logo

నేలమట్టం చేసినా పుట్టుకొస్తున్నాయి

చెరువులోని నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ కూల్చడం.. కొంత కాలం తర్వాత మళ్లీ అక్కడ భవనాలు రావడం సర్వసాధారణమైంది.

Published : 05 Jul 2024 02:30 IST

సున్నం, మైసమ్మ, కాముని చెరువుల్లో ఆక్రమణలు

సున్నం చెరువులో కూల్చిన భవనాన్ని మళ్లీ కడుతున్న వైనం

ఈనాడు, హైదరాబాద్‌: చెరువులోని నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ కూల్చడం.. కొంత కాలం తర్వాత మళ్లీ అక్కడ భవనాలు రావడం సర్వసాధారణమైంది. తటాకాల ఎఫ్‌టీఎల్‌(పూర్తి స్థాయి నీటి మట్టం) భూముల విషయంలో తరచుగా కనిపిస్తోన్న దృశ్యమిది. హైటెక్‌సిటీకి సమీపంలో ఉన్న మైసమ్మ చెరువు, కాముని చెరువు, సున్నం చెరువుల దుస్థితే అందుకు నిదర్శనం. 2017లో సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌లోని ఐదంతస్తుల భవనాన్ని జిలిటెన్‌ స్టిక్‌లతో కూల్చగా.. ఇప్పుడు మళ్లీ అక్కడ నిర్మాణం జరుగుతోంది. చుట్టూ మరిన్ని నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. మైసమ్మ చెరువు అల్లాపూర్‌ డివిజన్‌ వైపు 50ఎకరాల మేర ఆక్రమణకు గురవగా, ఇప్పుడు మూసాపేట దోబీఘాట్‌ వైపు నిర్మాణాలు చేపడుతున్నారు. పక్కనే ఉన్న కాముని చెరువు ఎఫ్‌టీఎల్‌లోనూ నిర్మాణాలు జరుగుతుండటం గమనార్హం.

పదేళ్లలో 11 కనుమరుగు.. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌(టీజీఆర్‌ఏసీ) ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సంస్థ పటాలను విశ్లేషించి.. ‘‘2014కు పూర్వం గ్రేటర్‌లో 417 చెరువులు, కుంటలు ఉండగా, 182 పూర్తిగా, 76 పాక్షికంగా ఆక్రమణకు గురయ్యాయి. 2014 నుంచి 2023 వరకు 11 పూర్తిగా, 7 పాక్షికంగా కనుమరుగయ్యాయి. మొత్తంగా ఓఆర్‌ఆర్‌వరకు 920 జల వనరులుంటే.. 282పూర్తిగా, 209 పాక్షికంగా కబ్జాకు గురయ్యాయి’’అని టీజీఆర్‌ఏసీ అధికారులు వివరించారు.

జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం..

జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం నగరంలో 185 చెరువులున్నాయి. చెరువుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వాటికి హద్దులను గుర్తించే ప్రక్రియ పదేళ్లుగా పూర్తవట్లేదు. ఈ క్రమంలో పలువురు బల్దియాలోని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, ప్రణాళిక విభాగం అధికారులు కొన్ని చెరువులకు ఉరేశారు. ఎఫ్‌టీఎల్‌ పటాలను తారుమారు చేసి.. వందలాది ఎకరాల చెరువు భూముల ఆక్రమణకు ఊతమిచ్చారు. అప్పుడప్పుడు ప్రణాళిక విభాగం ఎఫ్‌టీఎల్‌లోని కొన్ని భవనాలను కూల్చినా.. మళ్లీ భవనాలు రాకుండా అడ్డుకోవట్లేదు. మే 7, 2017లో సున్నం చెరువులో బాంబులతో పేల్చిన భవనం స్థానంలో మళ్లీ బహుళ అంతస్తుల నిర్మాణం మొదలవడమే నిదర్శనం. బల్దియా ఇంజినీర్లు ఎఫ్‌టీఎల్‌లోనే రోడ్డు నిర్మించగా, పక్కనా కబ్జాలు వచ్చాయి. మైసమ్మ చెరువును నాలుగెకరాల మేర ఆక్రమణదారులు మట్టితో పూడ్చి, నకిలీ శ్మశానవాటిక, కాలనీ ఏర్పాటుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. కాముని చెరువు ఎఫ్‌టీఎల్‌లోనూ ఎకరాల కొదీ భూముల్లో భవనాలు, గోదాములు, రేకుల షెడ్లను నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని