logo

తీరని ధరణి సమస్యలు!

భూ సమస్యల సమగ్ర పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్‌ దరఖాస్తుల పరిష్కారంపైనా దృష్టి పెట్టింది..

Updated : 28 Jun 2024 06:05 IST

పరిష్కరించాల్సిన దరఖాస్తులు 23,953
రెండు రోజులే గడువు 

ఈనాడు, పెద్దపల్లి, న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌ : భూ సమస్యల సమగ్ర పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలులో ఉన్న ధరణి పోర్టల్‌ దరఖాస్తుల పరిష్కారంపైనా దృష్టి పెట్టింది.. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉంచిన అన్ని దరఖాస్తులను పరిష్కరించే దిశగా ఇప్పటికే కలెక్టర్‌లకు ఆదేశాలు జారీ చేసింది.. ఈ క్రమంలో రెండు విడతల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు.. పోర్టల్‌లోని కొన్ని అంశాలను కలెక్టర్‌ నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించారు.. అన్నీ సిద్ధం చేసి లాగిన్‌ ఐడీలు ఇచ్చేలోపు లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలు ముగియడంతో తాజాగా ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు.. ఈ నెల 30 వరకు దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం గడువు విధించగా  29వ తేదీన జిల్లాల కలెక్టర్లతో భూ రికార్డులు, పరిపాలన చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిత్తల్‌ సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో అధికారులు దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టారు.
ః ఈ నెలాఖరులోపు భూ సమస్యలపై దరఖాస్తులు (జీఎల్‌ఎం), టీఎం-33 మ్యాడ్యుల్‌ సమస్యలతో పాటు స్పెషల్‌ డ్రైవ్‌ దరఖాస్తులను అధికారులు పరిష్కరించనున్నారు. అధికారులు పాత దస్త్రాలను వెలికితీసి పెండింగ్‌ ఎందుకు ఉందో తెలుసుకుని ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారు

  • లోక్‌సభ ఎన్నికల కోడ్‌ సమయంలో కలెక్టరేట్‌లలో జీఎల్‌ఎం, టీఎం-33 ఆర్జీలను పరిష్కరించే ప్రక్రియ వాయిదా పడింది. ధరణి దరఖాస్తులు వేలల్లో వస్తుండటంతో గతంలో కలెక్టర్‌కు పరిష్కరించే అధికారం నుంచి ఆర్డీవో, తహసీల్దార్‌లకు సైతం సమస్యలు పరిష్కరించేలా లాగిన్‌ సౌకర్యం కల్పించారు.
  • ఆర్డీవోలకు పట్టాదారు పాసు పుస్తకం లేకుండా నాలా మార్పు, ప్రభుత్వం సేకరించిన భూముల్లో సమస్యలు, ‘ఆధార్‌ కార్డులు’ లేని ప్రవాస భారతీయులకు చెందిన భూ సమస్యలు, కోర్టు కేసులను పరిష్కరించేందుకు వీరికి అవకాశం కల్పించారు. తహసీల్దార్‌లకు జీఎల్‌ఎంలోని కులం, లింగం, తండ్రి పేరు మార్పిడి బాధ్యతలు అప్పగించారు.
  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం దరఖాస్తులు 1,61,695 రాగా ఇందులో 92,539 రెవెన్యూ సమస్యలు పరిష్కరించారు. 45,203 దరఖాస్తులను తిరస్కరించగా ఇంకా 23,953 దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంది. రెండ్రోజులే సమయం ఉండటంతో వీటిని పరిష్కరించడం గగనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

   ముమ్మర కసరత్తు

జూన్‌ నెలాఖరులోగా ధరణి పోర్టల్‌లోని సమస్యలన్నీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆయా జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగం ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్లు పెండింగ్‌లో ఉన్న ధరణి దస్త్రాలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరిస్తున్నప్పటికి చిన్న చిన్న తప్పిదాలున్న వాటిని తిరస్కరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హద్దులు సరిగా లేవని, ప్రవాసీయుల తరఫున అతని బంధువులు దరఖాస్తు చేస్తే మిస్సింగ్‌ సర్వే నంబర్లు పోర్టల్‌లో లేవని, మాన్యువల్‌ పహాణీలో ఇతరుల పేర్లు ఉన్నాయని సాకులు చెబుతూ తిరస్కరిస్తున్నారని వాపోతున్నారు..

భిన్న కారణాలు

  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సివిల్‌ కోర్టుల్లో ఉన్న వివాదాలకు సంబంధించి పలు సమస్యలు ధరణిలో పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు తీర్పు వచ్చేవరకు ఈ సమస్యలు అలాగే ఉండనున్నాయి. 
  • ధరణిలోని భూముల వివరాలకు అటవీ, దేవాదాయ, వక్ఫ్‌ శాఖల వద్ద ఉన్న రికార్డులకు పొంతన లేదు.
  • నిషేధిత జాబితా(22-ఏ)లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్‌ చెల్లదు. క్రయ, విక్రయాలు చేసే అవకాశాలు లేవు. అయితే ఈ భూములు తమవే అని సమస్య పరిష్కరించాలని చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. కాని నిషేధిత జాబితాలో ఉండటంతో పరిష్కారానికి నోచుకోవడం లేదు. 
  • ధరణిలో నమోదైన అనంతరం ‘లింక్‌’ డాక్యుమెంట్ల వివరాలు కనిపించడం లేదు. 
  • రైతులు మరణించకున్నా..మరణించినటు ధ్రువీకరణ పత్రాలు తెచ్చినవారికి మ్యుటేషన్లు జరుగుతున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు