logo

6 నెలలు.. 10 చోరీలు

టాస్క్‌ఫోర్స్‌ సౌత్‌ ఈస్ట్‌జోన్, బండ్లగూడ ఠాణా పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం.. ఘరానా దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు.

Updated : 04 Jul 2024 06:40 IST

పట్టుబడ్డ పాతనేరస్థుడు.. రూ.22 లక్షల సొత్తు స్వాధీనం

నిందితుడు, స్వాధీనం చేసుకున్న ఆభరణాలను చూపుతున్న పోలీసులు

కేశవగిరి, న్యూస్‌టుడే: టాస్క్‌ఫోర్స్‌ సౌత్‌ ఈస్ట్‌జోన్, బండ్లగూడ ఠాణా పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం.. ఘరానా దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైవీఎస్‌ సుధీంద్ర తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ బండ్లగూడ ఠాణా పరిధిలోని బండ్లగూడ, ఇస్మాయిల్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ సలీం అలియాస్‌ సునీల్‌ శెట్టి, అలియాస్‌ ఇబ్రాహీం అలియాస్‌శెట్టి సలీం(51) ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలు చేసే ఘరానా దొంగ. వృత్తిరీత్యా పెయింటర్‌గా, తోపుడు బండిపై కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 1992 నుంచి దొంగగా మారి 150 చోరీలు చేశాడు. ఫలక్‌నుమా పరిధిలో నివసిస్తున్న క్రమంలో 2023 మేలో పోలీసులు అరెస్టు చేశారు. అదే ఏడాది డిసెంబరులో జైలునుంచి విడుదలయ్యాడు. ఇస్మాయిల్‌నగర్‌కు మకాం మార్చాడు. మళ్లీ చోరీల బాట పట్టాడు. పగలు తోపుడుబండిపై కూరగాయలు విక్రయిస్తూ.. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేస్తాడు. అదేరోజు రాత్రి తాళాలు విరగ్గొట్టి ఆ ఇళ్లలో చోరీ చేస్తుంటాడు. సొత్తు విక్రయించి జల్సాలుచేస్తుంటాడు. ఇలా 2024 జనవరి నుంచి జూన్‌ వరకు 6 నెలల్లో 10 ఇళ్లలో చోరీలు చేశ్డాడు. బండ్లగూడ ఠాణా పరిధిలో 4 ఇళ్లలో, రాచకొండ కమిషనరేట్‌ బాలాపూర్‌ ఠాణా పరిధి 5, చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో ఒక ఇంట్లో చోరీలు చేశాడు. నగర కమిషనర్లు, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైవీఎస్‌ సుధీంద్ర ఆదేశాల మేరకు నగర టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు నేతృత్వంలో సౌత్‌ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ డి.వెంకట్‌రెడ్డి, ఎస్సైలు షేక్‌ ఖవియుద్దీన్, పి.సాయిరాం, సి.రాఘవేంద్రరెడ్డి, కానిస్టేబుల్‌ నయీంఖాన్, బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా సీసీకెమెరాలను జల్లెడ పట్టి నిందితుడు సలీంను మంగళవారం పట్టుకున్నారు. 292 గ్రాముల బంగారు ఆభరణాలు, 1090 గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.22 లక్షలు ఉంటుంది.


బ్రీత్‌ ఎనలైజర్‌ తస్కరించిన నిందితుడి పట్టివేత

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: ట్రాఫిక్‌ పోలీసుల చేతుల్లోంచి బలవంతంగా బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని ఉడాయించిన నిందితుడిని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. రాంపల్లి తారకాకాలనీలో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్‌ కారు డ్రైవర్‌. గతనెల 27న బోయిన్‌పల్లి ట్రాఫిక్‌ పోలీసులు పుల్లారెడ్డి బంగ్లా సమీపంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌ అటుగా వస్తున్న శ్రావణ్‌ కారు నిలిపి బ్రీత్‌ ఎనలైజర్‌లో ఊదాలని చెప్పాడు. నిందితుడు కానిస్టేబుల్‌ను తోసేసి దాన్ని లాక్కుని పరారయ్యాడు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుడి కారు నంబరును గుర్తించి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బ్రీత్‌ ఎనలైజర్, కారును స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించారు.


తీగలు తెగి సామగ్రి తరలించే లిఫ్టు పడి.. భవన నిర్మాణ కార్మికుడి దుర్మరణం

రాములు 

నిజాంపేట, న్యూస్‌టుడే: నిర్మాణంలో ఉన్న భవనంపైకి సామగ్రి తరలించే లిఫ్టు తీగలు తెగిపడడంతో అది పైనపడి కార్మికుడు దుర్మరణం చెందిన ఘటన బాచుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. మృతుని బంధువులు, పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం హస్నాబాద్‌కు చెందిన వై.రాములు(56) కుటుంబంతో కొన్నేళ్లక్రితం నగరానికి వలస వచ్చి బీహెచ్‌ఈఎల్‌ అశోక్‌నగర్‌లో నివాసముంటున్నాడు. బాచుపల్లి పరిధి కౌసల్యకాలనీలో డాల్ఫిన్‌ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భారీ గృహసముదాయం వద్ద రెండేళ్లుగా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నిర్మాణ సామగ్రిని భవనంపైకి తరలించడానికి రోడ్డువైపు తాత్కాలిక లిఫ్టు ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు రాములు భవనం కింద నిల్చుని నిర్మాణ సామగ్రిని లిఫ్టులో పంపించాడు. తర్వాత అనుసంధానంగా ఉన్న తీగలు తెగి ఐదో అంతస్తు నుంచి రాములుపై లిఫ్టు పడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పటిష్టంగా లిఫ్టును ఏర్పాటుచేయకపోవడంతోనే దుర్ఘటన జరిగిందని బంధువులు ఆరోపించారు. అనారోగ్యంతో మూడురోజులు రాములు పనికిరాలేదు. తర్వాత వచ్చిన కొన్నిగంటలకే అతను మృత్యువాత పడడంతో భార్య ఇత్తమ్మ, బంధువులు బోరున విలపించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ తోటి కార్మికులు ఆందోళన చేశారు. మృతుడికి ముగ్గురు కుమారులున్నారు. ఎస్సై జి.సంధ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


బాలికపై అత్యాచారం.. మొబైల్‌ టెక్నీషియన్‌ అరెస్టు


నిందితుడు డేవిడ్‌

అంబర్‌పేట, న్యూస్‌టుడే: బాలికను మాయమాటలతో లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడుతున్న మొబైల్‌ టెక్నీషియన్‌ను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేసి  రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు రెంటచింతలకు చెందిన డేవిడ్‌(30) రెండేళ్ల క్రితం ఉపాధి కోసం నగరానికి వచ్చి చెన్నారెడ్డినగర్‌ పరిధిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అతడి భార్య గర్భిణి కావడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. స్థానికంగా నివసించే బాలిక(14) ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమెకు తరచూ చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్‌ ఇస్తూ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. డేవిడ్‌ ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించడంతో.. సంబంధిత విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి బాలిక తీసుకెళ్లింది. వారి ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు.


చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ ప్లాట్ల కేటాయింపులో మరో ఐదు కేసులు

రాయదుర్గం, న్యూస్‌టుడే: చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఒక్కొక్కరుగా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయిస్తున్నారు. రాయదుర్గం ఠాణాలో మొత్తం చిత్రపురికాలనీ సొసైటీ అక్రమాలపై 15 కేసులు నమోదు కాగా తాజాగా ఐదు ఫిర్యాదులు అందినట్లు ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపారు. ఐదుగురు సభ్యుల కమిటీ ఆదేశాలను పట్టించుకోకుండా సొసైటీ పాలక మండలి, జిల్లా సహాకార శాఖ అధికారులు అర్హతలేని వారికి 336 ఫ్లాట్లు రిజిస్టర్‌ చేశారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్‌ సినీ దర్శకుడు కాట్రగడ్డ రవితేజ(74) పోలీసులను ఆశ్రయించినవారిలో ఉన్నారు. తాను డబ్బులు చెల్లించినా ఫ్లాట్‌ కేటాయించకుండా ఇతరులకు అప్పగించారన్నారు. ఓ వ్యక్తి తాగునీటి పైపులైన్‌ కోసం రూ37.50 లక్షలు తీసుకుని పనిచేయలేదని, తిరిగి ఆ డబ్బులు సొసైటీకి చెల్లిస్తానన్నా అలా చేయలేదని ఆరోపించారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ టి.పద్మావతి(54), పైడిపాటి రాజేంద్రకుమార్‌ కుమారుడు రాహుల్, బాకి జానకి, ఎం.శ్రవణ్‌ కుమార్‌ కూడా ఫిర్యాదు చేశారు.


సీఐ, ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్‌

రెజిమెంటల్‌బజార్‌: గతంలో ఓ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వహించారనే ఆరోపణతో సీఐతో పాటు ఇద్దరు ఎస్సైలను సస్పెండ్‌ చేస్తూ నగర కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. 2023లో మహంకాళి ఇన్‌స్పెక్టర్‌గా కావేటి శ్రీనివాసులు పనిచేస్తున్న సమయంలో చంద్రలోక్‌ కాంప్లెక్స్‌లో ఓ కేసు విషయంలో అతనితో పాటు ఎస్సైలు బి.భాస్కరరావు, జి.రాకేష్‌ కేసు దర్యాప్తును సక్రమంగా నిర్వహించలేదని ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టి నివేదికను అందజేశారు. ఈ మేరకు నగర సీపీ వారిని సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని