logo

ACB: రెండు నెలల్లో ఉద్యోగ విరమణ.. అనిశాకు పట్టుబడిన డీసీఎంఎస్‌ మేనేజర్‌

 పదవీ విరమణకు రెండు నెలల గడువు ఉందనే ఆలోచన కూడా లేకుండా కాసులకు కక్కుర్తిపడిన జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ మేనేజర్‌ అనిశాకు పట్టుబడటం ఉమ్మడి జిల్లాలోని ఆ సంస్థ కార్యాలయాల్లో చర్చనీయాంశమైంది.

Updated : 05 Jul 2024 07:03 IST

డీసీఎంఎస్‌ కార్యాలయం 

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం, నేరవార్తలు:  పదవీ విరమణకు రెండు నెలల గడువు ఉందనే ఆలోచన కూడా లేకుండా కాసులకు కక్కుర్తిపడిన జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ మేనేజర్‌ అనిశాకు పట్టుబడటం ఉమ్మడి జిల్లాలోని ఆ సంస్థ కార్యాలయాల్లో చర్చనీయాంశమైంది. మేనేజర్‌కు సాయం చేస్తూ క్యాషియర్‌ కుమారస్వామి కూడా అనిశా వలలో చిక్కడం కింది స్థాయి ఉద్యోగులను కలవరపెడుతోంది. డీసీఎంఎస్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎరువు విక్రయాలు, ధాన్యం కొనుగోలు చేస్తుంటుంది. కరీంనగర్, జమ్మికుంట, హుజూరాబాద్, మెట్పల్లి తదితర ప్రాంతాల్లో దుకాణాల సముదాయాల నుంచి అద్దె రూపంలో సొసైటీకి ఆదాయం వస్తుంది. ఈ సంస్థ శాఖలు జిల్లా వ్యాప్తంగా 300కుపైగా ఉన్నా.. సగం వాటిలోనే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. 

17 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీసీఎంఎస్‌ యాసంగిలో 10 లక్షలు, వానాకాలంలో 7 లక్షల క్వింటాళ్ల చొప్పున 17 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు చేస్తుంటుంది. ఇందుకు ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు రూ.32 కమీషన్‌ సంఘానికి చెల్లిస్తుంది. ఇలా ఈ కమీషన్‌పై సంస్థ ఉద్యోగుల ద్వారా 40 కేంద్రాల్లో కొనుగోలు చేస్తుంటారు. ఇదికాకుండా మరో 60 మంది గ్రామీణ ప్రాంతాల్లో కమీషన్‌ పద్ధతిపై ధాన్యం కేంద్రాలను కొనసాగిస్తున్నారు. వీరికి మాత్రం సంస్థకు వచ్చే రూ.32లో సగం రూ.16 మాత్రమే ఇస్తుంటుంది. ఆ డబ్బు కూడా ఎరువు రూపంలో సరఫరా చేస్తే ఈ కేంద్రాల వారు వాటిని రైతులకు విక్రయించి డబ్బు జమ చేసుకుంటారు. నేరుగా కమీషన్‌ను చెక్కుల రూంలో ఇవ్వాల్సి ఉండగా, ఎరువులు అంటగట్టడంపై కొందరు అభ్యంతరం చేస్తున్నారు. కమీషన్‌దారులు ధాన్యం విక్రయించేందుకు సంస్థకు రూ.3 లక్షలు అడ్వాన్స్‌ చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అదే విధానంలో ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన కావేటి రాజు ఆరు గ్రామాల్లో 2018 నుంచి 2023 వరకు వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఆయనకు సంస్థ రూ.69.25 లక్షల కమీషన్‌ చెల్లించాల్సి ఉండగా మేనేజర్‌ రేగులపాటి వెంకటేశ్వర్‌రావు కొంతకాలంగా తిప్పుకుంటున్నారు. చివరకు లంచం డిమాండ్‌ చేసి, అనిశాకు చిక్కారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని