logo

పీల్చే గాలే పిప్పి చేస్తోంది

నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు.

Updated : 02 Jul 2024 05:06 IST

కాలుష్యంతో పెరుగుతోన్న మరణాలు
ప్రత్యేక అధ్యయనం అవసరమంటున్న పర్యావరణ వేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పెరుగుతున్న కాలుష్యం నిశ్శబ్ద హంతకిగా మారుతోంది. క్రమక్రమంగా విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ‘స్టేటస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌’ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2000 నుంచి 2019 వరకు నగరంలో పీఎం 2.5 వంటి (సూక్ష్మధూళి కణాలు) ఉద్గారాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది. 2000 సంవత్సరం నాటికి కాలుష్యం బారిన పడి 2,810 మంది మరణిస్తే 2019 నాటికి ఆ సంఖ్య 6,460కి చేరుకుంది. అంటే 2000 సంవత్సరంలో లక్ష మందికి 47 మంది మరణించగా...2019 నాటికి 76.9 మరణాలకు చేరుకుందని అధ్యయనంలో తేలింది. ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ సంస్థ చేసిన లెక్కల ప్రకారమే ఈ స్థాయిలో మరణాలు ఉంటే నిక్కచ్చిగా శాంపిళ్లు సేకరించి అధ్యయనం చేస్తే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కాలుష్య ప్రభావంపై ప్రభుత్వమే చొరవ చూపి ఆసుపత్రుల నుంచి వివరాలు సేకరించి అధ్యయన ఫలితాలు వెల్లడించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

దిల్లీతో పోలిస్తే.. అధ్యయన నివేదిక ప్రకారం కాలుష్యం కారణంగా సంభవించిన మరణాలను లెక్కిస్తే దిల్లీబాటలోనే నగరం పయనిస్తోందని స్పష్టమవుతోంది. 2000లో ఇక్కడ లక్ష మందికి 94 మంది మరణించగా, 2019లో 106కి చేరుకుంది. కాలుష్య ఉద్గారాల స్థాయి పెరిగితే నగరం దిల్లీలా మారే పరిస్థితి రాకపోదు.

పోలీసులు, ఇతర విభాగాలపై అధ్యయనం చేయాలి

- డి.నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త

కాలుష్య ఉద్గారాలు వాటి వల్ల సంభవించే మరణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. గత రెండు దశాబ్దాల్లో కాలుష్య ఉద్గారాల స్థాయి పెరిగిపోయింది. కేవలం పీఎం 2.5 వివరాలను తీసుకుంటే సరిపోదు. పీఎం 10, నగరంలో ప్రధాన సమస్యగా పరిణమించిన బెంజిన్‌ స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ‘స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌’ రిపోర్టులో చెప్పిన లెక్కలు ఐదేళ్ల క్రితానివి. ఐదేళ్లలో కాలుష్య స్థాయి మరింతగా పెరిగింది.  దీని అధికంగా ఉండే ప్రభుత్వ విభాగాల్లోని అధికారుల ఆరోగ్యంపై అధ్యయనం చేయాలి.

‘స్టేటస్‌ ఆఫ్‌ గ్లోబర్‌ ఎయిర్‌-2022’ లెక్కల ప్రకారం... కాలుష్య ప్రభావంతో నమోదైన మరణాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని