logo

నిబంధనలు అవుట్‌!

ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్‌ సోర్సింగ్‌ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు.

Updated : 02 Jul 2024 04:59 IST

కార్యాలయాల్లో తిష్ఠ వేసిన అక్రమార్కులు

మంచాల తహసీల్దార్‌ కార్యాలయం

మంచాల, అబ్దుల్లాపూర్‌మెట్, న్యూస్‌టుడే: ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లు, ముఖ్యంగా అవుట్‌ సోర్సింగ్‌ ఆపరేటర్లు అదును చిక్కితే చాలు తమ చేతివాటం చూపించి అడ్డదారుల్లో ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా రెవెన్యూ కార్యాలయాల్లో సంబంధిత అధికారుల కళ్లుగప్పి అనర్హులకు పత్రాలు జారీ చేయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల తహసీల్దార్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఆపరేటర్‌.. నగర శివారులోని ఓ మీసేవా కేంద్రం నిర్వాహకుడితో జతకట్టి అనర్హులకు ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉలిక్కిపడి ఆరా మొదలెట్టి.. వనస్థలిపురం ప్రాంతంలోని ఓ మీసేవా కేంద్రం నుంచి వచ్చిన దరఖాస్తులతో మంచాల తహసీల్దార్‌ కార్యాలయంలోని అవుట్‌ సోర్సింగ్‌ ఆపరేటర్‌ వెంటవెంటనే ధ్రువపత్రాలు జారీ చేస్తున్నాడు. మీసేవా నిర్వాహకుడితో ముందస్తు ఒప్పందంతోనే పత్రాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల విదేశాల్లో చదువుల కోసం ఓ విద్యార్థినికి జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రం సరైనదేనా అనే విషయంపై రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్‌ సొసైటీ నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి ఫైల్‌ రావడంతో క్షేత్రస్థాయి పరిశీలనతో ధ్రువ పత్రాల జారీలో అక్రమాలు తహసీల్దార్‌ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఆరా తీస్తే ఇటీవల ఒకే మీసేవా కేంద్రం నుంచి వచ్చిన పలు దరఖాస్తులు ఆమోదం పొంది ధ్రువపత్రాలు మంజూరైనట్లు ఆయన గుర్తించారు. వెంటనే బాధ్యులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ విషయం జిల్లాలోని ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లోని అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం పలు కార్యాలయాల్లోని అధికారులు తమ పరిధిలో జారీ అయిన ధ్రువపత్రాల వివరాలను సరిచూస్తూ, ఏమైనా అక్రమాలున్నాయా అన్న విషయంపై దృష్టిపెట్టి పరిశీలనతో ముగినిపోయారు.

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..

-అనంతరెడ్డి, ఆర్డీవో, ఇబ్రహీంపట్నం

అనర్హులు ధ్రువపత్రాలు పొందినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సంబంధిత తహసీల్దార్‌కు చెప్పాను. వెంటనే పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు నివేదిక వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని