logo

పరిశ్రమలకు ప్రోత్సాహం.. ఉపాధికి ఊతం

యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది.

Published : 02 Jul 2024 02:15 IST

ఎదురుచూస్తున్న యువత

గ్రామీణ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది కోటీశ్వరులగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

ఇటీవల మహిళా శక్తి క్యాంటిన్ల ప్రారంభోత్సవంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క.

వివిధ వ్యాపారాలను నిర్వహించేందుకు  వడ్డీలేని రుణాలను ప్రభుత్వం మంజూరుచేస్తుంది.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌.

న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌: యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు శకి క్యాంటిన్ల నిర్వహణతో పాటు స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతోంది. దీంతో జిల్లా యువతలో  ఆశలు రేకెత్తుతున్నాయి. పూడూరు, పరిగి, వికారాబాద్‌ తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు గతంలోనే అంకురార్పణ జరిగినా అనుకున్న స్థాయిలో ముందడుగులు పడలేదు. తాజాగా  ప్రభుత్వం మహిళా శక్తి క్యాంటిన్లు, స్వయం ఉపాధి ప్రోత్సాహకాలు వంటివి చేపడుతుంటంతో జిల్లా యువత సానుకూల ఆశావాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2008లోనే పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రతిపాదన: పూడూరు మండలం తిర్మలాపూర్, పూడూరు గ్రామ పంచాయతీల పరిధిలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం  పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సర్వే నంబరు 5లోని పేదల బతుకు తెరువు కోసం ఇచ్చిన భూములను గుర్తించారు. హైదరాబాద్‌ - బీజాపూర్‌ జాతీయ రహదారి కలిగి ఉండటంతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణా పరంగా తగిన సౌకర్యంగా ఉంటుందని భావించారు. అనువైన ప్రదేశం కావటంతో పాటు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉండటంతో 2008లో అధికారులు పారిశ్రామికవాడ ఏర్పాటుకు ప్రతిపాదించారు. మొత్తం 113 ఎకరాలను స్వాధీనం చేసుకుని పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కి అప్పగించారు. ఈ ప్రదేశంలో సదుపాయాలు కల్పించేందుకు అప్పట్లో రూ.30 కోట్లతో నీటి సదుపాయం, రెండు వరుసల బీటీ రోడ్లు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు వంటి వివిధ పనులు పూర్తి చేయించారు. ఇక్కడ మొత్తం 38 పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ప్రారంభంలో నిర్వాహకులు ముందుకు రాకపోవటంతో చాలకాలంగా ఈ స్థలం ఖాళీగానే కనిపించింది.  

శీతలీకరణ గిడ్డంగులు, ఆహారశుద్ధి కేంద్రాలు: జిల్లా అచ్చంగా వ్యవసాయాధారిత ప్రాంతం. కూరగాయలు దాదాపు 20వేల ఎకరాల్లో పండిస్తున్నారు.  రాజధాని వాసుల అవసరాలను తీరుస్తున్నారు. కానీ శీతలీకరణ గిడ్డంగులు, ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో నష్టపోతున్నారు. పొదుపు సంఘ సభ్యులను ప్రోత్సహించడంలో భాగంగా రాకంచర్లలో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్‌ శివారు కాటేదాన్‌ ప్రాంతంలో కొనసాగుతున్న వివిధ పరిశ్రమలను రాకంచర్లకు రప్పించేందుకు గత భారాస ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాటేదాన్‌ ప్రాంతంలోని ఆయా కంపెనీల యజమానులకు రాకంచర్లలో ప్లాట్లు కేటాయించారు. ఇంతచేసినా ఇప్పటివరకు పదికి మించి రాలేదు. తాజాగా ప్రభుత్వ యోచనతో జిల్లాలో పరిశ్రమలు వృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

అర్కతలలో ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటు

ప్రభుత్వం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు తగిన చొరవ తీసుకుంటోంది. నవాబ్‌పేట మండలం అర్కతల గ్రామంలో ఆహార శుద్ధి కేంద్రం (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌)ను నెలకొల్పనున్నారు. జిల్లాలో 2024-25 సంవత్సరానికి గాను 30 పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించారు. వీటిలో 10 యూనిట్లకు మంజూరు లభించింది. 

వినయ్‌కుమార్, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్, వికారాబాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని