logo

ముగిసిన సర్వే.. ముమ్మరంగా పనులు!

రాష్ట్రంలో కొడంగల్‌ను నమూనా నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Published : 05 Jul 2024 02:12 IST

స్థాయి పెరగనున్న ఆసుపత్రి 

న్యూస్‌టుడే, కొడంగల్‌: రాష్ట్రంలో కొడంగల్‌ను నమూనా నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముందుగా విద్య, వైద్యం, రవాణా రంగాలపై అధికారులు దృష్టి సారించారు. ఎస్టీ గురుకులం ఉన్న చోటనే, మైనార్టీ, ఎస్సీ, బీసీ గురుకులాలను ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని కేటాయించారు. మైనార్టీ గురుకులానికి నిధులు మంజూరయ్యాయి. రోడ్ల మరమ్మతుకు, నిర్మాణానికి రూ.176 కోట్లు మంజూరు కావడంతో టెండర్లు పూర్తి చేశారు. కొన్నిచోట్ల భూమి పూజ చేశారు. ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే లక్ష్యంతో మెడికల్‌ హబ్‌కు శ్రీకారం చుడుతున్నారు. జిల్లా స్థాయి ఆసుపత్రిలో ఉండే అన్ని వసతులు కల్పించేందుకు కార్యాచరణ చేపట్టారు. కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 50 పడకలుండగా, 220కి పెంచనున్నారు. ఇందుకోసం రూ.27 కోట్లు కేటాయించారు.
ఒకే చోట వైద్య కళాశాలలు: మెడికల్, నర్సింగ్, వెటర్నరీ, పిజియోథెరపీ కళాశాలల నిర్మాణానికి కొడంగల్‌ మండలం అప్పాయిపల్లిలో 74 ఎకరాల అసైన్డ్‌ భూమిని పరిశీలించారు. ఇందులో 45 మంది రైతుల నుంచి 60 ఎకరాలను తీసుకోనున్నారు. వారితో అధికారులు చర్చలు జరిపారు. ఉద్యోగంతోపాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరం భూమికి రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే కళాశాలల పక్కనే వెంచర్‌ ఏర్పాటు చేసి ఒక ప్లాటు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నారు. ఈ అంశాలను రైతులకు వివరించి ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

స్థలాన్ని సేకరించేందుకు చర్యలు 

మెడికల్‌ కళాశాలల స్థల సేకరణ, ఇతర పనులు వేగంగా చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. అప్పాయిపల్లిలోని 60 ఎకరాలను పరిశీలించాం. రైతులతో చర్చలు జరుపుతున్నాం. 

వెంకట్రెడ్డి, ‘కడా’ ప్రత్యేక అధికారి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని