logo

‘హిస్సా’ ఇస్తామని మోసం

బక్రీద్‌ పండుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకొని మోసానికి తెగబడ్డారు. నిరక్షరాస్యులు, పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగం(హిస్సా) ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు.

Updated : 04 Jul 2024 04:44 IST

బక్రీద్‌నాడు మాయగాళ్ల వసూళ్లు
ముగ్గురి అరెస్టు.. రూ.23 లక్షల స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి.
పక్కన అదనపు డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌

ఈనాడు, హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్, న్యూస్‌టుడే:  బక్రీద్‌ పండుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకొని మోసానికి తెగబడ్డారు. నిరక్షరాస్యులు, పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగం(హిస్సా) ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు. బాధితుల ఫిర్యాదుతో హబీబ్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మెహిదీపట్నంలోని సౌత్‌వెస్ట్‌ డీసీపీ కార్యాలయంలో బుధవారం అదనపు డీసీపీ మహ్మద్‌ అశ్వక్, ఏసీపీ సయ్యద్‌ ఫియాజ్, ఇన్‌స్పెక్టర్‌ రాంబాబుతో కలిసి డీసీపీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. బహదూర్‌పూర్‌ వాసి మహ్మద్‌ నసీర్‌(30), బండ్లగూడ జాగీర్‌కు చెందిన మహ్మద్‌ జఫర్‌ అహ్మద్‌(29), మహ్మద్‌ ఆష్పక్‌(27) మిత్రులు. నాలుగేళ్ల క్రితం ఈ ముగ్గురు ‘ఖిద్మత్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేశారు. బక్రీద్‌ పండుగ వేళ జీవాలను బలిచ్చి బంధుమిత్రులకు భాగం పంపటం ముస్లింల(ఖుర్బానీ) ఆచారం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు తమ ఫౌండేషన్‌ ద్వారా సాయం చేస్తున్నట్టు నమ్మించారు. నాలుగేళ్లుగా ఏటా బక్రీద్‌ సందర్భంగా పేద, మధ్యతరగతి ముస్లిం కుటుంబాలకు తక్కువ ధరకు మాంసం భాగాలు పంపుతూ నమ్మకం కలిగించారు. ఈ ఏడాది కూడా న్యూమల్లేపల్లి, శాలిబండ, టోలిచౌకి ప్రాంతాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. 2,179 మంది నుంచి రూ.2,800 చొప్పున వసూలు చేసి రసీదులిచ్చారు. 500 మందికి మాత్రమే హిస్సా పంపారు. బాధితులు ఫోన్‌ చేసినా ముఖం చాటేశారు. ఆఘాపుర నివాసి అబ్దుల్‌బరి రెహ్మాన్‌ ఫిర్యాదుతో హబీబ్‌నగర్‌ ఠాణాలో కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు, ఎస్సై సందీప్, కానిస్టేబుళ్లు అనూష, ప్రశాంత్‌ అహ్మదుల్లాషా ఖాద్రి, అమీర్‌షరీఫ్, దినేష్‌కుమార్‌ బృందం కేసును ఛేదించింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.23 లక్షల నగదు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని