logo

Kondagattu: కొండగట్టులో ఇంటి దొంగలు

ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నది పాత సామెత.

Updated : 12 Jan 2024 08:10 IST

అంజన్న ఆలయం

న్యూస్‌టుడే, మల్యాల: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నది పాత సామెత. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దాదాపు 50 వరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్నా ఆలయంలో తరచూ సిబ్బంది చేతివాటం విమర్శలకు తావిస్తోంది. ఆలయం ముందు ప్రత్యేక పోలీసు ఔటుపోస్టు, రక్షణ సిబ్బంది, హోంగార్డులు, ప్రైవేటు సెక్యూరిటీ ఉన్నా ఆలయంలో చోరీలపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రసాదం తయారి కేంద్రంలో ఔట్‌సోర్సింగ్‌ కింద 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగి బుధవారం హుండీ లెక్కింపు సందర్భంగా రూ.11,010 తస్కరిస్తూ పట్టుబడటం పరిస్థితులకు అద్దం పడుతోంది. 

గతంలో సంఘటనలు..

  • 2007లో హుండీ లెక్కింపు సందర్భంగా ఆలయంలో పనిచేసే ఉద్యోగి రూ.500 నోట్ల కట్టను తస్కరిస్తూ పట్టుబడి సస్పెన్షన్‌కు గురయ్యారు.
  • 2007 మార్చి17న ఆలయంలో పనిచేసే వేదపండితుడు హుండీ లెక్కింపులో పాల్గొని రూ.1650 దొంగిలించి కానిస్టేబుల్‌ చేతికి చిక్సి సస్పెండయ్యారు.
  • 2008లో హుండీ లెక్కింపు సమయంలో ఓ ఉద్యోగి ఆభరణాన్ని మింగినట్లు ఫిర్యాదు రావడంతో మరుసటిరోజు అధికారులు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌ చేయించగా కడుపులో ఆభరణం లేదని తేల్చిచెప్పారు.
  • 2023 ఫిబ్రవరి 23 అర్ధరాత్రి అంతర్రాష్ట దొంగల ముఠాకు చెందిన 8 మంది ఆంజనేయస్వామి ఆలయంలో దాదాపు 35 కిలోల ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
  • 2023 ఆగస్టులో ఆలయ పాలకవర్గంలోని ఓ ప్రముఖ వ్యక్తి హుండీ లెక్కింపు రోజు స్వామివారికి చెందిన నగను మాయం చేసినట్లు ఆలయ పాలకవర్గంలోని సభ్యుడు, స్థానిక సర్పంచి అధికారులకు ఫిర్యాదు చేయడంతో సదరు వ్యక్తిని అధికారులు సస్పెండు చేశారు.  
  • గతంలో ఆలయంలో పనిచేసే ఓ స్వీపరు అభిషేకం సందర్భంగా భక్తురాలి ఉంగరాన్ని మాయం చేయగా సదరు భక్తురాలు పోలీసులను ఆశ్రయించడంతో చివరికి నాటకీయంగా ఉంగరాన్ని పోలీసుల ద్వారా భక్తురాలికి అప్పగించారు.  

అక్రమ వసూళ్లపై నియంత్రణ కరవు

కొండగట్టులో కొందరు గుత్తేదారుల వద్ద పనిచేసే వ్యక్తులు, ఆలయ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కొబ్బరికాయలు కొట్టే చోట ఎలాంటి రుసుము లేకపోయినా భక్తుల నుంచి రూ.10 చొప్పున వసూళ్లు చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు పేర్కొంటున్నారు. కొందరు సిబ్బంది, అర్చకులు బడా కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలతో చనువు పెంచుకుని ఆలయంలో పనులు చేపట్టేపేరుతో భారీగానే దండుకుంటున్నట్లు ఆరోపణలున్నా ఉన్నతాధికారుల స్పందనలేదు. గతంలో జయంతి ఉత్సవాలు, ఇతర సందర్భాల్లో వివిధ సేవలకు సంబంధించిన టిక్కెట్ల రీఇష్యూ కూడా అయినట్లు అధికారుల తనిఖీలో వెల్లడైంది. ఆలయంలో నిఘా పెంచి ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప సిబ్బంది చేతివాటం అక్రమాలు నివారించడం అసాధ్యమని భక్తులు పేర్కొంటున్నారు. ఇటీవల కొందరు నాయకులు తమకు నచ్చినవారిని ఆలయంలో ఔట్‌సోర్సింగ్‌ కింద నియమించి వారి నుంచి భారీగానే డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని