logo

మల్‌రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!

కొద్దిరోజుల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాజధానికి ప్రాతినిధ్యం లభించబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ వర్గాలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.

Published : 03 Jul 2024 05:35 IST

మంత్రివర్గ విస్తరణలో రాజధానికి అవకాశం
తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరు నేతలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

కొద్దిరోజుల్లో జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రాజధానికి ప్రాతినిధ్యం లభించబోతోందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ వర్గాలూ ఇదే స్పష్టం చేస్తున్నాయి. ఈ వారంలో మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు స్థానం లభించలేదు. కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే గెలవడంతోపాటు ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి మైనార్టీల ప్రాతినిధ్యం లేకపోవడంతో రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో గెలిచిన వీరెవరికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తమకు మంత్రివర్గం స్థానంలో కల్పించాలంటూ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈనేపథ్యంలో ఒకరికి స్థానం లభించే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 29 స్థానాలకుగాను ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్‌ నుంచి వీర్ల శంకర్, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నార్యాయణరెడ్డి గెలుపొందారు. వీరిలో వీర్లపల్లి శంకర్, నారాయణరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మల్‌రెడ్డి మాత్రం మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. కాంగ్రెస్‌ నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. తానే సీనియర్‌ కాబట్టి తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా కలిశారు. దిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలను కూడా రెండు మూడుసార్లు కలిసి వచ్చారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్‌ భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌లో చేరే సమయంలో.. ఒకవేళ ఎంపీగా ఓడిపోతే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌ హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. తనకు మంత్రివర్గంలో తప్పక స్థానం లభిస్తుందన్న ఆశలో దానం ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు మాత్రమే స్థానం కల్పించాలని అధిష్ఠానం నిర్ణయించిందంటూ వారం కిందట దిల్లీలో రేవంత్‌ విలేకరులకు వెల్లడించారు. దీంతో దానం ఆశలు సన్నగిల్లాయి. అయినా తన ప్రయత్నాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నగరంలో మైనార్టీలకు మొదటి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన మైనార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. ఈసారి ఆ వర్గానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని