logo

Union Bank: ఖాతాదారు డబ్బు మాయం... యూనియన్‌ బ్యాంకుకు జరిమానా

ఖాతాదారుడికి అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యూనియన్‌ బ్యాంకుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది.

Updated : 03 Jul 2024 08:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖాతాదారుడికి అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన యూనియన్‌ బ్యాంకుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. ఖాతాదారు పోగొట్టుకున్న రూ.15,000, 9శాతం వడ్డీతో చెల్లించడంతో పాటు రూ.5వేలు పరిహారం, రూ.2వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. షేక్‌పేట్‌కు చెందిన కె.శోభారాణి టోలిచౌకిలోని యూనియన్‌బ్యాంకులో ఖాతాదారు. అప్పటివరకు పొదుపు చేసుకున్న రూ.40వేలు బ్యాంకులో వేయాలని సన్నిహితుడైన రెండోఫిర్యాదీ శ్రీనివాసులుకు చెప్పారు. దీంతో 2018 జులై 14న ఖాతాలో జమచేశారు. జులై 16న మరోరూ.40వేలు టోలిచౌకిలోని బ్యాంకు డిపాజిట్‌ మెషీన్‌లో వేసేందుకు వెళ్లారు. ట్రాన్సాక్షన్‌ స్లిప్‌ తీసుకోగా ఖాతాలోంచి రూ.15వేలు విత్‌డ్రా అయినట్టు తెలిసి శ్రీనివాసులు షాక్‌అయ్యారు. అనంతరం ఫిర్యాదీకీ వివరాలు తెలపగా వెంటనే సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సీసీ ఫుటేజీ కోసం బ్యాంకును సంప్రదించగా వాటికి బదులు గుర్తుపట్టని విధంగా ఉన్న చిత్రాలను అందించారు. వీటితో విచారణ చేయలేమని పోలీసులు చేతులెత్తేయడంతో కమిషన్‌ను ఆశ్రయించారు. నగదు ఉపసంహరణ ఏటీఎం నుంచే జరిగిందని అందుకు ఫిర్యాదీయే పూర్తి బాధ్యత వహించాలని బ్యాంకు తెలిపింది. నగదు లావాదేవీలపై ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో బ్యాంకు విఫలమైందని పేర్కొన్న కమిషన్‌ తీర్పు వెలువరించింది.

శ్వేత కంప్యూటర్స్‌కు..

నాసిరకం బ్యాటరీ విక్రయించిన శ్వేత కంప్యూటర్స్‌కి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ జరిమానా విధించింది. రూ.5వేలు పరిహారం, రూ.5వేలు కేసు ఖర్చులు, బ్యాటరీకి చెల్లించిన రూ.4,130 వడ్డీతో సహా రీఫండ్‌ చేయాలని ఆదేశించింది. ఏఎస్‌రావునగర్‌కు చెందిన కె.రాజేంద్రకుమార్‌ సికింద్రాబాద్‌లోని ప్రతివాద సంస్థలో 2023 ఫిబ్రవరిలో హెచ్‌పీ మోడల్‌ ల్యాప్‌ట్యాప్‌ బ్యాటరీ కొన్నారు. ఐదునెలల తర్వాత బ్యాటరీ ఉబ్బిపోయి పనిచేయకపోవడంతో ప్రతివాద సంస్థను సంప్రదించారు. వారంటీ వర్తించదని ఆ సంస్థ తిరస్కరించింది. జులై 29న ఇ-దాఖిల్‌లో వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదుచేశారు. విచారించిన కమిషన్‌ తీర్పునిస్తూ అమలుకు 45 రోజుల గడువు విధించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని