చిన్న మొత్తాలపై.. చిన్నచూపు

సైబర్‌ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు.

Updated : 02 Jul 2024 05:00 IST

ఈనాడు- హైదరాబాద్‌: సైబర్‌ నేరాలను కొందరు పోలీసులు చిన్నచూపు చూస్తున్నారు. రూ.20 వేలు అంతకంటే తక్కువ మొత్తాల్లో పోగొట్టుకున్న బాధితులు పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేస్తుంటే..ఎందుకులే అని పక్కన పెట్టేస్తున్నారు. పోగొట్టుకుంది తక్కువ డబ్బే కదా అంటూ కొన్నిసార్లు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేస్తే సరిపోతుందని.. కేసు అవసరం లేదని చెప్పి పంపిస్తున్నారు. సైబర్‌ నేరాలపై బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగేస్తున్నారని అధికారులే బాహాటంగా ప్రకటిస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్లలో సైబర్‌ నేరాల్లో నిత్యం సుమారు రూ.కోటికిపైగా పోగొట్టుకుంటున్నట్లు పోలీసుల అంచనా. వాస్తవానికి అంతకంటే 10 రెట్లు ఎక్కువ డబ్బు నేరగాళ్లు కొట్టేస్తున్నారని భావిస్తున్నారు. పరువు పోతుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది బయటకు చెప్పడంలేదని పేర్కొంటున్నారు. ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్న వారిని వెనక్కి పంపడం విమర్శలకు తావిస్తోంది. ఈ తరుణంలో పోగొట్టుకున్న చిన్నమొత్తాల ఫిర్యాదులపై సరిగా స్పందించకపోవడం సమస్యను మరింత పెంచుతోంది.

కేసుల భారం ఎందుకని..!

కేసుల భారం పెరుగుతుందనే ఉద్దేశంతో చిన్నపాటి సైబర్‌ నేరాలపై దృష్టి సారించడంలేదనే విమర్శలున్నాయి. సైబర్‌ నేరాల్లో రికవరీ రేటు సగటున 5 శాతం కంటే తక్కువ. నిందితులు ఒక రాష్ట్రంలో ఉండి ఇంకో ప్రాంతం నుంచి మోసగిస్తున్నట్లు మాయ చేస్తారు. వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు నెలలు పడుతోంది. సైబర్‌క్రైమ్‌ పోలీసులు పూర్తిస్థాయిలో ఇలాంటి నేరాలపై దృష్టి పెడుతున్నందున రికవరీ, నిందితుల గుర్తింపు కొంతమేర సాధ్యమవుతోంది. శాంతిభద్రతల పోలీసుస్టేషన్‌లో నిపుణుల సంఖ్య తక్కువ. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే.. పెండింగ్‌ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందనే భావనతో సైబర్‌ నేరాలపై నిర్లక్ష్యం జరుగుతోంది. ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమయ్యే తమకు సైబర్‌ నేరాల వల్ల పనిభారం ఎక్కువ అవుతోందని కొందరు ఇన్‌స్పెక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది నిత్యం వివిధ ప్రాంతాల్లో గస్తీలో ఉంటారు. రోజువారీగా జరిగే నేర పరిశోధనలో కొందరు నిమగ్నమవుతారు. బందోబస్తు, ప్రముఖుల రాకపోకలు, రోడ్డు ప్రమాదాలు, ఆందోళనలు తదితర వాటికి బందోబస్తుకు పంపించాలి. తీవ్ర పని ఒత్తిడితో ఉన్నప్పుడు శాంతి భద్రతల ఠాణాలో సైబర్‌ నేరాలపై దృష్టి కొంత తక్కువగా ఉంటోందని ఇన్‌స్పెక్టర్లు అంగీకరిస్తున్నారు. లైంగిక వేధింపులు, లోన్‌ యాప్‌ వంటి నేరాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.

సైబర్‌ వారియర్లు ఉన్నా..!

సైబర్‌ నేరాలపై ప్రతి కమిషనరేట్‌లో ప్రత్యేకంగా సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. కొన్నేళ్లుగా నేరాలు  పెరగడంతో ప్రతి పోలీసుస్టేషన్‌లో ప్రత్యేకంగా సైబర్‌ వారియర్లను నియమించారు. సైబర్‌ నేరాలపై ఫిర్యాదు తీసుకోవడం, నిందితుల్ని గుర్తించడం సహా కొన్ని సాంకేతిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సైబరాబాద్‌లో రూ.50 వేలు.. రాచకొండలో రూ.1.5 లక్షలు.. హైదరాబాద్‌లో రూ.1 లక్షల కంటే ఎక్కువ కోల్పోతే సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. అంతకంటే తక్కువ మొత్తం పోగొట్టుకుంటే స్థానిక ఠాణాల్లోనే ఫిర్యాదు చేయాలి. ఉన్నతాధికారులు ఎక్కడికక్కడ పని విభజన చేస్తున్నా.. కొందరి నిర్లక్ష్యం కారణంగా ఫిర్యాదులు తీసుకోవడంలో అలసత్వం జరుగుతోంది.

ఇదీ ఉదాహరణ

నగరానికి చెందిన యువకుడికి పాతస్నేహితుడి పేరుతో ఒకరు ఫోన్‌ చేశారు. కొద్దిసేపు మాట్లాడి నమ్మించిన తర్వాత ఆర్మీ క్యాంటీన్‌లో ఉత్పత్తులు ఇప్పిస్తానని రూ.22వేలు తనఖాతాకు జమ చేయించుకున్నాడు. తర్వాత ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. మోసమని తెలుసుకున్న బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. తర్వాత ఠాణాకు వెళ్లి అధికారులను కలవగా, 1930కు  ఫిర్యాదుచేస్తే సరిపోతుందని చెప్పారు. నిందితుడి బ్యాంకు ఖాతా స్తంభింపజేశామని.. నిలిచిపోయిన డబ్బులు త్వరలోనే తిరిగి వస్తాయని చెప్పి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని