logo

రూ.707 కోట్ల నష్టాలు

రాష్ట్రంలోనే అత్యధిక నష్టాల్లో ఉన్న హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42.23శాతం నష్టాలొచ్చాయి. 1013 మిలియన్‌ యూనిట్లు ‘లాస్‌ యూనిట్లు’గా టీజీఎస్పీడీసీఎల్‌ పేర్కొంది.

Published : 03 Jul 2024 02:07 IST

ఏళ్లు గడుస్తున్నా మారని డిస్కం హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌ తీరు 
42.23శాతం నష్టాలు.. ప్రైవేటే శరణ్యమంటున్న సర్కారు 
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలోనే అత్యధిక నష్టాల్లో ఉన్న హైదరాబాద్‌ సౌత్‌ సర్కిల్‌లో ఏటా నష్టాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 42.23శాతం నష్టాలొచ్చాయి. 1013 మిలియన్‌ యూనిట్లు ‘లాస్‌ యూనిట్లు’గా టీజీఎస్పీడీసీఎల్‌ పేర్కొంది. 101 కోట్ల యూనిట్లు బిల్లింగ్‌లోకి రాలేదు. సగటు యూనిట్‌ ఖర్చు రూ.7 అయితే ఒక్క ఏడాదిలో రూ.707 కోట్లు ఖజానాకు గండిపడింది. దీంతో ఈ సర్కిల్‌ను ప్రైవేటుకు అప్పగించేందుకు సర్కారు సన్నద్ధం అవుతోంది. 

సరఫరా, బిల్లింగ్‌కు తేడా.. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో సౌత్‌ సర్కిల్‌లో 2399.26 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ను డిస్కం సరఫరా చేసింది. నాలుగైదు శాతం వరకు నష్టాలకు అనుమతిస్తారు. కానీ ఇక్కడ ఎన్నోరెట్లు నష్టాలొస్తున్నాయి. పాత లైన్లు, మీటర్‌ ట్యాంపరింగ్, అక్రమ వినియోగం, సిబ్బంది అవినీతి, రాజకీయ జోక్యం కారణాలతో నష్టాల నుంచి గట్టెక్కలేకపోతుంది. ప్రైవేటే శరణ్యమని రేవంత్‌ సర్కారు అదానీ సంస్థతో సంప్రదింపులు చేస్తోంది. 

అత్యధికంగా చార్మినార్‌ డివిజన్‌

పాతబస్తీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ సౌత్‌లో 3 డివిజన్లున్నాయి. చార్మినార్‌ డివిజన్‌లో అధికంగా 51.36 శాతం, ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌లో 37.83, బేగంబజార్‌ డివిజన్‌లో 28.30.. మొత్తంగా సర్కిల్‌లో 42.23శాతం నష్టాల్లో ఉంది. ఒక దశలో ఇక్కడ 37 శాతానికి నష్టాలు తగ్గాయి. కొవిడ్‌ అనంతరం మళ్లీ మొదటికొచ్చింది. అప్పట్లో ఐదున్నర లక్షల వినియోగదారులుంటే ఇప్పుడు ఆ సంఖ్య 7 లక్షలు దాటి నష్టాలు పెరగడం గమనార్హం.


సెంట్రల్‌లోనూ.. : హైదరాబాద్‌ సెంట్రల్‌ సర్కిల్‌లోనూ నష్టాలు అధికంగా ఉన్నాయి. మెహిదీపట్నం డివిజనే దీనికి కారణం అని అధికారులు చెప్పారు. ఇక్కడ 19.05శాతం నష్టాలు ఉన్నాయి. 826.77 మిలియన్‌ యూనిట్లు సరఫరా చేస్తే 669.27 మిలియన్‌ యూనిట్లకే బిల్లింగ్‌ అవుతుంది. దీంతో డిస్కం నష్టాలు 12.29శాతానికి పెరిగాయి. 

ప్రభుత్వం అండగా ఉంటే..

ప్రైవేటుకు ఇచ్చినా రాజకీయ జోక్యం లేకుండా ఉండాలంటే సర్కారు అండ తప్పనిసరని అధికారులంటున్నారు. ప్రభుత్వం మద్దతు ఇస్తే ఏడాదిలోనే హైదరాబాద్‌ సౌత్‌లో గణనీయమైన నష్టాలు తగ్గించి చూపిస్తామంటున్నారు. అప్పటికీ మారకుంటే సర్కారు ఇష్టం అంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని