logo

మాత్రల పొడితో నకిలీ ఔషధాలు

ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్‌ ఎస్‌వోటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు.

Published : 05 Jul 2024 02:00 IST

ఈనాడు, హైదరాబాద్‌ - పేట్‌బషీరాబాద్, న్యూస్‌టుడే: ప్రజారోగ్యానికి హాని కలిగించే ఔషధాలు తయారుచేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును మేడ్చల్‌ ఎస్‌వోటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు, ఔషధ నియంత్రణాధికారులు చేధించారు. ధూలపల్లిలో పరిశ్రమ ఏర్పాటు చేసి అంతర్జాతీయ కంపెనీల లేబుళ్లు వేసి దేశవ్యాప్తంగా ఈ మాత్రలు సరఫరా చేస్తున్నారు. గురువారం ఇద్దర్ని అదుపులోకి తీసుకుని రూ.50 లక్షల విలువ చేసే నకిలీ మాత్రలు, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పేట్‌బషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌వర్థన్, ఏసీపీ రాములు, అదనపు డీసీపీ నరసింహారెడ్డి, శోభన్‌కుమార్, ఔషధ నియంత్రణ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌తో కలిసి మేడ్చల్‌ డీసీపీ కోఠిరెడ్డి గురువారం విలేకర్లకు కేసు వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పరకలపల్లి గ్రామానికి చెందిన గిర్నేని గోపాల్‌(42) 2001లో హరిణి ఇండస్ట్రీస్‌ పేరుతో కూకట్‌పల్లిలో ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేశాడు. కొవిడ్‌తో భారీగా నష్టాలొచ్చాయి. అప్పటికే తన దగ్గర ఉత్పత్తులు కొనుగోలు చేసే దిల్లీకి చెందిన నిహాల్‌తో ఇతనికి పరిచయం ఉంది.  నిహాల్‌ తాను చెప్పినట్లు చేస్తే త్వరగా డబ్బు వస్తుందని ఆశ చూపాడు. మాత్రల తయారీకి ఉపయోగించే పదార్థం, ప్యాకింగ్, లేబుళ్లు, మాత్రలు ఉంచేందుకు అల్యూమినియం పొర, ప్రముఖ ఫార్మా కంపెనీల పేరుతో స్టిక్కర్‌ డబ్బాలు దిల్లీ నుంచి పంపిస్తానని.. వాటిని ప్యాకింగ్‌ చేయాలని చెప్పాడు. అంగీకరించిన గోపాల్‌ నకిలీ సరకుతో మాత్రలు తయారు చేయడానికి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఫార్మా కంపెనీ మాజీ ఉద్యోగి బక్క రామకృష్ణ(40)ను సంప్రదించాడు. గతేడాది డిసెంబరులో దిల్లీ నుంచి నిహాల్‌.. అబాట్, క్యాడిల తదితర ఫార్మా కంపెనీల పేరున్న ప్యాకింగ్‌ సామగ్రి పంపగా ఇద్దరూ నకిలీ మాత్రల తయారీ మొదలుపెట్టారు. అలా 1.03 కోట్ల ఫెనిటాయిన్, 14.28 లక్షల వాసోగ్రెయిన్‌ మాత్రలు తయారు చేశారు. ఈ నకిలీ కంపెనీ గుట్టుపై సమాచారం అందుకు మేడ్చల్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ శ్యాంసుందర్‌రెడ్డి బృందం తనిఖీ చేయగా బండారం బయటపడింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని