logo

ఈవీలకు ఛార్జింగ్‌ పాయింట్లే కీలకం

కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటు కీలకం.

Published : 04 Jul 2024 01:45 IST

సెల్లార్లలో కార్ల వరకు అనుమతిస్తున్నాం
‘ఈనాడు’తో ప్రభుత్వ ప్రధాన విద్యుత్తు తనిఖీ అధికారి శ్రీనివాసరావు

ఈనాడు, హైదరాబాద్‌: కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటు కీలకం. భద్రత దృష్ట్యా వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? అపార్ట్‌మెంట్ల సెల్లార్లలో ఏర్పాటు చేయవచ్చా? వీటిపై సమాధానం ఇచ్చారు తెలంగాణ ప్రధాన విద్యుత్తు తనిఖీ అధికారి (సీఈఐజీ) ఎస్‌.శ్రీనివాస్‌రావు.

ధ్రువీకరణ తప్పనిసరి

కార్లకు సంబంధించి బ్యాటరీలు పేలడం, ఛార్జింగ్‌ పాయింట్ల సమస్యలు మా దృష్టికి రాలేదు. బైకులకు ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) తప్పనిసరి చేశాం. ఇది లేకపోతే అనుమతి ఉండదు.

భద్రతాపరంగా రాజీలేదు

విద్యుత్తు వాహనాల ఛార్జింగ్‌ పాయింట్లకు సీఈఐజీ నిబంధనల మేరకు నడుచుకుంటున్నాం. కార్ల వరకు సెల్లార్లలో అనుమతి ఇస్తున్నాం. వీటికి 7.3 కిలోవాట్‌ సామర్థ్యం కల్గిన ఛార్జింగ్‌ పాయింట్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. వీటికోసం ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్, ప్యానల్‌ బోర్డు, మీటర్లుండాలి. బైకులకు సెల్లార్లలో కాకుండా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసుకోవాలి.

పాలసీ లేక..

ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు రాష్ట్రస్థాయిలో ఒక పాలసీ రూపొందించేందుకు గతంలో ఆస్కి బాధ్యత తీసుకుంది. మేం కూడా భాగస్వాములయ్యాం. 2030 నాటికి 30 శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలనే లక్ష్యం చేరుకోవాలంటే ఛార్జింగ్‌ కేంద్రాలు ముఖ్యం.

ప్రాణ నష్టం తగ్గింది.. గతేడాది వేసవితో పోలిస్తే ఈసారి విద్యుత్తు ప్రమాదాలు తగ్గాయి. మా అధికార బృందం ఎప్పటికప్పుడు కంపెనీలు, మాల్స్, ఆసుపత్రులు తనిఖీలు చేస్తూ భద్రతాపరంగా చేపట్టాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.

ఖాళీ పోస్టుల భర్తీపై ఆశాభావం

సీఈఐజీలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12 ఏఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీకి లేఖ రాశాం. రెండు రోజుల క్రితం మరో ఇద్దరు అధికారులు పదవీ విరమణ చేశారు. తాను సైతం ఆగస్టులో పదవీ విరమణ చేస్తున్నాను. కొత్త వారి చేరిక, పాతవారికి పదోన్నతులతో త్వరలోనే ఖాళీ పోస్టులు భర్తీ అవుతాయని ఆశిస్తున్నా.

ఇప్పటివరకు ఒకే దరఖాస్తు

ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క కమ్యూనిటీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఒక సంస్థ దరఖాస్తు చేసుకుంది. డ్రాయింగ్స్‌ పరిశీలనలో ఉన్నాయి. అనుమతి లేకుండా ఎవరు ఏర్పాటు చేసుకున్నా అక్రమమే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని