logo

Government Hospitals: ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే

ప్రభుత్వ దవాఖానాలకు చికిత్సల కోసం వస్తున్న పేద రోగులపై మందుల రూపంలో పెను భారం పడుతోంది. చికిత్సల వరకు ఉచితంగా అందిస్తున్నా ఔషధాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదని రోగులు వాపోతున్నారు.

Updated : 05 Jul 2024 08:43 IST

సర్కారు దవాఖానాల్లో ఔషధాలు ఖాళీ
పేద రోగులపై తప్పని ఆర్థిక భారం

యన పేరు రాములు. ఊరు చౌటుప్పల్‌. న్యూరో సంబంధిత సమస్యతో గాంధీ ఆసుపత్రిలో ఇటీవల చేరాడు. వైద్యులు చికిత్స అందించారు. అయితే రెండు నెలలు వాడాలంటూ ఆరు రకాల మందులు రాశారు. తీరా ఆసుపత్రి మందుల కౌంటర్‌ వద్దకు వెళ్లాక.. ఆ ఆరు మందుల్లో ఒక్కటే చేతిలో పెట్టారు. మిగతా ఐదు రకాలు బయట కొనుక్కోవాలని సూచించారు. 2 నెలల మందులకే రూ.2 వేలు చెల్లించాలని దుకాణదారుడు చెప్పడంతో అంత డబ్బులు లేక రూ.600 పెట్టి పది రోజులకు సరిపడా తీసుకున్నారు. 

 


ప్రభుత్వ దవాఖానాలకు చికిత్సల కోసం వస్తున్న పేద రోగులపై మందుల రూపంలో పెను భారం పడుతోంది. చికిత్సల వరకు ఉచితంగా అందిస్తున్నా ఔషధాలను పూర్తి స్థాయిలో సరఫరా చేయడం లేదని రోగులు వాపోతున్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయిదు రకాల మందులు రాస్తే రెండు, మూడు రకాలకు మించి లభించడం లేదు. ప్రధాన ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియాలో ఎక్కువ శాతం రోగులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోగి కనీసం రూ.200 వెచ్చించి బయట ప్రైవేటు షాపుల్లో మందులు కొంటున్నారు. గాంధీలో ఉన్న ప్రైవేటు మెడికల్‌ దుకాణాలు నిత్యం రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి రోజూ లక్షల్లోనే ఇక్కడ వ్యాపారం జరుగుతోన్న పరిస్థితి. మందుల దుకాణదారులు మాత్రం నామమాత్రపు అద్దె చెల్లించి రెండు చేతులా సంపాదిస్తున్నారు. లీజు గడువు ముగుస్తున్న ప్రతిసారీ న్యాయ స్థానాలను ఆశ్రయించి స్టేలు తెచ్చుకొని మరీ దుకాణాలు కొనసాగిస్తున్నారు. 

రోగులకు తగ్గట్లు సరఫరా లేక...

గాంధీ, ఉస్మానియాల్లో అధికారిక పడకలు, వచ్చే రోగులను పరిగణలోకి తీసుకొని టీజీఎంఎస్‌ఐడీసీ మందులను సరఫరా చేస్తోంది. 80 శాతం అక్కడ నుంచే ఔషధాలు పంపిస్తారు. మరో 20 శాతం మందులను అత్యవసర పద్ధతిలో ఆసుపత్రి అధికారులు కొనుగోలు చేస్తుంటారు. అయితే అధికారిక లెక్కల కంటే రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రోగులందరికి మందులు సరఫరా చేయలేకపోతున్నారు. కొందరికి ఇవ్వాల్సిన వాటిలో కొన్ని కోత వేసి వేరే వారికి సర్దుబాటు చేస్తున్నారు. ఉస్మానియాలో 1,100 వరకు పడకలు ఉండగా...నిత్యం 1,500లకు పైనే రోగులు వస్తున్నారు. గాంధీలో వేయికి పైగా పడకలకు గాను 1,500 పైనే రోగుల తాకిడి ఉంటోంది. సీజన్‌లో ఈ రెండు ఆసుపత్రుల్లో ఈ సంఖ్య 2వేలకు పెరుగుతోంది. ఆ స్థాయిలో అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండటం లేదు. 

ప్రైవేటుతో  లోపాయికారిగా...

కొన్ని విభాగాల్లో వైద్యులు ప్రైవేటు దుకాణదారులతో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని బయటకు మందులు రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై నిఘా పెట్టి గతంలో ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా కొందరి తీరు మారడం లేదు. ప్రభుత్వం అందించే మందులను పక్కనపెట్టి ప్రైవేటులో దొరికే ఇతర బ్రాండు మందులు రాస్తున్నారనే విమర్శలున్నాయి. ఫలితంగా పేద రోగులు డబ్బులు పెట్టి ప్రైవేటులో కొంటున్నారు. గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులకు వచ్చే పేదలు బయట మందులు కొనలేక...డాక్టర్‌ నెల రోజులకు రాస్తే...వారం, పదిరోజులకు మాత్రమే తీసుకుంటున్నారు. తర్వాత వాడటం మానేస్తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోగులకు అన్ని రకాల మందులు ఉచితంగా అందేలా చొరవ తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.

గాంధీలో మందుల కౌంటర్‌ వద్ద రోగులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని