logo

అటవీ శాఖలో అవినీతి కలకలం!

అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్‌ఎఫ్‌ఓ) అరుణ, శ్యాంసుందర్‌లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

Published : 04 Jul 2024 01:45 IST

రూ.53.72 లక్షల తునికాకు బోనస్‌ చెల్లింపులో చేతివాటం
ఇద్దరు ఆర్‌ఎఫ్‌ఓలపై వేటుతో చర్చ
న్యూస్‌టుడే, వికారాబాద్, తాండూరు

అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్‌ఎఫ్‌ఓ) అరుణ, శ్యాంసుందర్‌లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్‌ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

బయటపడిందిలా..: జిల్లాలోని 8 యూనిట్లకు 2017లో రూ.49.19 లక్షలు, 2018లో రూ.1.63 లక్షలు, 2021లో నాలుగు యూనిట్లకు రూ.2.90 లక్షలు బోనస్‌గా వచ్చాయి. రూపాయి ఖర్చుకు రెండున్నర రూపాయల ఆదాయం తునికాకు సేకరణ ద్వారా రావడంతో  తునికాకు సేకరణ జరిపిన కూలీలకు రూ.53.72 లక్షల బోనస్‌ మంజూరు చేశారు. ఈ డబ్బును దస్త్రాలను పరిశీలించి అప్పట్లో కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. కానీ గుట్టుచప్పుడు కాకుండా తమ అనుకూలురైన వ్యక్తుల ఖాతాల్లో జమ చేశారు.

డ్రైవర్‌ ఖాతాలోకి మళ్లింపు

వికారాబాద్‌ మండలం గొట్టిముక్ల యూనిట్‌కు సంబంధించి రూ.7.51 లక్షలను ఆర్‌ఎఫ్‌ఓ అరుణ అటవీశాఖ కార్యాలయంలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఒప్పంద ఉద్యోగి చిన్నయ్య, ఈయన భార్య యాదమ్మ ఖాతాల్లో జమ చేయాలని అరుణ ఆదేశించారు. ఈలోపు డ్రైవర్‌ చిన్నయ్య అనారోగ్యంతో మృతి చెందగా, భార్య యాదమ్మను భర్త స్థానంలో ఒప్పంద ఉద్యోగిగా తీసుకున్నారు. అనంతరం రూ.7.51 లక్షలు ఖాతాల్లో జమయ్యాయి. ఈ విషయం యాదమ్మకు తెలియదు. ఈ డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకురావాలని ఇటీవలే పదవీ విరమణ చేసిన కిష్టయ్య అనే ఒప్పంద ఉద్యోగిని అరుణ పురమాయించింది. దీంతో ఆయన యాదమ్మ దగ్గరికి వెళ్లి రూ.7.51 లక్షల విషయం తెలిపి, ఆ డబ్బుల్లో నుంచి రూ.31 వేలు ఉంచుకొని మిగతా ఆర్‌ఎఫ్‌ఓ అరుణకు ఇవ్వాలని సూచించారు. ఇందుకు యాదమ్మ అంగీకరించకపోవడంతో మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. దీనిపై నిగ్గు తేల్చాలని విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ రాజశేఖర్‌ను విచారణాధికారిగా నియమించింది. గత జూన్‌ 3న ఆయన విచారణ చేయగా, వ్యవహారం అంతా బయటపడింది. బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రూ.7.51 లక్షలను అటవీశాఖ తిరిగి తీసుకుంది.

 తాండూరులో విచారణ చేయగా, అక్కడ కూడా పెద్దేముల్‌ మండలం తట్లేపల్లి యూనిట్‌ కూలీలకు జమ చేయాల్సిన రూ.8.8 లక్షలను తమ అనుకూలురైన కూలీల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తించారు. జిల్లా మొత్తం 8 యూనిట్లకు మంజూరైన డబ్బులు కూలీలకు అందలేదని విచారణలో తేలింది. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందింది.

కంప్యూటరీకరణ చేసినా..

గతంలో తునికాకు సేకరణ జరిపే గుత్తేదారు నుంచి కూలీలకు పని దినాల ఆధారంగా డబ్బులు అందేవి. పది రోజులు పని చేస్తే 20 రోజులు పని చేసినట్లుగా చూపించి మధ్యలో కూలీల నుంచి తునికాకు సేకరించే కల్లెదారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా అటవీశాఖాధికారులు గుర్తించారు. వీటిని నియంత్రించడానికి 2022-23లో కంప్యూటరీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయినా అక్రమాలకు కళ్లెం పడలేదు. కల్లెదారులకు బదులుగా అటవీశాఖ అధికారులే అవినీతికి పాల్పడ్డారు. విషయం వెల్లడి కావడంతో అటవీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని