logo

సొంతింటి ఆశ.. కేటుగాళ్ల మాయ

సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు.

Updated : 02 Jul 2024 05:05 IST

ప్రీలాంచింగ్‌ ‘రియల్‌’దందా
ఏటా రూ.1000 కోట్లకు పైగా సామాన్యులకు నష్టం

ఆయనో సాధారణ ఉద్యోగి.. కూడబెట్టుకున్న రూ.70లక్షలతో స్థలం కొనుగోలు చేశారు. అవసరానికి ఆ స్థలం విక్రయించే సమయంలో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ జరిగినట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ స్థలం అమ్మిన రియల్‌ సంస్థ చాలామందిని ఇదే తరహాలో మోసం చేసినట్టు నిర్ధారించారు. ఇందులో ఓ సబ్‌రిజిస్ట్రార్‌ ప్రమేయమూ ఉందని తేలింది.

బాచుపల్లి సమీపంలో 10 మంది కలసి స్థలం కొనుగోలు చేశారు. రూ.2కోట్ల  అడ్వాన్స్‌ చెల్లించారు. భూముల ధరలు పెరగటంలో స్థిరాస్తి సంస్థ రిజిస్రేషన్‌ వాయిదా వేస్తూ వచ్చింది. డబ్బు తిరిగి ఇవ్వమంటే మరోచోట స్థలాన్ని చూపారు. వాటి గురించి ఆరా తీస్తే ఆ సర్వేనెంబర్ల పేరుతో భువనగిరిలో భూములున్నట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈనాడు, హైదరాబాద్‌: సకల హంగులతో కార్యాలయాలు.. ఆకట్టుకునేలా బ్రోచర్లు.. వందల కోట్ల ఎకరాల భూములు తమ పరిధిలో ఉన్నాయంటూ ప్రకటనలు. కాస్త పెట్టుబడి పెడితే రాబోయే రెండు మూడేళ్లలో కోటీశ్వరులు కావచ్చంటూ ఉపన్యాసం. ఇంకేముంది.. ఎగువ మధ్యతరగతి కుటుంబాలు తాము దాచుకున్న డబ్బును కుమ్మరిస్తున్నాయి. తీరా తాము మోసపోయినట్టు గుర్తించి.. అసలు సొమ్ములిస్తే చాలంటూ వ్యాపారులు, పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. అప్పటికే రూ.కోట్లు కూడబెట్టిన రియల్‌ కేటుగాళ్లు..  వ్యవస్థలను అనువుగా మలచుకొని దర్జాగా బయట తిరుగుతున్నారు. చట్టాలను బూచిగా చూపుతూ కొన్నిసార్లు పోలీసులు చేతులెత్తేస్తున్నారు. ఉన్నతాధికారులు సివిల్‌ పంచాయితీల్లో చేతులు పెట్టొద్దాన్నారంటూ ఎస్‌హెచ్‌వోలు తప్పించుకుంటున్నారు.

అవగాహనలోపంతో చిక్కి.. భారతి బిల్డర్స్,  జీఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రా, సాహితీ, మిమాంశ, నిఖిత.. వంటి సంస్థలు మోసాల బాగోతంతో పోలీసు రికార్డుల్లోకి ఎక్కాయి. ప్రీలాంఛింగ్‌ ముసుగులో ఈ సంస్థలు వసూలు చేసిన సొమ్మే అక్షరాలా రూ.3,500 కోట్లు. మహానగరం విస్తరిస్తున్న ప్రాంతాల్లో వీధికో రియల్‌ సంస్థ వెలిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, బాచుపల్లి, నిజాంపేట్‌ ప్రాంతాల్లో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఏజెంట్లను నియమించుకుంటున్నారు. విల్లాలు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లు అంటూ ఊదరగొడుతున్నారు. వాస్తవాలు గుర్తించలేని మధ్యతరగతి కుటుంబాలు రుణాలు తీసుకొని రియల్‌ సంస్థల చేతుల్లో గుమ్మరిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా సుమారు రూ.1000-1500 కోట్ల మేర మోసపోతున్నారని ఓ డీసీపీ వివరించారు.  

సబ్‌రిజిస్ట్రార్లపై విచారణ!

రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో కొందరు సబ్‌రిజిస్ట్రార్‌లు కూడా అక్రమ రిజిస్ట్రేషన్లలో భాగం పంచుకుంటున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని నగరానికి చెందిన పోలీసు ఉన్నతాధికారి వివరించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. డబుల్‌ రిజిస్ట్రేషన్లు, నకిలీ ఆధార్‌కార్డులని తెలిసినా సహకరించిన సబ్‌ రిజిస్ట్రార్లపై ఉన్నతస్థాయిలో విచారణ జరుగుతుందని.. త్వరలో కొందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని