logo

విస్తరణ వివాదాస్పదం.. పనులకు అంతరాయం

జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు.

Published : 04 Jul 2024 01:47 IST

విపణి నిర్మించాల్సిన స్థలం

న్యూస్‌టుడే,తాండూరు,వికారాబాద్‌ మున్సి పాలిటీ: జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. అయితే 11 మంది రైతులు తమ పొలాల్లో తమకు తెలియకుండా విస్తరణ పనులు నిర్వహించడమేమిటనే విషయంలో ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించి పనులను ఆపేశారు. దీంతో విపణి విస్తరణపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

రూ.10 కోట్లు.. 30 ఎకరాల స్థలం

తాండూరు వ్యవసాయ విపణిని విస్తరించేందుకు ప్రభుత్వం పట్టణ శివారులో 30 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మొదటి దశలో కార్యాలయ భవనం, ప్రహరీ, ఆర్వో ప్లాంటు, శౌచాలయాల బ్లాకులు, విద్యుద్దీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇవి పూర్తి కాగానే  రెండో దశ పనులు చేపట్టాలన్నది ప్రణాళిక. రెండోదశలో వ్యాపార దుకాణాలు, షెడ్లు, ఫ్లాట్‌ఫారాలు, క్యాంటిన్‌ వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మొదటి దశ పనులకు  ప్రభుత్వం రూ.10 కోట్లను మంజూరు చేసింది. వీటితో కేటాయించిన స్థలంలో  గుట్టలను, పెద్ద పెద్ద రాళ్లను తొలగించారు. నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమౌతున్న సమయంలో సమీపంలోని పొలాలకు చెందిన 11 మంది రైతులు విపణి విస్తరణలో తమ భూములు పోతున్నాయి. అధికారులు ఎవరూ తమను సంప్రదించకుండా పనులు చేపడుతున్నారు. పరిహారం చెల్లించే విషయంలోనూ విస్మరించారని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో వేగంగా జరుగుతున్న పనులకు ఉన్నట్టుండి న్యాయస్థానం జోక్యంతో బ్రేక్‌ పడింది.

స్వాతంత్య్రానికి ముందే  ఆవిర్భావం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్రానికి ముందే తాండూరు వ్యవసాయ విపణి ఆవిర్భవించింది. మొత్తం 7 ఎకరాల స్థలాన్ని కార్యకలాపాలు నిర్వహించడానికి అప్పట్లో కేటాయించారు. ఇందులో 4 ఎకరాల పశువుల విక్రయానికి సంబంధించిన స్థలం అయితే కేవలం 3 ఎకరాలు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు కేటాయించారు. ఈ స్థలంలో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది.

సంవత్సరానికి రూ.450 కోట్ల లావాదేవీలు

ఈ విపణిలో ఏటా రూ.450 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు విపణిలో విక్రయమౌతాయి. సరిపోను స్థలం లేక ఉత్పత్తులను రైతులు రహదారుల వారగా నిల్వ చేస్తున్నారు. ఈ పరిణామం విపణికి వచ్చి పోయే లోడింగ్, అన్‌లోడింగ్‌ వాహనాలకు ఇబ్బందిగా మారింది. స్థలా భావం వల జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ-నామ్‌) సవ్యంగా అమలు కావడం లేదు. రైతులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. ముఖ్యంగా ఉత్పత్తుల  తూకాల సమయంలో సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. వ్యాపారులు, రైతులు కోరిన మేరకు ప్రభుత్వం విపణి విస్తరణకు నిర్ణయం తీసుకుంది.

న్యాయ స్థానం నుంచి తీర్పు వచ్చాకే ఏదైనా..: రాజేశ్వరి, విపణి ప్రత్యేక శ్రేణి కార్యదర్శి, తాండూరు

ప్రస్తుతం ఆగిపోయిన విపణి విస్తరణ పనులను న్యాయస్థానం నుంచి అనుకూల తీర్పు వెలువడ్డాకే పనులు చేపడతాం. 11 మంది రైతులు వివిధ కారణాలను చూపుతూ న్యాయస్థానానికి వెళ్లడంతో పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఉన్నతాధికారులకు విషయాన్ని వివరించాం. న్యాయ స్థానంలో అప్పీలు చేయాలనే విషయాన్ని ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని