logo

పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా

అండాశయ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్‌ ఆసుపత్రిలో చేర్పించారు.

Published : 02 Jul 2024 02:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: అండాశయ కేన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు వ్యాధి బాగా ముదిరిపోయి నాలుగో దశలో ఉందని, కొన్ని మందులిఇచ్చి.. ఇక్కడ ఉంటే బిల్లు పెరిగిపోతుందని పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌కు రిఫర్‌ చేశారు. ఎలాగైనా ఆమెను బతికించుకోవాలని కుటుంబ సభ్యులు పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌కు కాకుండా.. మరో ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి తెలిసినా ఆమెను చేర్చుకొని వారంపాటు ఏవో చికిత్సలు చేసి రూ.6.25లక్షల బిల్లు చేతిలో పెట్టి.. ఇక ఇక్కడా తగ్గదు ఇంటికి వెళ్లిపోవాలని అసలు విషయం చల్లగా చెప్పారు. లబోదిబోమన్న కుటుంబ సభ్యులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. అప్పోసప్పో చేసి ఆ మొత్తాన్ని చెల్లించి అక్కడినుంచి బయట పడ్డారు. వీరు ముందే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి ఉంటే.. పైసా ఖర్చు లేకుండా సేవలు పొందే అవకాశం ఉంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

అత్యాధునిక సేవలు.. జ్వరమనో..గుండె దడ ఉందని ప్రైవేటు ఆసుపత్రికి వెళితే.. పరీక్షల నుంచి ఇతర చికిత్స కోసం రూ.లక్షల్లో బిల్లులు కట్టాల్సి వస్తోంది. క్యాన్సర్, అవయవ మార్పిడి లాంటి క్లిష్టమైన చికిత్సలు అవసరమైతే ఖర్చు భారీగా ఉంటోంది. చిరు ఉద్యోగులు, మధ్యతరగతి జీవులు, పేదలు ఈ ఖర్చులు భరించే పరిస్థితి లేదు.

ఉస్మానియా ఆసుపత్రి: 

  • ఇక్కడా తుంటి, మోకీళ్ల మార్పిడికి ప్రత్యేక విభాగం నడుస్తోంది. నెలకు 40-50 మోకీళ్ల చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేటులో రూ.3-4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 
  • కాలేయ మార్పిడి సేవలు ఉచితం. కుటుంబ సభ్యుల నుంచి కాలేయం అందించడానికి దాత అందుబాటులో ఉంటే.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు మంజూరు చేసి చికిత్సలు అందిస్తున్నారు. గుండె వ్యాధులకు బైపాస్‌ సర్జరీలతోపాటు స్టంట్‌లు వేసి ప్రాణాలను కాపాడుతున్నారు.

ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి: క్యాన్సర్‌ చికిత్సలు అంటే పేదలు తట్టుకునే పరిస్థితి లేదు. ఎంఎన్‌జేలో ఎంతోమంది పేదలకు అధునాతన చికిత్సలు అందుతున్నాయి. మెదడు, మెడ నోరు, అన్నవాహిక, కాలేయం, పొట్ట, పెద్దపేగు, కిడ్నీ, ఊపిరితిత్తులు.. ఇలా అన్ని క్యాన్సర్లకు ఉచితంగా సేవలుందుతున్నాయి.  

  • కణితుల తొలగింపులో అత్యాధునికమైన రోబో సేవలు అందుతున్నాయి. ఇప్పటికే 150 సర్జరీలు పూర్తి చేశారు.
  • రేడియేషన్‌ చికిత్సల్లో రూ.30కోట్ల రేడియేషన్‌ యంత్రం త్వరలో ప్రారంభంకానున్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని