logo

దిగుమతి తగ్గినా.. ఆదాయంలో అదే జోరు

బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు మామిడి సీజన్‌.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది.

Updated : 04 Jul 2024 04:36 IST

పండ్ల మార్కెట్‌లో మామిడి సీజన్‌ తీరు
అబ్దుల్లాపూర్‌మెట్, న్యూస్‌టుడే

బాటసింగారంలోని మార్కెట్‌లో మామిడి 

బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు మామిడి సీజన్‌.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు మామిడికాయలు భారీగా విక్రయానికి వస్తాయి. అయితే ఈ ఏడాది అంతటా మామిడి దిగుబడి కొంత తగ్గిన విషయం తెలిసిందే. అయితే పండ్ల మార్కెట్‌ ఆదాయంపై మాత్రం ఆ ప్రభావం పడలేదనే చెప్పాలి. దీంతో పాటు దిగుబడి తగ్గినప్పటికీ ధరల్లో నిలకడ మూలంగా రైతుల రాబడి ఆశాజనకంగానే ఉన్నట్లు మార్కెట్‌కు వచ్చిన రైతులు పలువురు పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పండ్ల మార్కెట్‌కు వచ్చిన మామిడి తక్కువే. అయినా.. వ్యాపారం, మార్కెట్‌ ఆదాయంలో మాత్రం పెద్దగా తేడా లేదు.

గతేడాదిలో పోల్చితే..

2023 మామిడి సీజన్‌లో జూన్‌ నెలాఖరు వరకు బాటసింగారం మార్కెట్‌కు మామిడి లోడ్‌తో 55,574 వాహనాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 50,341 వాహనాల్లో మామిడి మార్కెట్‌కు తరలివచ్చింది. ఈ సంవత్సరం ఆయా ప్రాంతాల్లో మామిడి దిగుబడి తగ్గిందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. గతేడాది 1,20,000 మెట్రిక్‌ టన్నుల మామిడి దిగుమతి అయితే.. ఈ ఏడాది జూన్‌ 27వ తేదీ నాటికి 1,11,000 మెట్రిక్‌ టన్నులుగా ఉంది.

వ్యాపారంతో  కాసుల పంట

బాటసింగారంలోని పండ్ల మార్కెట్‌లో గతేడాది రూ.315 కోట్ల టర్నోవర్‌ నమోదైతే.. ఈ ఏడాది రూ.314 కోట్లుగా ఉంది. మామిడి దిగుమతిలో 9వేల మెట్రిక్‌ టన్నుల వరకు తగ్గుదలే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే దిగుబడి తగ్గినా.. ధరలు మాత్రం ఆశాజనకంగానే ఉండటంతో మార్కెట్‌ ఆదాయంపై ఆ ప్రభావం పడలేదు. గతేడాది మామిడి వ్యాపారంతో మార్కెట్‌కు రూ.3.15 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది గత నెల 27వ తేదీ నాటికి రూ.3.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సీజన్‌ ముగిసే నాటికి మరింత లాభం వచ్చే అవకాశ ఉంది. అంటే గతేడాదితో పోల్చితే మార్కెట్‌కు దిగుమతి అయిన మామిడి కంటే.. ఈ ఏడాది దిగుమతి అయిన మామిడి తక్కువే అయినప్పటికీ ఆదాయంలో మాత్రం క్షీణత కనిపించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని