logo

ఆడుకుంటూ రైలెక్కి.. ఆపదలో చిక్కుకుని

ఎటువెళ్తున్నారో తెలియకుండానే ఆడుకుంటూ రైలెక్కిన చిన్నారులు.. గమ్యం తెలియక మరో స్టేషన్‌లో దిగి బయటకు వెళ్తుండగా ఓ ఆటో డ్రైవర్‌ వారిని అపహరించడానికి యత్నించగా ట్రాఫిక్‌ పోలీసులు రక్షించారు.

Updated : 03 Jul 2024 05:07 IST

ఓ ఆటోడ్రైవర్‌ అపహరణకు యత్నించగా రక్షించిన ట్రాఫిక్‌ పోలీసులు

కాటేదాన్, న్యూస్‌టుడే: ఎటువెళ్తున్నారో తెలియకుండానే ఆడుకుంటూ రైలెక్కిన చిన్నారులు.. గమ్యం తెలియక మరో స్టేషన్‌లో దిగి బయటకు వెళ్తుండగా ఓ ఆటో డ్రైవర్‌ వారిని అపహరించడానికి యత్నించగా ట్రాఫిక్‌ పోలీసులు రక్షించారు. ఈ సంఘటన మంగళవారం మైలార్‌దేవుపల్లి డివిజన్‌లో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ బిల్లా కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... కార్తిక్‌(6), అఖిల్‌(4) ఇద్దరు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు బుద్వేల్‌ రైల్వేస్టేషన్‌లో శంషాబాద్‌ (ఉందానగర్‌)మీదుగా వచ్చే రైలునుంచి దిగారు. దారి తెలియని చిన్నారులు బయటకు వచ్చి కాలినడకన ఆరాంఘర్‌ చౌరస్తా దాటుతున్నారు. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఠాణా సమీపంలోకి రాగా ఓ ఆటోవాలా వారిని వెంబడిస్తూ అపహరించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు యాదయ్య, వెంకట్‌రెడ్డి, శివలు గుర్తించి అప్రమత్తమయ్యే లోపే పరారయ్యాడు. వెంటనే ఇద్దరు చిన్నారులను చేరదీసి విచారించగా సరైన సమాధానం చెప్పలేదు. పెద్దబ్బాయి శంషాబాద్‌ నుంచి వచ్చినట్లు చెప్పడంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. ఇంతలో తమ పిల్లలు ఎక్కడికెళ్లారోనని గాలిస్తున్న శంషాబాద్‌ శివారున గుడిసెలో నివసించే మాతృమూర్తి శైలజ సమాచారం అందుకుని రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులను ఆశ్రయించింది. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆమెకు కౌన్సిలింగ్‌ చేసి పిల్లలను అప్పగించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని