logo

మూడేళ్ల పాప అపహరణ

మూడేళ్ల చిన్నారి అపహరణ కేసును మార్కెట్‌ పోలీసులు ఛేదించి నిందితులను రిమాండుకు తరలించారు.మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ కథనంప్రకారం..

Published : 05 Jul 2024 01:59 IST

సీసీ ఫుటేజీతో కేసును ఛేదించిన పోలీసులు

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: మూడేళ్ల చిన్నారి అపహరణ కేసును మార్కెట్‌ పోలీసులు ఛేదించి నిందితులను రిమాండుకు తరలించారు.మార్కెట్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ కథనంప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నంద ఉత్తమ్‌పవార్, ఉత్తమ్‌ పవార్‌ దంపతులకు ఆరుగురు పిల్లలు సంతానం. కొన్నాళ్లక్రితం భర్త చనిపోవడంతో ఉన్నఊళ్లో ఉపాధిలేక పిల్లలతో కలిసి నగరానికి వచ్చిన తల్లి ఫుట్‌పాత్‌పై ఉంటూ భిక్షాటన చేస్తోంది. గతనెల 26న ఉదయం ముగ్గురు పిల్లలను భిక్షాటనకు పంపింది. వెళ్లిన ముగ్గురిలో దుర్గ(3) తిరిగిరాకపోవడం, వెతికినా ఆచూకీ లేకపోవడంతో  పోలీసులకు ఫిర్యాదుచేసింది. వారు సీసీకెమెరాల ఫుటేజీ ఆధారంగా అడ్డగుట్టలో ఉంటున్న పల్నాడుజిల్లా దాచేపల్లికి చెందిన నిందితురాలు గంగమ్మ(35), ఆమె కుమార్తె(16)ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరు  అడ్డగుట్ట వద్ద గుడిసెల్లో ఉంటూ కూలీ పనులు, భిక్షాటన చేసుకొంటున్నారు. పాపతో భిక్షాటన చేయిస్తే ఎక్కువ డబ్బు వస్తుందనే ఉద్దేశంతో చిన్నారిని ఎత్తుకెళ్లినట్లు అంగీకరించారు. పాపను పోలీసులు చైల్డ్‌హోమ్‌కు తరలించారు. 


భార్య, అత్త దాడి.. భర్త హతం

కందుకూరు, న్యూస్‌టుడే: కట్టుకున్న భార్య, అత్త దాడి చేసి భర్తను హతమార్చారు. కందుకూరు సీఐ సీతారాం వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం వట్టిపల్లికి చెందిన కంచుగట్ల పరమేశ్‌(37)కు కందుకూరు మండలం కొత్తగూడకు చెందిన గాంధారీ సుక్కమ్మ కూతురు స్వప్నకు 12ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు. భార్యాభర్తల మధ్య కలహాలతో మూడేళ్లుగా స్వప్న పుట్టింట్లో ఉంటోంది. భర్త అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నాడు. బుధవారం పరమేశ్‌ రాగా.. ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రాత్రి స్వప్న, సుక్కమ్మ కట్టెలతో అతడిపై దాడిచేశారు. అపస్మాకర స్థితిలోకి వెళ్లిన అతడ్ని కొంతదూరం లాక్కెళ్లి విద్యుత్తు స్తంభం వద్ద వదిలేయగా అక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు.


యువ వైద్యురాలి ఆత్మహత్య

నాగోలు, న్యూస్‌టుడే: డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ యువ వైద్యురాలు ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం... నాగోలు బండ్లగూడలోని సహభావన రాజీవ్‌ స్వగృహ టౌన్‌షిప్‌ ఎనిమిదో అంతస్తులో నివసిస్తున్న నిహారికారావు(29), మనోహర్షలకు రెండేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు వైద్యులే. నిహారిక పీజీ చదువుతోంది. కరోనా కాలంలో తీవ్ర పనిఒత్తిడి కారణంగా మానసిక అనారోగ్యానికి గురైంది. అప్పటినుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మనోహర్ష ఆర్నెళ్లనుంచి దిల్లీలోని ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. నిహారిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ.. 8వ అంతస్తునుంచి కిందికి దూకింది. వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదుతో నాగోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని