logo

Drugs: మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్‌ రాకెట్‌ను ఛేదించిన టీజీ న్యాబ్‌ పోలీసులు

గరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్‌ రాకెట్‌ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు.

Updated : 04 Jul 2024 09:52 IST

ఈనాడు, హైదరాబాద్‌ రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: నగరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్‌ రాకెట్‌ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు. బుధవారం సికింద్రాబాద్‌ ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో టీజీ న్యాబ్‌ ఏసీపీ చల్లా శ్రీధర్, తిరుమలగిరి ఏసీపీ జి.రమేష్, ఇన్‌స్పెక్టర్లు రమేష్‌రెడ్డి, వి.రామకృష్ణలతో కలసి టీజీ న్యాబ్‌ ఎస్పీ సాయిచైతన్య, ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.

నగరానికి చెందిన మహ్మద్‌ అక్రం(28), సి.ఎస్‌.ప్రణయ్‌(26), రోహన్‌ విలియమ్స్‌(23) మిత్రులు. డబ్బు సంపాదనకు మత్తుపదార్థాల సరఫరాను మార్గంగా ఎంచుకున్నారు. ఒక్క డోస్‌తో ఎక్కువ ఇచ్చే ఓజీ(ఓషన్‌ గ్రోన్‌), ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను సరఫరా చేసే స్మగ్లర్‌కు దగ్గరయ్యారు. అతడి ద్వారా విదేశాల్లో మాత్రమే పండే ఓజీ గంజాయి ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఓజీ గ్రాము రూ.4వేలు, ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌ ఒక్కోటి రూ.3వేలకు విక్రయించేవారు. ఆరు నెలలుగా దందా సాగిస్తున్నారు. షాద్‌నగర్‌లోని ప్రముఖ విద్యాసంస్థలోని ఎక్కువ మంది విద్యార్థులు ఓజీకి అలవాటుపడినట్టు టీజీ న్యాబ్‌కు సమాచారం అందటంతో నిఘా ఉంచారు. ముగ్గురు నిందితులతో సహా డ్రగ్స్‌ వాడుతున్న నిరుద్యోగి బి.భరణికుమార్‌(26), వ్యాపారులు రోషన్‌సింగ్‌(28), పి.నిఖిల్‌రెడ్డి(29), ఎన్‌.సూర్యతేజ(29), బి.సాయిచరణ్‌రెడ్డి (29), బి.పృధ్వీసాయినాథ్‌రెడ్డి(26), విద్యార్థులు బి.అర్జున్‌చౌదరి(19), సి.ఆదినారాయణరెడ్డి(20)ను అరెస్ట్‌ చేశారు. ప్రముఖులు, సంపన్నవర్గాల పిల్లలు కూడా.. ఈ ముఠా నుంచి షాద్‌నగర్‌లోని ప్రముఖ విద్యాసంస్థలో చదువుతున్న 20 మంది విద్యార్థులు ఓజీ,ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు నిర్దారించారు. తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎవరా కీలకసూత్రధారి?.. ఓజీ రకం గంజాయిని ఇంత సులువుగా నగరానికి చేరవేస్తున్న కింగ్‌పిన్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఖరీదైన డ్రగ్స్‌ దందాతో రోజుకు రూ.2-3లక్షల వ్యాపారం సాగిస్తున్న ఇతడు పట్టుబడితే కీలక సమాచారం వెలుగుచూసే అవకాశం ఉంది. పోలీసులకు పట్టుబడకుండా ఈ ముఠా సామాజిక మాధ్యమాల వేదికగా లావాదేవీలు నిర్వహిస్తోంది.

సమాచారమిస్తే రూ.2లక్షల నజరానా.. వంద కిలోల కంటే ఎక్కువ గంజాయికి సంబంధించిన సమాచారం అందజేస్తే రూ.2లక్షల నజరానా ఇస్తామని ప్రకటించారు. ఫోన్‌ నంబర్‌ 87126 71111, సామాజిక మాధ్యమాల ద్వారా వివరాలు తెలియజేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని