logo

Jagtial: రికార్డుల మాస్టారు.. 39 ఏళ్లలో చదువు చెప్పిన విద్యార్థుల వివరాల నమోదు

విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు గుర్తుంచుకుంటారు. కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను విద్యాబుద్ధలు నేర్పిన విద్యార్థుల వివరాలు రికార్డులో నమోదు చేసుకున్నారు.

Updated : 03 Oct 2023 07:54 IST

తాను చదువు చెప్పిన పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న మదన్‌మోహన్‌రావు

న్యూస్‌టుడే, జగిత్యాల గ్రామీణం: విద్యాబుద్ధులు నేర్పిన గురువులను విద్యార్థులు గుర్తుంచుకుంటారు. కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తను విద్యాబుద్ధలు నేర్పిన విద్యార్థుల వివరాలు రికార్డులో నమోదు చేసుకున్నారు. ఏ ఉపాధ్యాయుడైనా తన సర్వీసులో ఎంత మందికి పాఠాలు చెప్పావు అంటే లెక్కలు ఉండవు కానీ.. ఆ ఉపాధ్యాయుడి దగ్గర మాత్రం తన వద్ద విద్య నేర్చుకున్న ప్రతి విద్యార్థి వివరాలు లభిస్తాయి. ఆ వివరాల ఆధారంగా చరవాణిలో వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థుల కుటుంబాల పరిస్థితి, యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.

జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం రామాజీపేటకు చెందిన నందెల్లి మదన్‌మోహన్‌రావు 1984లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. మొదట రాయికల్‌ మండలం వీరాపూర్‌లో రెండేళ్లు, అదే మండలంలోని భూపతిపూర్‌లో 10 ఏళ్లు, కొత్తపేటలో ఏడాది, జగిత్యాల అర్బన్‌ మండలం గోపాల్‌రావుపేటలో తొమ్మిదేళ్లు, తన సొంతూరు రామాజీపేటలో ఏడేళ్లు, ప్రస్తుతం అంతర్గాంలో 10 ఏళ్లుగా సాంఘికశాస్త్రం బోధిస్తున్నారు. 39 ఏళ్లుగా తను విద్య నేర్పిన ప్రతి విద్యార్థి వివరాలను నమోదు చేస్తూ వస్తున్నారు. వీరాపూర్‌లో 119 మందికి, భూపతిపూర్‌లో 942, కొత్తపేటలో 176, గోపాల్‌రావుపేట 408, రామాజీపేటలో 466, అంతర్గాంలో 557 మొత్తం 2678 మంది విద్యార్థులకు చదువు చెప్పారు. తనతో కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలు సైతం రికార్డుల్లో నమోదు చేసుకున్నారు.

వాట్సాప్‌లోనూ..

మాస్టారు 39 ఏళ్లుగా ఏడు పాఠశాలల్లో పని చేయగా అక్కడ చదువుకున్న బాలికలు, బాలురకు వేర్వేరు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి వారి మంచి చెడులు అడిగి తెలుసుకుంటారు. కుటుంబ సభ్యుల వివరాలు సైతం నమోదు చేసుకని వారితో మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా అని అడిగి తెలుసుకుంటారు. తన వద్ద చదువుకుని చనిపోయిన వారి వివరాలు కూడా నమోదు చేసుకున్నారు. ఉన్నత ఉద్యోగాలు చేసే వారి వివరాలు, ఆ గమ్యానికి ఎలా చేరారు ఇలా అన్ని వివరాలు మిగతా వారితో పంచుకుని వారిని ప్రోత్సహిస్తుంటారు. 2010 నుంచి విద్యార్థుల ఫొటోలు కూడా దాచుకున్నారు.  


చాలా ఆనందంగా ఉంది..

తన వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థి గొప్పవాడిగా ఎదిగితే ఆ ఉపాధ్యాయుడికి అంతకంటే ఆనందం ఏముంటుంది. చాలా మంది విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పోలీసు, ఇతర ఉద్యోగాలు, రాజకీయ నాయకులుగా ఉన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత నా శిష్యురాలు. కొత్తపేట, భూపతిపూర్‌, చింతలూర్‌ సర్పంచులు నా దగ్గర చదువు నేర్చుకున్నారు. వారి వివరాలు నమోదు చేసుకోవటంతో వారితో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను. నా దగ్గర చదువు నేర్చుకున్న వారు ఉన్నత స్థితిలో ఉండడం చాలా ఆనందంగా ఉంది.

మదన్‌మోహన్‌రావు, ఉపాధ్యాయుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని