logo

కరుణించని వరుణుడు.. కదలని కాడి!

వానాకాలం సాగుకు పదకొండు రోజులే గడువు ఉంది. జులై 15 వరకు పెసర, మినుములు మినహా అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది.

Published : 05 Jul 2024 02:21 IST

ఇప్పటి వరకు ఖరీఫ్‌ సాగు 39.93 శాతమే

న్యూస్‌టుడే, తాండూరు: వానాకాలం సాగుకు పదకొండు రోజులే గడువు ఉంది. జులై 15 వరకు పెసర, మినుములు మినహా అన్ని రకాల పంటలకు సంబంధించిన విత్తనాలు వేసుకునే అవకాశం ఉంది. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు ముందుకు సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 5,75,946 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే 5,97,830 ఎకరాలకు చేరుతుందని అధికారులు లెక్కలు వేశారు. జూన్‌ ఆరంభంలో నైరుతి రుతుపవనాల రాక సందర్భంగా వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో పొలాలు సిద్ధం చేసుకున్న వారు విత్తనాలు వేశారు. కొందరు చదును చేశారు. ఈ లోపే వరుణుడు మబ్బుచాటునే ఉండిపోయాడు. జులై రెండో తేదీ వరకు అన్ని రకాల పంటలు కలిపి 2,29,958 ఎకరాల్లోనే సాగు చేయడంతో 39.93 శాతం నమోదైంది. ఇంకా 3,45,988 ఎకరాలు సాగుకు నోచలేదు. 

పెసర, మినుము నామమాత్రమే: జిల్లాలో పెసర, మినుముల సాగు నామమాత్రంగానే ఉంది. మినుముల సాధారణ సాగు 8,518 ఎకరాలకు 4,012, పెసర 17,258 ఎకరాలకు 7,161 ఎకరాల్లో సాగైంది. వీటి సాగుకు గడువు లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు.

ఆగస్టు వరకు వరి : వరి పంట సాగుకు ఆగస్టు చివరి వరకు అవకాశం ఉంది. ప్రస్తుతం దీర్ఘకాలిక రకాలకు సంబంధించిన వరి నాట్లు వేశారు. స్వల్పకాలిక రకాలకు నారు మడులను వేశారు. వర్షాలు కురిస్తే కరిగెట్లుగా మార్చి, నాట్లు వేయనున్నారు. 99,549 ఎకరాల్లో వరి సాగు చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 141 ఎకరాల్లోనే సాగైంది. ఇంకా సమయం ఉండడంతో విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

పంటల సాగు ఇలా: కందులు 1,51,389 ఎకరాలకు 64,507, పత్తి 2,31,338 ఎకరాలకు 1,43,606, మొక్కజొన్న 52,507 ఎకరాలకు 7,727, జొన్న 5,869 ఎకరాలకు 266, సోయాబిన్‌ 2,250 ఎకరాలకు 1,811 ఎకరాల్లో సాగైంది. మిగిలిన పంటల సాగు నామమాత్రంగానే ఉంది. 

కంది, పత్తికి జులై చివరి వరకు అవకాశం

వర్షాలు అనుకూలిస్తే జులై 15 వరకు పెసర, మినుములు మినహా అన్ని రకాల పంటలు సాగు చేసుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే కంది, పత్తి వంటి పంటలను జులై చివరి వరకు సాగు చేయవచ్చు. రైతులు యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు సవ్యంగా చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. 

గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని