logo

గ్రేటర్‌ సమగ్ర అభివృద్ధికి ‘హైసిటీ’

బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది.

Published : 04 Jul 2024 01:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నగరాన్ని అంతర్జాతీయ సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దీనిని తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో వివిధ వ్యూహాత్మక పథకాల పేరుతో గ్రేటర్‌ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించారు. ఇందులో భాగంగా ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, సీఆర్‌ఎంపీ తదితర వాటిని నెలకొల్పారు. ఈ పథకాల్లో భాగంగా చేపట్టిన కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటిని పూర్తి చేయడం, నూతన పనులను ప్రతిపాదిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రాధాన్య మౌలిక వసతులను కల్పించేందుకు ‘హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌’ (హైసిటీ) పేరుతో సరికొత్త పథకాన్ని అందుబాటులో తెచ్చారు. గతంలో చేపట్టిన పనులు పూర్తవ్వడానికి కావాల్సిన నిధులు.. తాజాగా పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం బల్దియా అధికారులను ఆదేశించింది. గతంలో గ్రేటర్‌లో 42 పనులు ప్రతిపాదించగా అందులో 35 పనులు పూర్తయ్యాయి. మరో 7 పనులు వివిధ ప్రగతి దశలో ఉన్నాయి. ఎస్‌ఎన్‌డీపీ ద్వారా గ్రేటర్, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీల్లో మొత్తం 58 పనులు చేపట్టారు. అందులో 39 పనులు పూర్తి చేశారు. మొత్తం 69.49 కిలోమీటర్ల పొడవునా నాలాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 42.48 కిలోమీటర్ల మేరకు పూర్తిచేశారు. నాలాల అభివృద్ధికి (ఎస్‌ఎన్‌డీపీ) హైసిటీ పథకంలో భాగంగా రూ.582.42 కోట్ల అంచనాతో 35 పనులు తాజాగా చేపట్టనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని