ఆరుపలకల దేహం.. స్టెరాయిడ్స్‌తో ఆగమాగం!

అందమైన దేహం.. ఆకట్టుకునే రూపం ఆతృతలో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. యువకుల ఆసక్తిని అవకాశంగా కొన్ని జిమ్‌ సెంటర్లు స్టెరాయిడ్స్‌ను అలవాటు చేస్తున్నాయి.

Published : 03 Jul 2024 04:07 IST

కండల యావలో యువత తప్పటడుగులు
నగరంలో 20 జిమ్‌ సెంటర్ల మాయాజాలం
ఈనాడు, హైదరాబాద్‌

  • మెహిదీపట్నంలో గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న కుర్రాడు. నచ్చిన హీరో మాదిరి దేహదారుఢ్యం పెంచాలనుకున్నాడు. అరగంట కసరత్తులకే అలసిపోవటంతో కోచ్‌ సూచనతో ఇంజక్షన్‌ తీసుకొని రెండు గంటలు శ్రమించేంత సామర్థ్యం సొంతం చేసుకున్నాడు. 5 నెలల్లో పొట్ట కరిగింది. కండలతో ఆకర్షణీయంగా మారాడు. ఒకరోజు తరగతి గదిలో అకస్మాత్తుగా కిందపడిపోవటంతో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యపరీక్షల్లో అతడి కిడ్నీపనితీరు మందగించినట్టు గుర్తించారు. సకాలంలో చికిత్స అందించటంతో బయటపడ్డాడు. 
  • బంజారాహిల్స్‌కు చెందిన మధ్యవయస్కురాలు అధికబరువు సమస్య నుంచి బయటపడేందుకు జిమ్‌లో చేరారు. అక్కడి శిక్షకుడు ఇచ్చిన పౌడర్‌తో ఉత్సాహంగా మారారు. తరువాత చీకటికోణం వెలుగుచూసింది. ఆమెకు తెలియకుండానే ఎండీఎంఏ తీసుకున్నట్టు తేలింది. విషయం బయటపడితే వ్యాయామ శిక్షణ కేంద్రం పరువు పోతుందని నిర్వాహకులు కాళ్లావేళ్లా పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వదిలేశారు. 

అందమైన దేహం.. ఆకట్టుకునే రూపం ఆతృతలో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. యువకుల ఆసక్తిని అవకాశంగా కొన్ని జిమ్‌ సెంటర్లు స్టెరాయిడ్స్‌ను అలవాటు చేస్తున్నాయి. అడ్డు చెప్పాల్సిన కోచ్‌లు కమీషన్‌పై ఆశతో తలలూపుతున్నారు. ఇటీవల చాంద్రాయణగుట్ట, ఆసిఫ్‌నగర్, మెహిదీపట్నం పరిధిలో పోలీసులు నిషేధిత ఇంజక్షన్లు, మాత్రలు విక్రయిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేశారు. వారి నుంచి రాబట్టిన సమాచారంతో తాజాగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హార్మోన్ల సమస్య, అధికరక్తపోటు, నొప్పుల నివారణకు వాడే కొన్ని స్టెరాయిడ్స్‌ను ఇంజక్షన్ల రూపంలో విక్రయిస్తున్నట్టు అంగీకరించాడు. నగరంలో 20కు పైగా జిమ్‌ సెంటర్లకు వాటిని సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ఇంజక్షన్లు నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ జాబితాలోకి రాకపోవటంతో నిందితులను డ్రగ్‌ కంట్రోలర్‌ అధికారులకు అప్పగించారు. అధికశాతం బాధితుల్లో 18-30 ఏళ్లలోపు యువకులే ఉంటారని ఆందోళన వెలిబుచ్చారు. 


కసరత్తు.. మత్తుతో కనికట్టు

మారిన జీవనశైలితో ఊబకాయం సమస్యగా మారింది. సహచరులు, కుటుంబసభ్యుల విమర్శలు భరించలేక చాలామంది వేడుకలకు దూరమవుతున్నారు. ఇంతటి మనోవేదనకు కారణమవుతున్న ‘లావు’ను తగ్గించేందుకు సామాజిక మాధ్యమాల్లో కనిపించిన చిట్కాలు పాటించి ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రత్యేకంగా కనిపించేందుకు కుర్రాళ్లు జిమ్‌ల వైపు కదులుతున్నారు. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపంతో ఎక్కువమంది 20-30 నిమిషాలకే అలసిపోతున్నారని బంజారాహిల్స్‌కు చెందిన జిమ్‌ కోచ్‌ ఒకరు తెలిపారు. 2-3 గంటల వరకూ వ్యాయామాలు చేసేందుకు కొందరు కోచ్‌లు స్టెరాయిడ్స్‌ను సిఫార్సు చేస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్‌ రూ.1500-2500 వరకూ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కండలు పెంచాలనే వ్యామోహంతో స్టెరాయిడ్స్‌ తీసుకుంటే.. కాలేయం దెబ్బతింటుంది. గుండెపనితీరు మందగిస్తుంది. అధికరక్తపోటుతో కిడ్నీ ఫెయిల్యూర్, జుట్టు ఊడిపోవటం, రోగనిరోధకశక్తిని పూర్తిగా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని