్‌కు డయల్‌ చేస్తే చాలు వెంటనే సమీప పోలీసుస్టేషన్‌ నుంచి పోలీసులు వచ్చి ఆదుకుంటారు.

1091 ఈవ్‌టీజింగ్‌..

ఈ నంబర్‌ కంట్రోల్‌రూం నంబర్‌. ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే ఈ నంబర్‌ను సంప్రదించాలి. వారి వివరాలు సేకరించి వేధించే వారి భరతం పడతారు.

1098 పిల్లల వేధింపులు..

ఎవరైనా పిల్లలను వేధింపులకు గురి చేసినా.. బాలలతో పనులు చేయించినా 1098కి కాల్‌ చేస్తే బాలల సంరక్షణ సమితి, పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగి చర్యలు చేపడతారు.

181 గృహహింస

గృహహింస, వరకట్నం వంటి వాటి పేరిట మహిళలను వేధిస్తే పోలీసులు, మహిళా సంక్షేమ విభాగం వారు మీ వద్దకు చేరుకొని తగిన పరిష్కారం చూపుతారు.

18001801551 కిసాన్‌ కాల్‌ సెంటర్‌

దేశంలో 25 చోట్ల కిసాన్‌ కాల్‌ సెంటర్లు ఉన్నాయి. రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ నంబర్‌ను సంప్రదిస్తే సమీప వ్యవసాయ అధికారికి సమాచారం ఇస్తారు. తగిన పరిష్కారం చూపుతారు.

18002004599

ఎయిర్‌పోర్టుకు వెళ్లే పుష్పక్‌ బస్సుల సమాచారంతో పాటు ఇతర వివరాలను తెలుసుకోవడానికి ఈ నంబర్‌ ఉపయోగపడుతుంది.

18001805232 తపాలా సేవలు

తపాలా శాఖకు సంబంధించి సమస్య ఉన్నా, బీమా వివరాలు కావాలన్నా ఈ నంబర్‌కు కాల్‌ చేస్తే కావల్సిన వివరాలను అందిస్తారని అధికారులు చెబుతున్నారు.

102 గర్భిణుల కోసం

గ్రామీణ ప్రాంతాలలో పురిటి నొప్పులతో బాధపడుతుంటే తక్షణ వైద్యం కావాలనుకునే వారు 102కు డయల్‌ చేసి మీ వివరాలు తెలిపితే తగిన సమయంలో 102 వాహనం మీ ఇంటి ముందుకు వాలిపోతుంది. వాహనంలో ఆశా కార్యకర్త లేదా ఏఎన్‌ఎం వచ్చి గర్భిణిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయిస్తారు. ఆ తర్వాత తిరిగి తీసుకు వస్తారు. పైసా ఖర్చు ఉండదు. ఆరు నెలలు, తొమ్మిది నెలల గర్భం ఉన్న వారిని కూడా వైద్య సదుపాయం కోసం గ్రామాల నుంచి ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి తీసుకొస్తారు.

1950 ఓటరు నమోదు

ఓటరు జాబితాలో పేరును ఈ నంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. నమోదుకు కావాల్సిన ధ్రువపత్రాల వివరాలను తెలుసుకోవచ్చు. ఓటు తొలగింపు, పేరు మార్పిడి, ఓటరు చిరునామా మార్పులకు ఉపయోగపడుతుంది. ఎన్నికల సమయంలో ప్రలోభాలు పెడితే ఈ నంబర్‌కు సమాచారమిస్తే వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి తనిఖీ చేసి, కేసులు నమోదు చేస్తారు.

198 టెలికాం సేవలు

ఏ నెట్‌వర్క్‌ పరిధిలోనైనా సరే ఈ నంబర్‌కు డయల్‌ చేస్తే కావాల్సిన సమాచారం అందుతోంది. బిల్లుల వివరాలు, నెట్‌వర్క్‌ మారడం, బిల్లుల రీఛార్జీలు వంటివి తెలుసుకునే వీలుంది.

18002004455 ఉపాధి హామీ

ఉపాధి హామీ పథకంలో ఎలాంటి సమస్యపైనైనా సమాచారం ఇవ్వవచ్చు. అధికారుల అవినీతి, నిర్లక్ష్యం వంటి అంశాలను నేరుగా ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చు. జాబ్‌కార్డులు ఇవ్వకపోయినా, సిబ్బంది విధులను విస్మరించినా దీని ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

101 అగ్నిమాపక

హైదరాబాద్‌ కంట్రోల్‌ రూంతో ఈ నంబర్‌ను అనుసంధానం చేశారు. అగ్ని ప్రమాదం జరిగితే ఈ నంబర్‌కు సమాచారం ఇస్తే వెంటనే సమీప అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి తగు విధంగా సహాయ పడతారు.

139 రైల్వే..

రైల్వేకు సంబంధించిన సమాచారానికి ఈ నంబర్‌ ఉపయోగపడుతుంది. దీనికి కాల్‌ చేస్తే అధికారులు అందుబాటులోకి వస్తారు. ఇంటిగ్రేటెడ్‌ రైల్వే హెల్ప్‌లైన్‌ ఇది. 12 విభిన్న భాషలలో అందుబాటులో ఉంది.

18004250028 విద్యుత్తు

విద్యుత్తు కనెక్షన్, ఇతర సమస్యలకు సంబంధించి ఈ టోల్‌ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలి. ఈ నంబర్‌కు సమాచారం ఇస్తే సమస్యను నమోదు చేసుకొని పరిష్కారమైన తర్వాత కూడా మళ్లీ విద్యుత్తు శాఖ నుంచి ఫోన్‌ చేసి తెలుసుకుంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు