logo

పత్రాలు సృష్టించి.. దర్జాగా విక్రయించి

నగరంలో ఐటీ కారిడార్‌ సర్కారు భూములపై కన్నేసిన అక్రమార్కులు పహాణీ, ఆర్‌.ఒ.ఆర్‌. రికార్డుల్లో స్వల్ప లోపాలను గుర్తించి వాటిని ప్రైవేటు భూములుగా చిత్రీకరించి మార్కెట్‌ ధరల కంటే తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.

Updated : 03 Jul 2024 02:15 IST

గుడ్డిగా రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారులు
కోకాపేట్‌లో రెండెకరాల సర్కారు భూమి అమ్మకం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఐటీ కారిడార్‌ సర్కారు భూములపై కన్నేసిన అక్రమార్కులు పహాణీ, ఆర్‌.ఒ.ఆర్‌. రికార్డుల్లో స్వల్ప లోపాలను గుర్తించి వాటిని ప్రైవేటు భూములుగా చిత్రీకరించి మార్కెట్‌ ధరల కంటే తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. గచ్చిబౌలి, రాయదుర్గం, ఖాజాగూడ, కోకాపేట్, పుప్పాలగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్, గౌలిదొడ్డి, నార్సింగి ప్రాంతాల్లోని ప్రైవేటు పట్టా భూములకు సమీపంలోని ప్రభుత్వ భూముల వివరాలను తెలుసుకుని వాటికి అటూ, ఇటూ సర్వే నంబర్లను జోడించి తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ధరణి పోర్టల్‌ అందుబాటులోకి రాకముందే ఇలా వందల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు విక్రయించారు. ఈ క్రమంలోనే కోకాపేట్‌లో రూ.100కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. కొన్న వ్యక్తి విక్రయించేందుకు ప్రయత్నించగా, ధరణి పోర్టల్‌లో అవి ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. 

రియల్‌బూమ్‌ను ఊహించి.. మణికొండలో ఐటీ కారిడార్‌ వృద్ధితో కోకాపేట్‌లో రియల్‌బూమ్‌ను ముందే ఊహించిన కొందరు ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వ భూముల వివరాలు సేకరించారు కోకాపేట్‌ సర్వేనం.117లో 8 ఎకరాల ప్రభుత్వ భూమి, 116లో ప్రైవేటు పట్టా భూమి ఉందని తెలుసుకున్నారు. వెంటనే ఆ భూముల్లో రైతులున్నట్లు పత్రాలు సృష్టించారు. తొలుత రెండెకరాలను ఓ రియల్‌ వ్యాపారికి 2016లో విక్రయించారు.


ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా.. 

రెండెకరాల సర్కారు భూమిని విక్రయించినప్పుడు రెవెన్యూ అధికారులకు అనుమానం వస్తుందన్న భావనతో అక్రమార్కులు ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ను ఎంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 నుంచి 2014వరకూ ప్రైవేటు భూములు, ఇళ్లను సంబంధిత రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కాకుండా ఏపీలో ఎక్కడైనా క్రయవిక్రయాలు నిర్వహించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2017వరకూ ఈ విధానం కొనసాగింది. కోకాపేట్‌లో భూములను నార్సింగిలో కాకుండా..  మూసాపేట్‌లోని కూకట్‌పల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో జూన్‌ 23, 2016న రిజిస్ట్రేషన్‌ చేయించారు. అప్పట్లోనే ఎకరా రూ.50 కోట్లుండగా.. రెండు ఎకరాలను రూ.10కోట్లకే విక్రయించినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ భూముల విక్రయంపై గండిపేట తహసీల్దార్‌ ఎన్‌.శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా... సర్వేనంబర్‌ 117 ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్‌ ఎలా జరిగిందన్న అంశంపై విచారణ చేస్తామని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని