logo

మూడు రోజుల్లో ఇవ్వకపోతే ఎలా?

కొత్త నేర న్యాయ చట్టాల్లో ఫిర్యాదు చేసే విధానం మరింత సరళీకృతం చేసినా.. పోలీసులకు కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి.

Published : 03 Jul 2024 01:52 IST

రాతపూర్వక ఫిర్యాదుపై స్పష్టత ఏదీ?

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త నేర న్యాయ చట్టాల్లో ఫిర్యాదు చేసే విధానం మరింత సరళీకృతం చేసినా.. పోలీసులకు కొన్ని సవాళ్లు ఎదురు కానున్నాయి. ఎలక్ట్రానిక్‌ విధానంలో పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఆ తర్వాత స్టేషన్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వకపోతే ఏం చేయాలన్న దానిపై కొత్త చట్టంలో కొంతమేర స్పష్టత లేకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. చట్టాలు ఇప్పుడే అమల్లోకి వచ్చినందున కేసుల నమోదు, దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లనుబట్టి ముందుకెళ్తామంటున్నారు. 

కొత్త చట్టంలో ఫిర్యాదు విధానం

బీఎన్‌ఎస్‌ఎస్‌ (భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత) 173(2) సెక్షన్‌ ప్రకారం ఏదైనా ఘటన, అన్యాయంపై ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ (ఎస్‌ఎంఎస్, వాట్సాప్, మెయిల్‌) ద్వారా ఠాణా, ఎస్‌హెచ్‌వోకు సమాచారం పంపొచ్చు. దీనిపై బాధితుడు/సమాచారం ఇచ్చిన వ్యక్తి 3 రోజుల్లోపు రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని చట్టం చెబుతోంది. పోలీసులు ఇప్పటికే దీన్ని పాటిస్తున్నారు. అపహరణ, అత్యాచారం, దాడులు తదితర తీవ్ర నేరాల్లో సమాచారం ఎలా వచ్చినా ఘటనా స్థలికి వెళ్తున్నారు.   

సమస్య అప్పుడే..

ఎలక్ట్రానిక్‌ విధానంలో తొలుత సమాచారం ఇచ్చి ఆ తర్వాత రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వకపోతే ఏం చేయాలనేదానిపై బీఎన్‌ఎస్‌ఎస్‌ 173లో సెక్షన్‌లో స్పష్టత లేదు. కొన్నిరకాల నేరాల విషయంలో బాధితులు ఫిర్యాదుకు ముందుకు రాకపోతే సమస్య వచ్చే అవకాశముందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని నేరాల్లో ఈ సవాలు ఎదురవుతోంది. కొందరు తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ తర్వాత అవతలి వ్యక్తులు తెలిసినవారు, సన్నిహితులు, సహోద్యోగులు కావడం లేదా పోలీస్‌స్టేషన్‌ వెళితే పరువు పోతుందనో, భయం ఇతర కారణాలతో రాతపూర్వక ఫిర్యాదు ఇవ్వరు. పోలీసులు సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రారు. ఫోన్లు ఆపేస్తారు. ముఖ్యంగా షీ టీమ్స్‌కు వచ్చే ఫిర్యాదులో ఇలాంటి ఉదంతాలు ఎక్కువగా ఉంటాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని