logo

క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని

నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి దృష్టిపెట్టారు.

Published : 04 Jul 2024 01:58 IST

స్వచ్ఛ ఆటోల విషయమై విద్యార్థినితో మాట్లాడుతున్న ఆమ్రపాలి

ఈనాడు, హైదరాబాద్‌: నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి దృష్టిపెట్టారు. బుధవారం ఉదయాన్నే పారిశుద్ధ్యంపై ఆకస్మిక తనిఖీ, అనంతరం ఆమె కార్యాలయంలో విభాగాధిపతులతో సమీక్ష, సాయంత్రం సందర్శకులు, ఉద్యోగుల సమస్యలపై వినతులు స్వీకరించారు. నారాయణగూడ క్రాస్‌ రోడ్డు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్‌ రవికిరణ్, ఇతర అధికారులతో కలిసి చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో చెత్త కుప్పలు, మురుగునీరు నిలవడం గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్‌మఠ్‌ వద్ద చెత్త తరలింపు వాహనం డ్రైవరుతో మాట్లాడారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినితో మాట్లాడి స్వచ్ఛ ఆటోలకే చెత్త ఇవ్వాలని, తోటి వారికి, కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు.

సమాచారాన్ని సిద్ధం చేయండి.. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం జరగనున్న సర్వ సభ్య సమావేశం సన్నద్ధతపై ఆమ్రపాలి దృష్టిపెట్టారు. విభాగాధిపతులతో నిర్వహించిన సమీక్షలో.. ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, అభివృద్ధి, పనులు, నిర్వహణ పనులను అడిగి తెలుసుకున్నారు.

సమస్యలు ఆలకించి.. సాయంత్రం జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊదరి గోపాల్, ఇతర నేతలు బల్దియా ఉద్యోగుల సమస్యలను ఆమ్రపాలికి వివరించారు. గుత్తేదారుల సమస్యలపై సంఘం నేతలు సాయి, శ్రీశైలం వినతిపత్రం ఇచ్చారు. నిర్మాణ అనుమతులు, ఇతరత్రా సమస్యలపై ప్రజలు ఆమెను కలిసి పరిష్కారం కోరారు.

నిలోఫర్‌లో సూపరింటెండెంట్‌ ఉషారాణితో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: నిలోఫర్‌ ఆసుపత్రిని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి బుధవారం సందర్శించారు. అక్కడి ఇంటెన్సివ్‌ బ్లాక్, డయాగ్నొస్టిక్‌ ల్యాబ్, క్వాలిటీ కంట్రోల్‌ రూమ్, ఫిజియోథెరఫీ, పీడియాట్రిక్‌ సర్జికల్‌ వార్డు, ఆపరేషన్‌ థియేటర్లు, ఎస్‌ఎన్‌సీయూ లాక్టేషన్‌ మేనేజ్‌మెంట్, నవజాత శిశువుల వార్డు తదితర విభాగాలను చూశారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆసుపత్రికి ఎంఆర్‌ఐ యంత్రం రాలేదని, పీజీ వసతిగృహం అవసరమని సూపరింటెండెంట్‌ డా.ఉషారాణి కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నాణ్యమైన ఆధునిక వైద్యం నిలోఫర్‌లో ఉచితంగా అందించడం గొప్ప విషయమన్నారు. పుట్టుక లోపాలతో జన్మించే పిల్లల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటి, నిలోఫర్‌ ఆర్‌ఎంఓ(సీఎస్‌) జ్యోతి, లాలూప్రసాద్‌ రాథోడ్, కల్యాణి శ్రీనివాస్, డి.గంగాప్రసాద్‌ ఉన్నారు.

ప్రభుత్వాసుపత్రి పరిసరాలను పరిశీలిస్తున్న శశాంక

శంషాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని జిల్లా పాలనాధికారి శశాంక పేర్కొన్నారు. బుధవారం శంషాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పరిసరాలను పరిశీలించారు. విధులకు సకాలంలో హాజరు కాని వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు చేసే వైద్య పరీక్షల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శంషాబాద్‌ తహసీల్దార్‌ కొప్పెర నాగమణి, ఇతర అధికారులు ఆయన వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని