ఒక్క సందేశంతో ఫిర్యాదు

కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్‌ఐఆర్‌ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి..

Updated : 02 Jul 2024 05:03 IST

ఫిర్యాదుదారుకు దర్యాప్తు పురోగతి చెప్పాల్సిందే
కొత్త నేర న్యాయ చట్టాలతో బాధితులకు ప్రయోజనం

ఈనాడు, హైదరాబాద్‌: కేసు నమోదు చేసినా.. బాధితుల చేతికి ఎఫ్‌ఐఆర్‌ వచ్చేందుకు రోజుల తరబడి ఎదురుచూపులు.. కేసు దర్యాప్తు ఏ స్థితిలో ఉందో.. నిందితుల్ని అరెస్టు చేశారో లేదో తెలియని పరిస్థితి.. ఠాణాకెళ్లి ఫిర్యాదు ఇచ్చినా కేసు నమోదు చేసేందుకు తాత్సారం.. ఇలాంటి జాప్యానికి కొత్త నేర, న్యాయ చట్టాలు పరిష్కారం చూపనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాట్సాప్, ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వెసులుబాటు తీసుకొచ్చాయి. ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అథినీయం (బీఎస్‌ఏ) సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మూడు చట్టాలు ప్రధానంగా బాధితులు ఫిర్యాదు, కేసు సమాచారం విషయంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపేలా ఉన్నాయి. సమాచారం, ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తులకు ప్రయోజనకారిగా ఉండే అంశాలివీ..!

ఫిర్యాదు ఎలాగైనా పంపొచ్చు

  • ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్, సామాజిక మాధ్యమ వేదికలు, వెబ్‌సైట్లు తదితర డిజిటల్‌ రూపంలో బాధితులు ఫిర్యాదు ఇవ్వొచ్చు. పోలీసులు దీన్ని జనరల్‌ డైరీలో నమోదు చేస్తారు. ఆ తర్వాత బాధితుడు/వ్యక్తి మూడురోజుల్లోగా ఠాణాకు వచ్చి ఫిర్యాదు/ సమాచారం ఇస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారు.
  • ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్, సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్‌ విధానంలో పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలంటే ఎస్‌హెచ్‌వో అధికారిక ఈ-మెయిల్, ఫోన్‌ నెంబరుకు పంపడం ఉత్తమం.  
  • అపహరణ/బెదిరింపులులాంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్‌స్టేషన్‌కు రాలేని సందర్భాల్లో ఫోన్‌ చేస్తే సంబంధిత ఠాణా పోలీసులు బాధితుల్ని రక్షించి తగిన సాయం చేయాలి. ఠాణా పరిధి కాకపోతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి
  • ప్రత్యేక పరిస్థితుల్లో ఫిర్యాదుదారు నుంచి సంతకం తీసుకోలేని పరిస్థితి ఉంటే బంధువులు, నేరం గురించి తెలిసిన వ్యక్తి నుంచి తీసుకోవచ్చు.

దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో..

  • కేసు నమోదు చేసిన తర్వాత బాధితులకు/ సమాచారం ఇచ్చిన వ్యక్తికి ఎఫ్‌ఐఆర్‌ ప్రతి ఉచితంగా ఇవ్వాలి. 
  • ఒక కేసు నమోదైన తర్వాత నేర బాధితుడికి 90 రోజుల్లో దర్యాప్తు పురోగతిని అధికారులు డిజిటల్‌ రూపంలో లేదా ఇతర విధానంలోనైనా కచ్చితంగా ఇవ్వాలి. కేసు దర్యాప్తు 90 రోజుల్లో పూర్తవ్వకపోయినా అప్పటి పరిస్థితి ఏంటో తెలియజేయాలి.
  • ఏదైనా కేసులో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయితే ఎలక్ట్రానిక్‌ విధానంలో మెజిస్ట్రేటు దగ్గర దాఖలు చేసిన నివేదిక ప్రతిని బాధితుడు/ సమాచారం ఇచ్చిన వ్యక్తికి కూడా పంపాలి. ఒక కేసులో బాధితులు ఎంతమంది ఉంటే వారందరికీ ఇవ్వాలి.  
  • ఏదైనా ఘటన జరిగినప్పుడు దర్యాప్తు అధికారి బాధ్యులపై ఏం చర్య తీసుకున్నారో సమాచారం ఇచ్చిన వ్యక్తికి కచ్చితంగా తెలియజేయాలి.

ఫిర్యాదు తీసుకోకపోతే..

  • బీఎన్‌ఎస్‌స్‌ సెక్షన్‌ 173 సబ్‌ సెక్షన్‌ ప్రకారం.. పౌరులకు ఒక నేరం/ఘటన గురించి సమాచారం తెలిసినప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారి, ఎస్పీ కేసు రిజిస్టర్‌ చేయనప్పుడు న్యాయమూర్తిని కలిసి చెప్పొచ్చు. ఇందుకు ప్రత్యేక దరఖాస్తు విధానముంది.
  • జీరో ఎఫ్‌ఐఆర్‌ను జాతీయ స్థాయిలో మరింత విస్తృతం చేశారు. ఏ రాష్ట్రంలో ఫిర్యాదు చేసినా సంబంధిత పరిధి ఠాణాకు పంపేలా మార్పులు జరిగాయి.
  • పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తేదీ నుంచి గడువు మొదలవుతుంది.

కొత్త చట్టం బీఎన్‌ఎస్‌ కింద.. కారు దొంగతనం కేసు నమోదు

అంబర్‌పేట, న్యూస్‌టుడే: నూతన చట్టం భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) కింద మొదటి కేసుగా కారు దొంగతనాన్ని అంబర్‌పేట పోలీసులు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ అశోక్, డీఐ మల్లీశ్వరి తెలిపిన వివరాల ప్రకారం... ప్రేంనగర్‌కు చెందిన జంగయ్య రెండు రోజుల క్రితం తన ఇంటి ముందు కారును నిలిపి ఉంచాడు. సోమవారం ఉదయం చూసేసరికి అది కనిపించలేదు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌-303 సెక్షన్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని