logo

ఆస్తులను రక్షిస్తాం.. ఆక్రమణల అంతు తేలుస్తాం

‘‘రాజధాని పరిధిలో రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు మొదలుపెట్టాం.

Published : 05 Jul 2024 02:56 IST

చెరువుల్లో, నాలాలపై వెలసిన ఆక్రమణలపై కఠిన చర్యలు
రోడ్లు, కాలనీల్లో ముంపు నివారణకు ప్రత్యేక దృష్టి
‘ఈనాడు’తో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

‘‘రాజధాని పరిధిలో రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఆక్రమణకు గురైన వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి చర్యలు మొదలుపెట్టాం.నగరంలో భారీ వర్షం పడితే వరద సాఫీగా వెళ్లడానికి నాలాలు, రోడ్లపై ఆక్రమణలను తొలగిస్తాం’’ అని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్, అసెట్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (హైడ్రా) కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఇటీవలే ఈ విభాగం కొత్తగా ఏర్పాటైంది. దీనికి తొలి కమిషనర్‌గా నియమితులైన ఐపీఎస్‌ అధికారి రంగనాథ్‌ గురువారం ‘ఈనాడు’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. 

ప్రశ్న: మహానగరంలో అనేక జంక్షన్ల దగ్గర చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలిచి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు?

జవాబు: దీనిపై రెండు రోజుల కిందట ట్రాఫిక్‌ డీసీపీలతో సమావేశాన్ని నిర్వహించాం. ఆక్రమణల వల్ల ఎక్కడైతే ట్రాఫిక్‌ ఆగిపోతుందో ఆ ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వమని కోరాను. ఆ ప్రాంతాల్లో ముందుగా ఆక్రమణల తొలగింపు ప్రక్రియను మొదలుపెడతాం. నగర ట్రాఫిక్‌ బాస్‌గా నేను పని చేయడం వల్ల అవగాహన ఉంది. నగరంలో 140 జంక్షన్లు ఉన్నాయి. వీటి దగ్గర నాలాల విస్తరణ చేపట్టాలని అనుకుంటున్నాం. దీనివల్ల జంక్షన్ల దగ్గర చేరిన నీరు పది నిమిషాల్లోనే నాలాల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. 

ప్ర: ’రాజధానిలో వందల చెరువుల ఎఫ్‌టీఎల్‌లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.  వర్షం నీరు వెళ్లే  మార్గం లేక నగరం ముంపునకు గురవుతోంది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు?

జ: ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. చెరువుల గొలుసుకట్టు వ్యవస్థ ధ్వంసమై వరద వెళ్లే మార్గం లేక  నగరం ముంపులో చిక్కుకుంటోంది. ఈ నేపథ్యంలో చెరువుల ఆక్రమణలపై దృష్టిసారించాం. వాటి వెనుక ఎవరున్నారో  వెలికితీసే ప్రక్రియను మొదలుపెట్టనున్నాం. నివేదిక రూపొందించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వీటిని కూల్చివేసే ప్రణాళిక అమలు చేస్తాం.

ప్ర: కొత్తగా ‘హైడ్రా’ అనే సంస్థను ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?

జవాబు: బల్దియా పరిధిలో గతంలో ఈవీడీఎం అనే వ్యవస్థ ఉండేది. ఈ వ్యవస్థ బల్దియా కమిషనర్‌ ఆధీనంలో ఉండేది. బల్దియా, హెచ్‌ఎండీఏ, జలమండలి మాదిరిగా ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తలపెట్టారు. ఈ సంస్థ కమిషనర్‌ ఆక్రమణలు ఇతరత్రా వ్యవహారాలపై స్వయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వెంటవెంటనే చర్యలకు అవకాశం ఉంటుంది. అందుకే దాదాపు 3వేల మందితో ఈ సంస్థ రూపుదాల్చనుంది.

ప్ర: మహానగరంలో నాలాల  ఆక్రమణ చాలా దారుణంగా ఉంది. దీని వల్లే వేలాది కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. దీనికి పరిష్కారమెలా?

జవాబు: కొద్దిరోజుల కిందట మా సిబ్బంది కొన్ని నాలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.  చాలా నాలాలు పూడికతో నిండిపోయాయి.  బల్దియా రికార్డుల్లో ఈ నాలాల్లో ఏటా పూడిక తీసినట్లుగా ఉంటోంది. అందుకే ముందుగా పూడిక తీసే గుత్తేదారులు, శాఖ ఇంజినీర్లతో కొద్దిరోజుల్లో సమావేశమవ్వాలని నిర్ణయించాం. ఇకముందు పూడికతీత సక్రమంగా చేయకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించనున్నాం. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుంది. నాలాలపై నిర్మించిన భవనాలకు సంబంధించి విచారణ మొదలుపెడతాం. త్వరలో హైడ్రాకు పూర్తి విధివిధానాలు జీవో రూపంలో వస్తాయి. అప్పుడు ఈ ఆక్రమణల అంతు తేలుస్తాం.

ప్ర: నగరంలో ఎక్కడపడితే అక్కడ అక్రమ నిర్మాణాలున్నాయి. బల్దియా ప్రణాళికా విభాగం పట్టించుకోవడం లేదు?

  • దీని కోసమే బల్దియా, హెచ్‌ఎండీఏ పరిధిలోని నగర ప్రణాళిక విభాగం ప్లానర్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశాం. నగరంలో ఆక్రమణలకు సంబంధించి వారితో సమగ్రంగా చర్చించనున్నాం. వీరిలో జవాబుదారీతనం పెంపొందించడంతోపాటు వీరితోనే అక్రమ నిర్మాణాలు గుర్తించే కార్యక్రమం త్వరలోనే మొదలుపెడతాం. ముందుగా  పెద్దల ఆక్రమణలపై దృష్టిసారిస్తాం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని