logo

నాలుగ్గోడల జీవితానికి స్వేచ్ఛ

తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు.

Updated : 04 Jul 2024 04:41 IST

అధికారుల సూచనతో ప్రతిజ్ఞ చేస్తున్న విడుదలైన ఖైదీలు

ఈనాడు- హైదరాబాద్, కాప్రా, న్యూస్‌టుడే: తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. జైలు అధికారుల సాయంతో నైపుణ్యాలకు సానబెట్టుకున్నారు. మానసిక నిపుణుల సూచనలతో చేసిన తప్పు తెలుసుకున్నారు. సత్ప్రవర్తనతో నడుచుకుంటున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న 213 మంది ఖైదీలను బుధవారం విడుదల చేసింది. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన ఖైదీలను ‘ఈనాడు’ పలకరించింది. వివరాలు వారి మాటల్లోనే..


11 ఏళ్లుగా జైలు గోడల మధ్యే..: అండాలమ్మ

హత్య కేసులో జైలుకొచ్చాను. 11 ఏళ్లుగా జైలు గోడల మధ్యే జీవితం గడిచిపోయింది. తెలిసీ తెలియక చేసిన తప్పు విలువ.. జైలుకు వచ్చాక అర్థమైంది. జైల్లో అల్లికలు, కుట్టు మిషన్‌ పనులు నేర్చుకున్నా. ఇక నుంచి స్వశక్తితో రెండో జీవితం ప్రారంభిస్తా. భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


జీవితమంటే తెలిసింది: కె.రాజేశ్, కరీంనగర్‌

ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో 15 ఏళ్ల క్రితం శిక్ష పడింది. జైలుకొచ్చా. ఇక్కడికొచ్చాక జీవితం విలువ అర్థమైంది. పెట్రోలు బంకులో పనిచేశా. ఇప్పుడు విడుదలవడం, నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మరో తప్పు జరగకుండా చూసుకుంటా. నాకు ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి.

కొత్త జీవితం ప్రారంభిస్తా

నా పేరు దాసరి మురళి. నిజామాబాద్‌ జిల్లా. ఆర్‌ఎంపీ వైద్యుడిని. 14 ఏళ్ల క్రితం భూ వివాదంలో నిగ్రహం కోల్పోయి దాడి చేయగా ఒకరు మరణించారు. జీవితకాల శిక్ష పడింది. ఇద్దరు పిల్లలున్నారు. వారి చదువులకు ఫీజు కట్టలేదని పిల్లల్ని కళాశాల నుంచి పంపించడం.. ఆర్థిక ఇబ్బందులతో మరింత కుంగిపోయా. ఇక్కడే డిగ్రీ, ఎంఏ సైకాలజీ చేశా. వివిధ కేసుల్లో జైలుకొచ్చే తోటి ఖైదీలకు కౌన్సెలింగ్‌ ఇచ్చా. ఇక కొత్త జీవితం ప్రారంభిస్తా.

దాసరి మురళి, నిజామాబాద్‌

యవ్వనమంతా ఇక్కడే

19 ఏళ్ల వయసులో హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది. 22 ఏళ్లుగా జైల్లో ఉంటూ యవ్వనాన్ని, తల్లిదండ్రుల ఆప్యాయత కోల్పోయా. కరోనా సమయంలో తోటి ఖైదీలతో కలిసి 5 వేల లీటర్ల శానిటైజర్‌ తయారుచేశా. సబ్బులు, సర్ఫ్, ఫినాయిల్, పరిశుభ్రతకు సంబంధించి ఉత్పత్తుల తయారీ నేర్చుకున్నా. బిహార్‌ వెళ్లాక అమ్మను బాగా చూసుకుంటా. నన్ను జైలు నుంచి విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.

మున్నా ఉపాధ్యాయ్, బిహార్‌

కోల్పోయిన స్వేచ్ఛను ఆస్వాదిస్తా..

పొరపాటున చేసిన తప్పునకు 10 ఏళ్ల క్రితం అరెస్టయి జైలుకొచ్చా. జీవితకాల శిక్ష పడడంతో ఇంకేం చేయలేని దుస్థితి. జైల్లో అనారోగ్యంతో సతమతమయ్యే నాకు అధికారులు అండగా నిలిచారు. యోగాతో కోలుకున్నా. కుట్టు మిషన్, బేకరి ఉత్పత్తుల తయారీ వంటి స్వయం ఉపాధి పనులు నేర్చుకున్నా. పదేళ్లుగా కోల్పోయిన స్వేచ్ఛను కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను ఆస్వాదిస్తా. జైల్లో నేర్చుకున్న నైపుణ్యాలతో సొంతంగా పనులు చేసుకుంటూ జీవిస్తా.

రాజేశ్వరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని