logo

బంగరు బాల్యం.. భవిత భద్రం

బాల్యం ఎంతో విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తెలియని తనం, కోపం తదితర కారణాలతో కొందరు పిల్లలు ఇంటినుంచి వెళ్లిపోతున్నారు. తిరిగి వద్దామన్నా సరైన అవగాహన లేక ఎక్కడో ఓ చోట పని చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.

Published : 03 Jul 2024 01:41 IST

తప్పిపోయిన పిల్లల రక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌
న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి

బాల్యం ఎంతో విలువైంది. వీరిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తెలియని తనం, కోపం తదితర కారణాలతో కొందరు పిల్లలు ఇంటినుంచి వెళ్లిపోతున్నారు. తిరిగి వద్దామన్నా సరైన అవగాహన లేక ఎక్కడో ఓ చోట పని చేసుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పిల్లలను గుర్తించి వీరిని తల్లిదండ్రులకు అప్పగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈనెల 1న ప్రారంభించగా 31 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు..

తప్పిపోయిన 6 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తించి వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని సుప్రీంకోర్టు 2016లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఏటా జులై నెలలో ఆపరేషన్‌ ముస్కాన్, జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌ను రెండు నెలలపాటు నిర్వహిస్తున్నారు. బాలల కోసం పోలీసు శాఖ, బాల రక్షా కమిటీ, చైల్డ్‌ లైన్‌ కమిటీ, బాలల పరిరక్షణ విభాగం, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి.  

వసతి గృహాల్లో 120 మంది ఆశ్రయం

బాలల కోసం ప్రత్యేకంగా జిల్లాలో 4 వసతి గృహాలున్నాయి. వికారాబాద్‌ ఎన్నెపల్లిలో బాలికలకు, ధన్నారంలో బాలలకు ఉన్నాయి. మోమిన్‌పేటలో హెల్ప్‌ ఆల్‌ సొసైటీ ఉంది. పరిగిలో ప్రత్యేకంగా బాలికలకు బాల సదనం, వికారాబాద్‌లో శిశుగృహ ఉంది. అన్ని కేంద్రాల్లో కలిపి సుమారుగా 120 మంది ఆశ్రయం పొందుతున్నారు. 


మూడు బృందాలతో ప్రత్యేక తనిఖీలు

జిల్లాలో తనిఖీలు నిర్వహించటానికి మూడు బృందాలు ఏర్పాటు చేశారు. వీటిలోని సభ్యులు అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తారు. పిల్లలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. బడిఈడు పిల్లల్ని బడుల్లో చేర్పిస్తారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, పరిశ్రమలు, దుకాణాలు, హోటళ్లపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు. 

బాలల రక్షణ కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించారు. దీన్లో స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్, ఏఎస్‌ఐ, కానిస్టేబుళ్లు, కార్మిక, రెవెన్యూ శాఖాధికారులు, సభ్యులుగా ఉంటారు. దొరికిన పిల్లల్ని 24 గంటల్లో జిల్లాలోని చైల్డ్‌లైన్‌ 1098కు అప్పగిస్తారు.  


శాఖల సమన్వయంతో తనిఖీల నిర్వహణ

- వెంకటేశం, ఛైర్మన్, బాలల సంక్షేమ కమిటీ, వికారాబాద్‌

జిల్లా సంక్షేమ అధికారి నేతృత్వంలో అన్ని శాఖల యంత్రాగం సమన్వయంతో తనిఖీలు చేపడుతున్నాం. గత సంవత్సరం జిల్లాకు చెందిన 40 మంది పిల్లలు తప్పిపోయారు. వీరిని గుర్తించారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం.  


పనిలో చేర్చుకుంటే చట్టపరంగా చర్యలు 

- ధనసిరి ప్రకాశ్, బాలల సంక్షేమ కమిటీ సభ్యుడు, వికారాబాద్‌

బాలలు తమ బాల్యాన్ని బడిలోనే గడిపే విధంగా చూడాలి. బాలలతో పనులు చేయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. పిల్లల్ని పోషించలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులు బాల రక్షా కమిటీ కార్యాలయాన్ని సంప్రదించి తగిన సలహాలను, సూచనలు పొందవచ్చు. పిల్లల చదువులకు అండగా ఉంటాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు