logo

విద్యార్థులు- ఉపాధ్యాయులు నిష్పత్తి సరి చేస్తారా?

ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 04 Jul 2024 04:37 IST

వందకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించని హేతుబద్ధీకరణ

  •  బహదూర్‌పురా మండలంలోని తాడ్‌బన్‌ ప్రాథమిక పాఠశాలలో ఇప్పటి వరకూ ఒక్కరే చేరారు.
  •  ఖైరతాబాద్‌ ప్రాథమిక పాఠశాలలో 20మంది చేరగా.. సికింద్రాబాద్‌లోని సుభాష్‌ రోడ్‌ పాఠశాలలో 9మంది ప్రవేశాలు పొందారు.
  •  అంబర్‌పేట్‌ మండలంలోని ఓల్డ్‌మలక్‌పేట్‌ ప్రాథమిక పాఠశాలలో 17మంది చేరారు. పాతబస్తీలోని పురానాపూల్‌ చార్‌మహల్‌ పాఠశాలలో ఏడుగురు ప్రవేశాలు పొందారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులుండేలా విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. మూడు జిల్లాల్లో 2,586 ప్రభుత్వ పాఠశాలలుండగా.. ఏళ్ల తరబడి హేతుబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోవడంతో విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలల్లో ఎక్కువమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎక్కువమంది ఉన్న పాఠశాలల్లో తక్కువమంది ఉన్నారు. హైదరాబాద్‌ జిల్లాలోని పాతబస్తీలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే... ఆయా పాఠశాలల్లో సగటున ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. ఇందుకు భిన్నంగా అమీర్‌పేట్, మారేడ్‌పల్లి, షేక్‌పేట్, ముషీరాబాద్‌ మండలాల్లో విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని జిల్లా పరిధిలోనే ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయితే విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరస్పర ప్రయోజనం కలిగే అవకాశాలున్నాయి.

సరిపడా ఉపాధ్యాయులుంటేనే... 

విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డులు పరిశీలించారు. గతంలో కొన్నిచోట్ల విద్యార్థులు తక్కువగా ఉంటే... హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలను మూసేసి.. మరో ప్రాంతానికి తరలిస్తారన్న భయంతో కొందరు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు రికార్డుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలోని పాతబస్తీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కొన్ని మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో ఒక్కో తరగతిలో పదిమంది విద్యార్థులు కూడా లేరు. హైదరాబాద్‌ జిల్లాల్లో నాలుగు పాఠశాలల్లో గరిష్ఠంగా ఒక తరగతిలో 8మంది విద్యార్థులున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు పాఠశాల్లో పదిమంది మాత్రమే విద్యార్థులున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలంటే విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు ప్రవేశాలపై దృష్టి కేంద్రీకరించాలి. హైదరాబాద్‌లో గల్లీకి రెండు, మూడు ప్రైవేటు పాఠశాలలు ఉండటంతో సర్కారు బడులకు తమ పిల్లలను పంపించేందుకు 90శాతం మంది తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో ప్రభుత్వ బడులంటే అంటే.. రాజ్‌భవన్, మహబూబియా పాఠశాలల్లా ఉండాలి. ఇందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలుండటం, రెండు వందలకు పైగా అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు సర్కారు బడుల్లో చేర్చేంప్రవేశాలపై దృష్టి సారిస్తేనే..దుకు ఇష్టపడటం లేదు.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు