logo

కరెంట్‌ కట్‌.. రోగుల కటకట

ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు.

Updated : 04 Jul 2024 04:55 IST

ఉస్మానియాలో అరగంట నిలిచిన విద్యుత్తు సరఫరా
కొద్దిసేపు మొరాయించిన జనరేటర్‌

ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. ఆపరేషన్‌ థియేటర్లలో శస్త్ర చికిత్సలు జరుగుతున్న సమయంలో ఇది జరగడంతో వైద్యులు, సిబ్బంది సైతం చేసేదేమీలేక మిన్నకుండిపోయారు. బుధవారం ఉదయం కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేస్తుండగా సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలోనే జనరేటర్‌ కొద్దిసేపు మొరాయించడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ఇటీవల వర్షాలు కురుస్తుండడంతో మూడు రోజులుగా తరచూ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని సిబ్బంది తెలిపారు. మంగళవారం తెల్లవారుజాము రెండు, మూడుసార్లు నిలిచిపోయింది. ఓపీలోని అత్యవసర వార్డులు, కులీకుతుబ్‌షా భవనంలోని పలు వార్డుల్లో కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బందులకు గురయ్యారు. వీరికి ప్రత్యామ్నాయంగా ‘అంబూబ్యాగ్‌’ సాయంతో రోగి సహాయకులే దగ్గరుండి సాయం చేయాల్సి ఉంటుంది. పాతకాలం నాటి విద్యుత్తు వ్యవస్థను ఆధునికీకరించకపోవడంతో ఏటా వర్షాకాలంలో అంతరాయం కలుగుతోంది. అంతర్గత సమస్య ఉన్నట్లు గుర్తించిన ఆసుపత్రి ఎలక్ట్రీషియన్లు తొలుత ప్రత్యామ్నాయంగా జనరేటర్‌ సహాయంతో సరఫరా పునరుద్ధరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

సాంకేతిక లోపంతోనే..

సాంకేతిక లోపం తలెత్తడంతో సరఫరా నిలిచిపోయిందని విద్యుత్తు శాఖ అధికారులు గుర్తించారు. టీజీఎంఎస్‌ఐడీసీ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు ఆసుపత్రికి చేరుకొని మరమ్మతులు చేసి సరఫరా పునరుద్ధరించారు. రోగులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 15 నిమిషాలు సరఫరా నిలిచిపోయింది. 

డా.నాగేందర్, సూపరింటెండెంట్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని