logo

భయపడితే.. ఖాతాలో సొమ్మంతా మాయమే

‘‘మేం ఫెడెక్స్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇవేనా..! మీ ఖాతాల నుంచి రూ.లక్షల్లో అక్రమ లావాదేవీలు జరిగాయి.

Published : 03 Jul 2024 08:49 IST

పార్సిల్‌ పేరిట సైబర్‌ నేరస్థుల దొంగాట

‘‘మేం ఫెడెక్స్‌ నుంచి మాట్లాడుతున్నాం. మీ ఆధార్‌ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్లు ఇవేనా..! మీ ఖాతాల నుంచి రూ.లక్షల్లో అక్రమ లావాదేవీలు జరిగాయి. మీ పేరుతో వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని హౌస్‌అరెస్ట్‌ చేస్తున్నాం. మీ ఫోన్‌పై కూడా నిఘా ఉంది. మీ బ్యాంకు మేనేజర్‌ కూడా తప్పిదంలో భాగమని గుర్తించాం. ఈ విషయంలో ఎవరితో చెప్పినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.’’ సైబర్‌ నేరగాళ్ల బెదిరింపు కాల్‌ ఇదీ...!

ఈనాడు, హైదరాబాద్‌: సామాన్యుడి నుంచి సంపన్నుల వరకు అకస్మాత్తుగా వస్తున్న ఈ తరహా బెదిరింపు ఫోన్‌కాల్స్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజానిజాలు గుర్తించే లోపే ఖాతాల్లోని సొమ్మంతా ఖాళీ చేస్తున్నారు. సైబర్‌ నేరస్థులు ఏటేటా కొత్త తరహా ఎత్తులతో మోసాలకు తెగబడుతున్నారు. ఈ ఏడాది ఫెడెక్స్‌ కొరియర్‌ సంస్థ పేరు వాడుకొని విదేశాల నుంచి డ్రగ్స్, నల్లధనం, ఆయుధాలు వచ్చాయని బెదిరిస్తూ అందినంత దండు కుంటున్నారు. విదేశాల్లో ఏసీ గదుల్లో కూర్చొని దర్జాగా దోచుకుంటున్న ఈ కేటుగాళ్ల మాటలకు బెదరకుండా.. లైట్‌గా తీసుకోవటమే అసలైన మార్గమని టీజీ సైబర్‌క్రైమ్‌ బ్యూరో పోలీసులు సూచిస్తున్నారు.
వీళ్ల మోసాలకు ఉందోలెక్క: రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 177 రోజుల్లో 592మంది నుంచి రూ.44,25,93,497 కొట్టేశారంటే మాయగాళ్లు ఎంతగా తెగించారో అర్ధమవుతోంది. 

  • జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తికి ఫెడెక్స్‌ నుంచి ఫోన్‌కాల్‌. సీబీఐ, ఈడీ పేర్లు చెప్పి ఇల్లు కదలనీయకుండా చేశారు. రోజుల వ్యవధిలో బాధితుడి నుంచి రూ.3.5కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. అతడు మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగానే రూ.40లక్షల సొమ్ము ఫ్రీజ్‌ చేయగలిగారు. 
  • బాధితులు ముందుగానే పోలీసులను ఆశ్రయిస్తే పూర్తిసొమ్ము రికవరీ చేయవచ్చంటున్నారు.
  • కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఫెడెక్స్‌ సైబర్‌నేరాలకు సూత్రధారులు చైనీయులు. వివిధ దేశాలకు చెందిన యువతను టెలీకాలర్స్‌గా నియమించుకొని దందా సాగిస్తున్నారు. గతంలో సైబర్‌ నేరస్థులు తమ చేతికి అందిన మొబైల్‌ నంబర్ల ఆధారంగా ఫోన్‌ చేసేవారు. అక్కడ సరైన గిట్టుబాటు లేదనే ఉద్దేశంతో రూటు మార్చారు. డార్క్‌వెబ్‌సైట్, డేటా చోరులనుంచి అడ్డదారిలో ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాల వివరాలను ఈముఠాలు కొనుగోలు చేస్తున్నాయి. బ్యాంకులో రూ.10-25లక్షలు నగదు నిల్వలున్న ఖాతాదారులను గుర్తించి వారికే పార్సిల్‌ పేరిట ఫోన్‌కాల్స్‌ చేస్తున్నారు. వీరిలో అధికశాతం మందికి సైబర్‌ నేరాలపై అవగాహన లేక, కేంద్ర దర్యాప్తు సంస్థల పేర్లు వినగానే వణకిపోతున్నారు. సమాజంలో తమ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయనే భయపడుతున్నారు. ఈ కేసుల్లో కుటుంబసభ్యుల పేర్లు కూడా చేర్చుతామనడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలనే ఆందోళనలో అడిగినంత సొమ్ము జమచేసి ఊపిరిపీల్చుకుంటున్నారు. 

అసలెందుకు భయపడుతున్నారంటే..: అట్నుంచి చెబుతున్న ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకుఖాతా వివరాలు వాస్తవమే. తమ ఇంటి చిరునామా, కుటుంబసభ్యులు, బ్యాంకు లావాదేవీలు సరిపోతున్నాయి. ఫోన్‌కాల్‌ రాగానే బాధితుల అంతర్మథనం మోసగాళ్లకు అనువుగా మారుతోంది. వీడియోకాల్‌ ద్వారా తాము సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీ, కస్టమ్స్‌ కార్యాలయాల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తున్నారు. కార్యాలయాల గోడలపై కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలు, యూనిఫామ్‌ ధరించిన టెలీకాలర్స్‌ కనిపించటంతో బాధితులే తేలికగా బుట్టలో పడుతున్నారు. విచారణ పూర్తయేంత వరకూ ఇల్లు కదలకూడదని ‘డిజిటల్‌ అరెస్ట్‌’ చేసినట్టు అయోమయానికి గురిచేస్తున్నారు. పోలీస్, బ్యాంకు, బయటి వ్యక్తులకు ఫోన్‌ చేయాలన్నా తమ అనుమతి ఉండాలని నిబంధన విధిస్తున్నారు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే  కుటుంబాన్ని అరెస్ట్‌ చేసి దిల్లీ/ముంబయి జైళ్లలో వేస్తామని బలహీనతపై దెబ్బకొడుతున్నారు. దీన్నుంచి బయటపడేందుకు సహకరిస్తామంటూ వేర్వేరు విభాగాల అధికారుల పేరిట ఫోన్లు చేసి తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేయించుకుంటున్నారు.


కంగారుపడొద్దు.. గంటలోపు ఫిర్యాదు చేయండి

- కె.వి.ఎం.ప్రసాద్, డీఎస్పీ, టీజీ సైబర్‌సెక్యూరిటీ బ్యూరో

మనీ లాండరింగ్, డ్రగ్స్‌ వచ్చాయని ఫోన్‌కాల్‌ రాగానే కంగారుపడొద్దు. గుర్తుతెలియని వ్యక్తులు/సంస్థల పేర్లతో వచ్చే ఫోన్లకు స్పందించవద్దు. టెలీకాలర్స్‌ చెబుతున్న వివరాలన్నీ ఖచ్చితంగా ఉన్నట్టు భావించినా భయాందోళనకు గురికావొద్దు. వీడియోకాల్‌లో అటువైపు కనిపించే కేంద్ర దర్యాప్తు సంస్థల లోగోలన్నీ నకిలీవే. ముఖం కనిపించకుండా పోలీసు, సీబీఐ అధికారిగా మాట్లాడేది మోసగాళ్లని గ్రహించాలి. మీకు వచ్చే అపరిచితుల ఫోన్‌కాల్స్, సందేశాలు, లింకులను పట్టించుకోవద్దు. బాధితులు చాలావరకూ ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. మోసపోయినట్టు గుర్తించగానే గంటలోపు(గోల్డెన్‌ అవర్‌) పోలీసులకు/1930 నంబర్‌కు ఫిర్యాదు చేయండి.  ఈ ఏడాది ఇప్పటి వరకూ ఫెడెక్స్‌ మోసాల్లో పోగొట్టుకున్న రూ.44,25,93,497 సొత్తులో రూ. 8,70.53,766 ఫ్రీజ్‌ చేశాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని