logo

నెక్నాంపూర్‌ చెరువు.. పునరుద్ధరణ భేష్‌

చెరువుల పునరుద్ధరణలో నెక్నాంపూర్‌ను ఆదర్శంగా తీసుకోవచ్చని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) ప్రకటించింది.

Published : 04 Jul 2024 01:49 IST

సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ కితాబు

చెరువుల పునరుద్ధరణలో నెక్నాంపూర్‌ను ఆదర్శంగా తీసుకోవచ్చని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) ప్రకటించింది. ‘బ్యాక్‌ ఫ్రమ్‌ ది బ్రింక్‌’ పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.  గతేడాది నీతిఆయోగ్‌ సైతం ‘పునరుద్ధరణ అంశంలో దేశంలోనే ఈ విధానం ఆచరణీయం’ అని కితాబిచ్చింది. 

సీఎస్‌ఈ పేర్కొన్న అంశాలివే...

వినూత్న విధానాలతో నెక్నాంపూర్‌ చెరువుకు కొత్త రూపు తెచ్చారని సీఎస్‌ఈ పేర్కొంది. ఫ్లోటింగ్‌ ఐలాండ్స్, ఫ్లోటింగ్‌ సైకిల్‌ తదితర పద్ధతులను వినియోగిస్తున్నారని వెల్లడించింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నివేదిక ప్రకారం ఇక్కడ బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ) లీటర్‌ నీటిలో 26ఎంజీ ఉండగా  8.2 ఎంజీకి తగ్గించారంది. నాలుగేళ్ల (2018 నుంచి 2022) అవిరళ కృషితో ఇది సాధ్యమైందని తెలిపింది. త్వరలో కేంద్ర కాలుష్య నియంత్రణమండలి సూచించిన విధంగా 5ఎంజీకి చేరుకోవచ్చని వివరించింది. ఒకప్పుడు జంతుకళేబరాలు, వ్యర్థాలు, మురుగుతో నిండిపోయిన ఈ నీటిలో ఆక్సిజన్‌ పరిమాణం పెరగడంతో ప్రస్తుతం 2వేల తాబేళ్లు, 150 రకాల పక్షులు, 25 వేలకు పైగా చేపలు జీవిస్తున్నాయని నివేదికలో పేర్కొంది.

47 ప్రాంతాల్లో కనుమరుగయ్యే స్థితిలో...

రాజధాని పరిధిలో మొత్తం 180కి పైగా చెరువులు ఉండగా అనేకం భూబకాసురుల చేతికి చిక్కాయి. వరదలు వచ్చినప్పుడల్లా వాటి ఆనవాళ్లు బయటపడుతున్నాయి. పీసీబీ నివేదిక ప్రకారం 47 పూర్తిగా కనుమరుగైపోయిన, అధ్వాన స్థితిలో ఉన్నాయి. మరో పదింటి  వివరాల్లేవని పీసీబీ తెలిపింది.

చెరువు కట్టపై పచ్చదనం

ప్రస్తుతం అధ్వాన, కనుమరుగయ్యే స్థితిలో ఉన్న చెరువులు ఇవే...పెద్ద చెరువు - రాజేంద్రనగర్, పెద్ద చెరువు - శేరిలింగంపల్లి, మేడికుంట - గుట్టల బేగంపేట్, మేడికుంట - బీకే ఎన్‌క్లేవ్, చర్లపల్లి చెరువు - చర్లపల్లి, చిన్న పెద్దచెరువు - గోపన్‌పల్లి, నాయనమ్మకుంట - హఫీజ్‌పేట్, రేగులకుంట - మియాపూర్, నానక్‌రామ్‌కుంట - నానక్‌రామ్‌గూడ, శాంతి సరోవర్‌ - గచ్చిబౌలి, మొండికుంట - ఖానామెట్, మజీద్‌బండ చెరువు - కొండాపూర్, పాలెచెరువు - కాటేదాన్, బండ చెరువు - మల్కాజిగిరి, ఖాజాకుంట - మల్కాజిగిరి, ఖాజాకుంట - కూకట్‌పల్లి, ముక్కిడి చెరువు - మల్కాజిగిరి, కొత్త చెరువు - అల్వాల్, తిరుమలగిరి చెరువు - తిరుమలగిరి, మోత్కుల కుంట - మచ్చబొల్లారం, మహబూబ్‌కుంట - సురారం, బందంచెరువు - గాజులరామారం, మెద్దెల కుంట - గాజులరామారం, మోహిని చెరువు - అంబర్‌పేట్, ఎర్రకుంట - షేక్‌పేట్, శాతంచెరువు - షేక్‌పేట్, సల్కంచెరువు - బండ్లగూడ, మంగళవానికుంట - హఫీజ్‌పేట్, పోచమ్మకుంట - గచ్చిబౌలి, తౌతుకుంట - ఖాజాగూడ, ఖానామెట్‌ చెరువు - ఖానామెట్,  రంగన్నకుంట - శేరిలింగంపల్లి, గోసాయికుంట - గోపన్‌పల్లి, ఈద్గవాయికుంట - గోపన్‌పల్లి, నీర్ల చెరువు - కొత్తగూడ, ఈర్ల చెరువు - కొత్తగూడ, చిన్నచెరువు - మన్సురాబాద్, బతుకమ్మకుంట - సాహెబ్‌నగర్, బచ్చుకుంట - చందానగర్, పీకాక్‌ లేక్‌ - హెచ్‌సీయూ, మజీద్‌ - ఇ - జలాల్‌ చెరువు - గోపన్‌పల్లి, కళాపురం బస్తీకుంట - మియాపూర్, గుండ్లకుంట - హెచ్‌సీయూ, గున్నేరుకుంట - హెచ్‌సీయూ, మెడ్లకుంట - గోపన్‌పల్లి, సందప్పకుంట - నానక్‌రామ్‌గూడ, ఎన్‌ఐఆర్‌డీ లేక్‌ - రాజేంద్రనగర్, మైసమ్మకుంట - మణికొండ.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని