logo

ముగిసిన జడ్పీ పాలన.. నేటి నుంచి ప్రత్యేక పాలన

జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగిసింది. 5వ తేదీన ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Published : 05 Jul 2024 02:15 IST

పదవీ కాలం ముగిసిన ప్రజాప్రతినిధులకు సన్మానం  

న్యూస్‌టుడే, వికారాబాద్, తాండూరు: జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం ఈ నెల 4వ తేదీతో ముగిసింది. 5వ తేదీన ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా, నూతనంగా దుద్యాల, చౌడాపూర్‌ మండలాలను ఏర్పాటు చేశారు. 18 మండలాలకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అందులో 9 మంది మహిళా సభ్యులు ఉండగా, కోట్‌పల్లి నుంచి జడ్పీటీసీగా విజయం సాధించిన సునీతారెడ్డి జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలిగా కొనసాగారు. జడ్పీలో భారాసకు 14, కాంగ్రెస్‌కు 4 జడ్పీటీసీల బలం ఉండేది. ఎంపీపీలుగా కూడా 18 మందిలో ముగ్గురు మాత్రమే కాంగ్రెస్‌ నుంచి కొనసాగగా, మిగతా 15 మంది భారాసకు చెందిన వారి ప్రాతినిధ్యం వహించారు. జిల్లాలో 222 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా, వీరిలో 114 మంది మహిళా సభ్యులున్నారు. వివిధ కారణాలతో 6 మంది పదవి కోల్పోగా,  6 మంది రాజీనామా చేశారు. అన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సత్కరించి, వారి సేవలను కొనియాడి వీడ్కోలు పలికారు. 

అందని గౌరవ వేతనాలు.. 

పదవీ కాలం ముగిసినా గత ఆరు మాసాల నుంచి స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం అందలేదు. జడ్పీ అధ్యక్షురాలికి రూ.లక్ష, జడ్పీటీసీ, ఎంపీపీలకు రూ.13 వేల చొప్పున, ఎంపీటీసీలకు రూ.6,500 గౌరవ వేతనం ఇస్తున్నారు. గత ప్రభుత్వం 2021లో 30 శాతం గౌరవ వేతనాలను పెంచింది. డిసెంబరు వరకు గౌరవ వేతనం చెల్లించగా, ఆరు మాసాలుగా అపరిష్కృతంగా ఉన్నాయి. మరోవైపు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలకు సక్రమంగా నిధుల కేటాయింపులు జరగకపోవడంతో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయామని వాపోయారు. జిల్లా పరిషత్‌కు స్టాంప్‌డ్యూటీ, మినరల్, మైనింగ్‌ సెస్, వినోదపు పన్నుల రూపంలో వచ్చే నిధులు 2019 నుంచి నిలిచి పోవడంతో ఐదేళ్ల పదవీ కాలంలో అరకొర నిధులతో అభివృద్ధి చేయలేదని పలువురు తాజా మాజీ జడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని