logo

ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్‌ఎంసీ అధికారులు!

రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి.

Updated : 02 Jul 2024 07:38 IST

ఇంకా సమస్యలపై దృష్టి సారించని కొత్త కమిషనర్‌
క్షేత్రస్థాయిలో కనిపించని జోనల్‌ కమిషనర్లు
పారిశుద్ధ్యం, వ్యాధులతో అల్లాడుతున్న ప్రజలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వేలాది మంది రోగాల భారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు వర్షాకాలం మొదలవడంతో నగర రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. వర్షాకాలానికే ముందు నాలాల్లో పూడికతీత పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి కొనసాగుతున్నాయి. నగరంలో చేపట్టిన ఆయా ప్రాజెక్టుల నిర్మాణం పనులు దాదాపు నిలిచిపోయాయి. నలుదిక్కులా సమస్యలు చుట్టుముట్టి ప్రజలు అల్లాడుతుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి ఇప్పటి వరకు సమీక్షలు మొదలు పెట్టలేదు. జోనల్‌ స్థాయి అధికారులంతా కార్యాలయాల బాట పట్టడం లేదు. మహానగరంలో పాలన గాడి తప్పడంతో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే..?

వర్షాకాలం కావడంతో పారిశుద్ధ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ విభాగానికి పూర్తిస్థాయిలో అదనపు కమిషనర్‌ను నియమించలేదు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారు లేక.. కార్మికులు సక్రమంగా పనిచేయడం లేదు. కాలనీల్లో  చెత్త పేరుకుపోతుంది. ఫాగింగ్‌ జరగడం లేదు.  

  • వారం కిందట ఆమ్రపాలిని బల్దియా కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.  వర్షాల నేపథ్యంలో తక్షణం యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన కొత్త కమిషనర్‌ ఆ దిశగా దృష్టి సారించడం లేదు. ఇప్పటివరకు కనీసం అధికారులతో సమీక్ష చేయలేదు. సోమవారం జరిగిన ప్రజావాణిలో పాల్గొంటారని అంతా అనుకున్నారు. దీన్ని ఆమె అసలు పట్టించుకోలేదు. తన కార్యాలయంలో రెండు గంటలు ఉండి.. బయట సమావేశాల పేరు ఆమె వెళ్లిపోతున్నారు. ఆమ్రపాలి ప్రస్తుతం హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌తోపాటు మూసీ అభివృద్ధి సంస్థ ఎండీ, గ్రోత్‌కారిడార్‌ ఎండీగా కూడా ఉన్నారు. దీంతో పూర్తిస్థాయిలో బల్దియాపై దృష్టిపెట్టలేక పోతున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
  • బల్దియా పరిధిలో ఆరుగురు జోనల్‌ కమిషనర్లు ఉన్నారు. ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేర్‌లింగంపల్లి, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్లను కొత్తగా నియమించారు. నిబంధనల ప్రకారం నిత్యం ఉదయమే వీరంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పారిశుద్ధ్యం ఇతరత్రా విభాగాల పనితీరును పరిశీలించాలి. చాలామంది జోనల్‌ కమిషనర్లు కదలడం లేదు. కనీసం కార్యాలయాలకు కూడా సమయానికి రావడం లేదు. ఉద్యోగులూ వారినే అనుకరిస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.

పరిష్కారం దిశగా చర్యలేవీ?

జీహెచ్‌ఎంసీలో చెత్త తరలింపే కీలకమైన పని. రవాణా విభాగానికి ఇప్పుడు అదనపు కమిషనర్‌ లేరు. జీహెచ్‌ఎంసీలోని ఈవీడీఎం (ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం బల్దియా నుంచి వేరు చేయాలని నిర్ణయించగా, గతంలో ఈవీడీఎం డైరెక్టర్‌ వద్దనున్న రవాణా, ప్రకటనల విభాగాల అదనపు కమిషనర్‌ పోస్టుపై స్పష్టత కొరవడింది. కవాడిగూడ, మలక్‌పేట, ఖైరతాబాద్‌ డిపోలు కేంద్రంగా రోజూ వందలాది డీజిల్‌ కూపన్లను అక్కడున్న అధికారులు దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నకిలీ ప్రకటనల బోర్డులను ప్రోత్సహిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తుండగా, ఉదయాన్నే డంపింగ్‌యార్డుకు తరలాల్సిన వ్యర్థాలు రోజంతా రోడ్లపైనే ఉంటుండటంతో ఆయా విభాగాలను సమీక్షించాల్సిన అవశ్యకత కనిపిస్తోంది. అయితే.. కమిషనర్‌ కార్యాలయం ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని