logo

ఉద్యోగంలోకి తీసుకోండి సారూ..!

అనుకోకుండా చేసిన తప్పులతో తమను ఉద్యోగాలనుంచే తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, క్షమించి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆర్టీసీలో సస్పెండైన కార్మికులు ప్రజాభవన్‌లో విజ్ఞప్తిచేశారు.

Updated : 03 Jul 2024 05:34 IST

సస్పెండైన ఆర్టీసీ కార్మికుల వినతి.. 

సోమాజిగూడ, న్యూస్‌టుడే: అనుకోకుండా చేసిన తప్పులతో తమను ఉద్యోగాలనుంచే తొలగించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, క్షమించి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆర్టీసీలో సస్పెండైన కార్మికులు ప్రజాభవన్‌లో విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే పలు పర్యాయాలు విన్నవించిన కార్మికులు మంగళవారం మరోసారి చేరుకుని ప్రజాభవన్‌ ఆవరణలో బైఠాయించారు. మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి,  ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సస్పెండైన ఆర్టీసీ కార్మికుల విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

  • రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సిఉన్నా, జిల్లాల్లో రూ.16వేలు, హైదరాబాద్‌లో రూ.18వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు వినతిపత్రం అందజేశారు. నగరంతో పాటు జిల్లాల్లోనూ ప్రతి కార్మికునికి రూ.26వేలు వేతనంగా నిర్ణయించాలన్నారు. 
  • ఐదుగురు అన్నదమ్ములు, తల్లి.. అందరూ చనిపోయినట్లు తహసీల్దార్‌ నుంచి ధ్రువపత్రం తీసుకుని 6.20ఎకరాలు అమ్ముకున్నారని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం పల్లెగూడెంవాసి బస్వారెడ్డి ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేశారు. 2007లో జరిగిన ఈ ఘటనలో అప్పటి తహసీల్దార్‌తో పాటు బిల్డర్, స్థానిక నాయకుడి హస్తం ఉందని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని భూమిని అప్పగించాలని ఆయన అధికారులను కోరారు. ప్రజావాణికి మొత్తం 601 అర్జీలు అందగా రెవెన్యూ-142,  పౌరసరఫరాల శాఖ- 87, మున్సిపల్‌ - 53, హోంశాఖ - 47,  పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి - 52, ఇతర శాఖలకు -220 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని