logo

నిపుణులున్నా.. సదుపాయాల్లేవ్‌

అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి.

Published : 04 Jul 2024 02:04 IST

ప్రైవేటు దవాఖానాల్లోనే ఎక్కువ శస్త్రచికిత్సలు
అవయవ మార్పిడికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎదురుచూపులు
గాంధీలో కొనసాగుతున్న మాడ్యులర్‌ థియేటర్‌ పనులు

ఈనాడు, హైదరాబాద్‌: అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2013 నుంచి ఇప్పటివరకు నిమ్స్‌లో కేవలం 32 అవయవ మార్పిడి చికిత్సలు జరగ్గా.. గాంధీలో ఒక్కటే చేశారు. ఉస్మానియాలో తొమ్మిది వరకు చేశారు. ఆసుపత్రుల్లో నిపుణులకు కొరత లేకున్నా ..మాడ్యులర్‌ థియేటర్లు, ఇతర అధునాతన వసతులు లేకపోవడంతో ఎక్కువ శాతం ప్రైవేటుకు వెళ్తున్నారు.

వందల మంది నిరీక్షణ.. కాలేయ మార్పిడికి ఉస్మానియాలో వంద మందికి పైగా నిరీక్షిస్తున్నారు. సరైన మౌలిక వసతులు లేకపోవడంతో ప్రభుత్వం గతంలో గాంధీలో కేంద్రీకృత అవయవ మార్పిడి కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించింది. రూ.30 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆరు మాడ్యులర్‌ థియేటర్లు నిర్మిస్తున్నారు.

ప్రైవేటులో పేదలకు భారమే...

ప్రైవేటులో మూత్రపిండాల మార్పిడికి ఆరేడు లక్షలు, అదే కాలేయ మార్పిడికి రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఉచితంగా చేస్తున్నారు. గాంధీ, ఉస్మానియాలో ఎక్కువ శాతం బ్రెయిన్‌డెడ్‌ కేసులు నమోదవుతుంటాయి. ఒక బ్రెయిన్‌డెడ్‌ అయిన బాధితుడి నుంచి ఏడుగురికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. ఎక్కడ బ్రెయిన్‌డెడ్‌ అయితే..ఆ ఆసుపత్రికే తొలి ప్రాధాన్యం ఉంటుంది. మూడు అవయవాల వరకు ఆ ఆసుపత్రికి కేటాయిస్తారు.

గుండె నుంచి క్లోమగ్రంథి వరకు...

దీనిపై గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో గాంధీలో అవయవ మార్పిడి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, మూత్రపిండాలు, క్లోమగ్రంథి..ఇలా అన్ని రకాల అవయవాలు ఒకచోట మార్పిడి చేయవచ్చన్నారు. ఈ కేంద్రం ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. 

జనవరి నుంచి ఇప్పటివరకు జరిగిన మార్పిడిలు..

  • మొత్తం దాతలు   -    85
  • మూత్రపిండాలు    -    140
  • లివర్‌    -    82
  • గుండె    -    13
  • కార్నియా    -    80
  • ఊపిరితిత్తులు    -    35

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని