logo

అంతస్తుకో ధర.. గజానికో లెక్క

ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది.

Updated : 02 Jul 2024 07:10 IST

లంచం తీసుకుని లోటస్‌పాండ్‌ పార్కు కబ్జాకు మద్దతు
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లలో జోరుగా వసూళ్లు
టౌన్‌ప్లానింగ్‌లో ఇలా.. ఉన్నతాధికారులు పట్టించుకోరా?
ఈనాడు, హైదరాబాద్‌

న్నతాధికారుల నిర్లక్ష్యమో...అమ్యామ్యాలకు ఆ కార్యాలయం నిలయంగా మారడమో కానీ అక్కడి కొంతమంది అధికారులు చేసే దందాకు లెక్కేలేకుండా పోతోంది. ఇందులో మరికొంతమంది అధికారులకు వాటాలేకపోతే ఇంత విచ్చలవిడిగా అక్రమాలకు తెగించే పరిస్థితి ఉంది. ఆ ప్రాంతమంతా బడాబాబులుంటారు..ఎంత అడిగినా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో అక్రమాలకు తెగిస్తున్నాడని తెలిసినా ఉన్నతాధికారులు ఉపేక్షించడమే అనుమానాలకు తావిస్తోంది.

అతని లెక్క ఇదీ...: అంతస్తుకో ధర, గజానికో లెక్క అంటూ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ అధికారి వసూళ్లకు పాల్పడుతున్నారు. మరో అధికారి 15 రోజులు సెలవు పెట్టి దందా చేస్తున్నాడు. ఇప్పటి వరకు అనుమతిలేని నిర్మాణాలే అతని లక్ష్యంగా ఉండేవి. ఇప్పుడు ఖాళీ స్థలాలు, పార్కులపైనా కన్నేశాడు.

దందా తీరిలా..: అనుమతి లేదంటూ శ్రీనగర్‌కాలనీ పెట్రోల్‌ బంకు ఎదురుగా ఉన్న భవన నిర్మాణాన్ని ఆపేశారు. అక్రమ నిర్మాణమని బోర్డును కూడా ఏర్పాటుచేశారు. భవన యజమాని సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేసే ముఠాను ఆశ్రయించి బేరం కుదుర్చుకోవడంతో, సెక్షన్‌ అధికారి ‘విశాల’ హృదయంతో బోర్డును తొలగించారు.

  • జూబ్లీహిల్స్‌లో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి చేపట్టిన అక్రమ నిర్మాణానికి దన్నుగా నిలిచారు.
  • గతంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.5లో విలేకరుల ముసుగులోని కొందరు వ్యక్తులతో కలిసి ఓ యజమానిని బెదిరించి రూ.13లక్షలు డిమాండ చేయగా. బాధితుడు అవినీతి నిరోధకశాఖకు పట్టించారు. ఇటీవల జూబ్లిహిల్స్‌ రోడ్డు నెం.10లోని ఓ యజమాని నుంచి రూ.1.2కోట్లు డిమాండ్‌ చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఘటనల్లో ఆ అధికారి జైలుకు వెళ్లొచ్చారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఆయన్ను అదే సర్కిల్‌లో, అదే స్థానంలో కొనసాగిస్తుండటం విశేషం.

బదిలీలు లేకనే..: జోనల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాల్లోని న్యాక్‌ ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, చైన్‌మెన్లు ఏళ్ల తరబడి ఒకే స్థానంలో పని చేస్తున్నారు. ప్రజలను పీడిస్తూ.. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ.. రూ.కోట్లు గడిస్తున్నారు. కొందరు సహాయ ప్రణాళికాధికారులు, సర్కిళ్లు, జోనల్‌ ఉన్నతాధికారులకు, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులకు ముడుపులను అందిస్తున్నారని, అందుకే ఎవరినీ కదపట్లేదనే విమర్శలొస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని